-ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు -రెండేండ్లలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ సాధిస్తాం -భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు. నల్లగొండ జిల్లా రైతుల కష్టాలను తీర్చడానికి నక్కలగండి, ఎస్‌ఎల్‌బీసీ ప్యానల్, బునాదిగాని కాల్వ, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వల పనులను వేగవంతం చేసి వచ్చే సీజన్‌కల్లా సాగునీరు అందిస్తామని హామీఇచ్చారు. పెండింగ్ ప్రాజెక్టులకు సత్వరమే నిధులు విడుదల చేస్తామన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా భువనగిరి డివిజన్ పరిధిలోని బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, భువనగిరి మండలాల్లోని బునాదిగాని, బొల్లేపల్లి, పిలాయిపల్లి కాల్వలను ఆయన పరిశీలించి మాట్లాడారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల రైతులకు ఉపయోగపడే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులు సైతం వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యంతోనే 12 ఏండ్లయినా సాగునీటి కాల్వలు పూర్తి కాలేదన్నారు. కాల్వల విస్తరణలో భూములు నష్టపోయిన వారికి రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో 6 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటును రెండేండ్లలో పూర్తి చేసి మిగులు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయకుండా ఏపీ సీఎం చంద్రబాబు జిల్లా రైతుల ఉసురు పోసుకుంటున్నాడని ఆరోపించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మలిపెద్ది సుధీర్‌రెడ్డి, జేసీ సత్యనారాయణ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, పార్టీ క్రమశిక్షణా సంఘం రాష్ట్ర చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి తదితరులు ఉన్నారు.