-సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి -రైతులకు ఎలాంటి నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి -వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం

రాష్ట్రంలో పత్తి రైతులకు ఎలాంటి నష్టం రానివ్వబోమని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని, పత్తి రైతులకు యుద్ధప్రాతిపదికన గుర్తింపు కార్డులు జారీచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సచివాలయం నుంచి సోమవారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారులు, మార్కెఫెడ్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులతో హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్కెటింగ్‌శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి, ఎండీ శరత్, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మిబాయిలతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో పత్తి కొనుగోళ్లలో దళారీలను నిరోధించాలని ఆదేశించారు.
నిర్దేశిత తేదీల ప్రకారం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సూచించారు. పత్తి కొనుగోలు లావాదేవీలు ముగిసే వరకు మార్కెటింగ్‌శాఖ అధికారులతోపాటు సీసీఐ సిబ్బంది కూడా మార్కెట్‌లోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జిల్లా కలెక్టర్లు సీసీఐ కొనుగోలు కేంద్రాలను అవసరాన్ని బట్టి రీ ఆర్గనైజ్ చేసుకోవాలని సూచించారు. జిల్లాల్లోని సీసీఐ కేంద్రాలను కలెక్టర్లు, జేసీలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, సీసీఐ అధికారులతో సమన్వయం చేసుకొంటూ ముందుకెళ్లాలని ఆదేశాలిచ్చారు.
జిల్లాస్థాయిలో మార్కెటింగ్, రెవెన్యూశాఖల తరపున ఒక్కో నోడల్ అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాలకు దగ్గరలో ఉన్న వే బ్రిడ్జీల ద్వారా తూకం వేయించాలని, తేమను గుర్తించే యంత్రాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని తెలిపారు. ఫైర్ ఫైటింగ్ యంత్రాలు, కవర్డ్ షర్ట్స్ లాంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శించరాదని స్పష్టంచేశారు. కొనుగోళ్లు జరిగేచోట అధికారులు, సిబ్బంది డ్రెస్‌కోడ్‌తోపాటు గుర్తింపు కార్డులను తప్పని సరిగా ధరించాలన్నారు.
ఆన్‌లైన్‌లో చెల్లింపులు రైతులు సరుకు అమ్మిన వెంటనే వారికి రావాల్సిన డబ్బును ఆన్‌లైన్‌లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. పత్తి రైతులకు ఇచ్చే తక్ పట్టి కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. పత్తి రైతులకు అవగాహన కలిగించడానికి ప్రచార కార్యక్రమం చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పత్తిలో 8 నుంచి 12 శాతంలోపు మాత్రమే తేమ ఉండేలా రైతులను అప్రమత్తం చేయాన్నారు. తేమ 8 శాతం ఉంటే క్వింటాకు రూ.4,100, 9 శాతం తేమ ఉంటే రూ.4,059, తేమ 10 శాతం ఉంటే రూ.4,018, తేమ 11శాతం ఉంటే రూ.3,977, తేమ 12శాతం ఉంటే రూ.3,936లు చెల్లించేలా చూడాలన్నారు. పత్తిలో తేమ 12శాతానికి మించి ఉంటే సీసీఐ కొనుగోలు చేయదనే విషయం రైతులకు తెలియజేయాలని సూచించారు.
రైతులు మార్కెట్‌కు విడి పత్తిని మాత్రమే తీసుకొచ్చేలా చైతన్యం చేయాలన్నారు. ఈ మేరకు కరపత్రాలు, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించాలని అధికారును ఆదేశించారు. రైతులకు రవాణ సౌకర్యం కల్పించాలని, గోదాముల అగ్రిమెంటు, లేబర్ కాంట్రాక్ట్, మిల్లుల అగ్రిమెంట్ ఉండేలా సీసీఐతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మక్కల కొనుగోలు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి వివరించారు.