-వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం -మ్యానిఫెస్టో నూటికి నూరుపాళ్లు అమలు చేస్తాం -సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో ముందుకెళతాం -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో రాష్ట్రమంత్రి జూపల్లి
కేసీఆర్ సారధ్యంలో సాధించుకున్న రాష్ట్రం ముమ్మాటికీ ఆయన నేతృత్వంలోనే బంగారు తెలంగాణగా మారుతుందని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత జౌళిశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. 60 ఏండ్లుగా తెలంగాణ వివక్షకు గురైందన్న జూపల్లి.. టీఆర్‌ఎస్ అధికార పగ్గాలు చేపట్టిన ఆర్నెల్లలో స్వీయ అస్తిత్వ పరిరక్షణ దిశగా పాలన సాగిందన్నారు. తెలంగాణవైపు యావత్ ప్రపంచం చూస్తున్నదని, సహజ వనరులకు నిలయమైన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పలు అవకాశాలున్నాయన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దూరదృష్టితో రూపొందించిన ప్రణాళిక అమలు చేయడమే తమ ముందున్న సవాల్ అని జూపల్లి చెప్పారు.
ఉద్యమ సమయంలోనే సమగ్రాభివృద్ధికి రూపొందించుకున కార్యాచరణే ఎన్నికల మ్యానిఫెస్టోగా ప్రజల ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నూటికి నూరుపాళ్లు దాన్ని అమలు చేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రమంత్రిగా ప్రమాణం చేసిన జూపల్లి తెలంగాణ తొలి క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశకత్వంతో ముందుకెళతామని బుధవారం నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు
బంగారు తెలంగాణ సాధనలో పారిశ్రామికాభివృద్ధి ప్రధాన అంశం. ఆ శాఖ మంత్రిగా మీ అభిప్రాయమేమిటి? అవును.. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలంటే అనేక పరిశ్రమలు రావాలి. జాతీయ, అంతర్జాతీయ డిమాండ్‌కు తగినట్లు పరిశ్రమలు నెలకొల్పాలి. రాష్ర్టాన్ని ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దాలి.
పరిశ్రమల శాఖలో మీ ప్రాథమ్యాలేమిటి? వ్యవసాయ ఉత్పత్తులకు అవకాశాలు అనేకం. పంటల సాగు గిట్టుబాటు కావాలంటే వాటి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. డిమాండ్‌కు తగినట్లుగా రైతులు పంటల సాగులో వైవిధ్యం ప్రదర్శించాలి. వ్యవసాయ, డెయిరీ, మీట్, ఖనిజాల ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయాలి.
అన్నివర్గాల ప్రశంసలందుకున్న టీఎస్-ఐ పాస్ పాలసీని ముందుకు తీసుకెళ్లడానికి చేస్తారు? అన్ని వర్గాల నుంచి ప్రశంసలు పొందిన మాట పారిశ్రామిక విధానానికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో విస్తృత ప్రచారం కల్పించాలి. దేశ విదేశాల్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమై టీఎస్ ఐ పాస్ విధానాన్ని వివరించాలి. ఈ దిశగా ఆరు నెలల్లో కేసీఆర్ సాధించిన ఘనత అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. పారిశ్రామిక విధాన ప్రోత్సాహానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది.
పెట్టుబడులను ఆహ్వానించేందుకు మీరు అనుసరించే ప్రత్యేక మార్గాలేమిటి? ఇప్పటికే బడా పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. అమల్లోకి తెచ్చిన విధి విధానాలు చాలు. రాష్ట్రంలో సహజ వనరులు అపారం. మానవ వనరులు అంతకంటే ఎక్కువే. దేశ విదేశాల్లో మన వాళ్లు సత్తా చాటుతున్న విషయం అందరికీ తెలుసు.
మహబూబ్‌నగర్ నుంచి వలసల నివారణకు మీరు తీసుకునే చర్యలేమిటి? వివక్షకు, దోపిడీకి గురైన మహబూబ్‌నగర్ జిల్లాలో నీటి ప్రాజెక్టులను చేపడితే ఈ కష్టాలు ఉండేవి కావు. నీటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పించడమే మా ముందు ఉన్న బాధ్యత. మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తా. మహిళా స్వయం సహాయ గ్రూపుల ద్వారా కుటీర పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తాం. అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తాం.
మంత్రిగా చేనేత, జౌళి రంగాభివృద్ధికి మీ కార్యాచరణేమిటి? గతంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న చేనేత, జౌళి రంగాలు పాలకుల నిర్లక్ష్యం, ప్రపంచీకరణతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. వేలాది మగ్గాలు మూతపడ్డాయి. వాటిని తెరిపించడానికి ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. కార్పొరేట్ సంస్థల నుంచి ప్రభుత్వసంస్థలు వస్ర్తాల కొనుగోలు నిలిపేస్తే వేలాదిమందికి పని లభిస్తుంది. చేనేత కార్మికుల ఉత్పత్తులకు మార్కెటింగ్ వసతి కల్పనపై నిఫుణులతో చర్చిస్తాం.
రాష్ట్రమంత్రిగా బాధ్యతలు ఎప్పుడు స్వీకరిస్తున్నారు? ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తా.