పత్తిపంటకు కనీస మద్దతుధర పెంపు, తేమపై కాటన్ కార్పొరేషన్ విధించిన ఆంక్షల తొలగింపు, నత్తనడకన సాగుతున్న కొనుగోళ్ళు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, చెల్లింపులో జరుగుతున్న జాప్యం తదితర అంశాలపై కేంద్ర జౌళిమంత్రి సంతోష్ గంగ్వార్‌తో రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందం బుధవారం విస్తృతంగా చర్చించింది. సుమారు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి స్పష్టమైన హామీలు ఇచ్చారు. కనీస మద్దతుధర పెంపు, తేమశాతం పరిమితులను సవరించడం వంటి అంశాలపై త్వరలోనే కమిటీనే ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని, మిగిలిన అంశాలపై సత్వరమే చర్యలను తీసుకుంటామని తెలిపారు.

-కేంద్ర జౌళిమంత్రి సంతోష్ గంగ్వార్ -కొనుగోలు కేంద్రాల్లో గరిష్ఠ పరిమితిపై ఆంక్షల సడలింపు -మద్దతుధర, తేమ పరిమితి పెంపుపై హామీ -ఆన్‌లైన్‌లో చెల్లింపులకు త్వరలో పకడ్బందీ వ్యవస్థ -7, 8 తేదీల్లో అదనపు కార్యదర్శి పర్యటన
భేటీలో విస్తృతంగా అనేక అంశాలను చర్చించడమే కాకుండా అప్పటికప్పుడే అధికారులను పిలిచి తెలంగాణ పత్తిరైతుల వ్యవహారంపై సమీక్ష జరిపారు. వెంటనే తగినచర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి సంతోష్ గంగ్వార్ మీడియాతో మాట్లాడుతూ, కనీస మద్దతుధర పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సింది వ్యవసాయ మంత్రిత్వశాఖ కాబట్టి కమిటీలో ఈ విషయాన్ని చర్చిస్తామని తెలిపారు. క్వింటాల్ పత్తి కనీస మద్దతుధర రూ. 4,100 నుంచి రూ. 5,000కు పెంచడంపై త్వరలో నిర్ణయం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా తేమశాతం 8 నుంచి 12 వరకు ఉంటేనే కొనుగోలు చేయాల్సిందిగా కాటన్ కార్పొరేషన్ నిబంధనలు రూపొందించిందని, దీన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నట్లుగా ఆ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా 20% వరకు పెంచడంపై కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి కేంద్ర క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణా సర్కారు విజ్ఞప్తి మేరకు ఇకపై పత్తికేంద్రాలు వారానికి ఐదురోజులు పనిచేసేలా చూస్తామని స్పష్టం చేశారు. 48 గంటల్లోనే బ్యాంకుల ద్వారా ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరిగేలా పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తామని తెలిపారు. రైతులు పత్తి అమ్ముకోడానికి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత గరిష్ఠంగా ఒక్కో రైతు నుంచి రోజుకు 49 క్వింటాళ్ళకు మించి కొనరాదన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో పత్తిరైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను తెలుసుకోవడానికి అదనపు కార్యదర్శి పుష్పా సుబ్రమణ్యం తదితర అదికారులు ఈ నెల 7, 8 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారని, వరంగల్, ఆదిలాబాద్‌లోని కాటన్ కార్పొరేషన్ ప్రాంతీయ కేంద్రాల అధికారులతో వారు సమీక్షిస్తారని తెలిపారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ, బీజేపీ ఎన్నికలకు ముందే పత్తిరైతులకు కనీస మద్దతు ధరను రూ. 5,000కు పెంచడంపై ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు అమలుచేయలేదని గుర్తు చేశారు.
అన్ని మార్కెట్‌యార్డులలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కేంద్రమంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. కనీస మద్దతుధర స్థిరీకరణకుగానూ దళారీల సమస్య లేకుండా చూడాల్సిందిగా కోరామని తెలిపారు. కేంద్రమంత్రిని కలిసిన బృందంలో డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీతో పాటు రాష్ట్రమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత, సీతారాంనాయక్, నగేశ్, బీబీ పాటిల్, బాల్క సుమన్, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, పసునూరి దయాకర్, సలహాదారు పాపారావు, ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రు తెజావత్, డాక్టర్ వేణుగోపాలాచారి తదితరులు ఉన్నారు.