Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పార్లమెంటరీ నేత కేకే

-లోక్‌సభాపక్షనేతగా నామా
-ఎన్నుకున్న టీఆర్‌ఎస్‌పీపీ
-లోక్‌సభలో ఉపనేతగా కొత్త ప్రభాకర్‌రెడ్డి
-రాజ్యసభలో ఉపనేతగా బండాప్రకాశ్
-విప్‌లుగా లోక్‌సభలో బీబీపాటిల్, రాజ్యసభలో సంతోష్‌కుమార్
-రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని నిలదీద్దాం
-మన హక్కులను సాధించుకుందాం
-పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌నేత కే కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఎన్నికయ్యారు. గురువారం టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగింది. ఈ నెల 17 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. పార్లమెంటరీ, లోక్‌సభాపక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లోక్‌సభలో పార్టీ ఉపనాయకుడిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, విప్‌గా జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్‌ను ఎన్నుకున్నారు. రాజ్యసభలో టీఆర్‌ఎస్‌పక్ష ఉపనేతగా బండా ప్రకాశ్, విప్‌గా సంతోష్‌కుమార్ ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషికి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ లేఖరాశారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వైఖరిపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య ఏ విధమైన సంబంధాలు ఉంటాయో.. ఆదేవిధమైన సంబంధాలు ఇకపై కొనసాగిద్దామని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు, హక్కులను సాధించుకుందామని చెప్పారు. రాష్ట్రహక్కుల సాధనకు పోరాడటంలో ఎప్పుడూ ముందుండాలని పార్టీ ఎంపీలకు సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాల్సి ఉండగా.. వారి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల పట్ల ఒక తీరుగా, ఇతర రాష్ర్టాల పట్ల మరోతీరుగా వ్యవహరిస్తున్నాయని సీఎం అన్నారు.

సీఎంకు ఎంపీ బండా ప్రకాశ్ కృతజ్ఞతలు
టీఆర్‌ఎస్ రాజ్యసభాపక్ష ఉపనేతగా తనను నియమించిన సీఎం కేసీఆర్‌కు ఎంపీ బండా ప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. అధ్యక్షుడి ఆదేశాలకు అనుగుణంగా సభలో టీఆర్‌ఎస్ పక్షాన రాష్ట్ర సమస్యలను విన్పిస్తానని తెలిపారు.

బడుగులకు జన్మదిన శుభాకాంక్షలు
రాజ్యసభసభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదినం సందర్భంగా గురువారం ప్రగతిభవన్‌లో ఆయనకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లింగయ్యయాదవ్‌కు శాలువా కప్పి అభినందించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.