-బంజరాహిల్స్ బడాబాబుల కోసం కాదు: ఈటెల
ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పేద ప్రజల సంక్షేమం కోసం.నిరుద్యోగ యువత కోసం. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడం కోసం. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పేద ప్రజల కన్నీళ్లు తుడవడానికే, బంజరాహిల్స్‌లో బంగ్లాల్లో ఉండేవారి కోసం కాదు అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టంచేశారు.మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాలలో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు.
ఉద్యమంలో అనేకమంది విద్యార్థులు ప్రాణాత్యాగం చేసుకున్నారని, మహిళలు, విద్యార్థులు, యువకులతో అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలోకి వచ్చి రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. వచ్చే దసరా నుంచి కొత్తగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం వికలాంగులకు రూ. 1500, వితంతువులు,వృద్ధులకు రూ.వెయ్యి పింఛన్లు అందజేస్తామని హామీఇచ్చారు. ఐదేండ్లల్లో రాష్ర్టాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామస్థాయి సమస్యలు తెలుసుకోవడానికే మన ఊరు-మన ప్రణాళికను ప్రభుత్వం చేపట్టిందన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.