రూ.5కే భోజనం.. రూ.3కు టిఫిన్ మార్కెట్లో రైతులే అతిథులు కనీస సౌకర్యాలు కల్పిస్తాం మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు

పేదలకు ఐదు రూపాయలకే కడుపునిండా బువ్వ పెడతామని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రూ.5లకే భోజన వసతి, రూ.3లకు టిఫిన్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయాల మార్కెట్‌లో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుతో కలిసి కూరగాయల మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు, హమాలీలు, వ్యాపారుల కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. దశల వారీగా మిగతా మార్కెట్లకూ విస్తరిస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని కూరగాయల మార్కెట్‌లో మంత్రులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం వంటి వాటిని పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, వ్యాపారులు, కవిూషన్ ఏజెంట్లతోనూ చర్చించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంత గదుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌కు వచ్చిన రైతు విశ్రాంతి తీసుకొనేందుకు మంచాలు, ఫ్యాన్లు లేకపోవడం, కనీసం నీటి సౌకర్యం, మరుగుదొడ్ల వసతి కల్పించకపోవడం వంటివన్నీ తమ దృష్టికి వచ్చాయని ఆయన చెప్పారు. రైతులు, హమాలీలు, వ్యాపారులు తమ దృష్టికి తీసుకువచ్చింది ప్రధానంగా క్యాంటీన్ సమస్యపైనేనని తెలిపారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అది కూడా నాణ్యత లేని భోజనం పెడుతున్నారని చెప్పారన్నారు. రైతులు, హమాలీల కోసం సబ్సిడీ పథకాన్ని అమలు చేయనున్నట్లు హరీశ్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా బోయిన్‌పల్లి మార్కెట్‌లో రూ.5లకే భోజనం, రూ.3లకే టిఫిన్ అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీన్ని దశల వారీగా మిగతా మార్కెట్లకూ విస్తరిస్తామన్నారు. సబ్సిడీ భోజన పథకంపై అధ్యయానికి అధికారుల బృందాన్ని చెన్నైకి పంపించనున్నట్లు తెలిపారు. అలాగే, మార్కెట్లలో వసతుల కోసం అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మార్కెట్లలో రైతులకు, హమాలీలకు విశ్రాంత గదులు ఏర్పాటు చేస్తామని, అందులో కనీస వసతులు కల్పిస్తామన్నారు. ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఇప్పటికే రైతుబజార్లలో సబ్సిడీ ధరకు విక్రయాలు ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో ఉల్లి సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ఉల్లి సాగుపై అధ్యయానికి అధికారుల బృందాన్ని నాసిక్‌కు పంపించనున్నట్లు వెల్లడించారు.