-నిత్యజీవితంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నది -ఎఫ్‌సీ కోహ్లీ పరిశోధన కేంద్రం శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్ -టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఐటీ పితామహుడు ఎఫ్‌సీ కోహ్లీ టీసీఎస్ సీఈవో, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ హాజరు నిత్యజీవితంలో టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరుగుతున్నదని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ (ఐఐఐఐటీ) ప్రాంగణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఏర్పాటు చేయనున్న ఎఫ్‌సీ కొహ్లీ సెంటర్ ఆన్ ఇంటెలిజెంట్ సిస్టం (కేసీఐఎస్)కు మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్‌మిస్త్రీ, భారతదేశ ఐటీ పరిశ్రమ పితామహుడు ఎఫ్‌సీ కోహ్లీ, టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ డైరెక్టర్ పీజే నారాయణన్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో చంద్రశేఖరన్, పీజే నారాయణన్‌లు పరిశోధనా సంస్థ ఏర్పాటుపై అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. మొత్తం రూ.20 కోట్ల పెట్టుబడితో 60 వేల చదరపు అడుగుల స్థలంలో కేసీఐఎస్ సెంటర్‌ను నిర్మించనున్నారు.

ఈ కేంద్రంలో ఇంటెలిజెంట్ సిస్టమ్స్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇతర సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి పరిశోధనలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం టాటా గ్రూప్‌తో సత్సంబంధాలను కోరుకుంటుందని అన్నారు. పరిశోధనా సంస్థకు భారత్‌దేశ ఐటీ పరిశ్రమ పితామహుడుగా పేర్కొనే ఎఫ్‌సీ కోహ్లీ పేరు పెట్టినందుకు సైరస్ మిస్త్రీని అభినందించారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు టీసీఎస్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టీహబ్‌కు మిస్త్రీ ఎంతో సహకారమందించారని తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవాలంటే పరిశోధనలు తప్పనిసరి అని అన్నారు. కోహ్లి పరిశోధనా సంస్థ ఏర్పాటుతో ట్రిపుల్ ఐటీలో మరిన్ని పరిశోధనలు జరుగుతాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చేందుకు ఈ పరిశోధనలు తోడ్పడుతాయని తెలిపారు. తెలంగాణలో వివిధ రంగాల్లో టాటాగ్రూప్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సైరస్ మిస్త్రీ మాట్లాడుతూ.. కోహ్లి వారసత్వాన్ని కొనసాగించేందుకు టీసీఎస్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సంయుక్తంగా పరిశోధనాకేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామం అని అన్నారు. టెక్నాలజీ హబ్‌గా మారుతున్న హైదరాబాద్‌లో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సరైన నిర్ణయమన్నారు. పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం బాగుందని మిస్త్రీ ప్రశంసించారు. ఎఫ్‌సీ కోహ్లి మాట్లాడుతూ, విద్యావ్యవస్థను బలోపేతం చేస్తేనే దేశ ఆర్థికవ్యవస్థ మెరుగవుతుందని ఎఫ్‌సీ కోహ్లీ పేర్కొన్నారు. భారతదేశంలోని అన్ని భాషల్లో కంప్యూటర్ వాడకం వచ్చేలా కృషి జరగాలన్నారు. ఇంటిలిజెన్స్ సిస్టమ్స్ అభివృద్ధిలో కోహ్లి రీసెర్చ్ సెంటర్ అత్యంత కీలకపాత్ర పోషించబోతున్నదని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ పీజే నారాయణన్ అన్నారు. పట్టబద్రులకు, స్నాతకోత్సవ, పరిశోధన విద్యార్థులకు అత్యున్నత శిక్షణ అందించడంలో కేసీఐఎస్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. సహజ సిద్ధమైన లాంగ్వేజ్ ప్రాసెసింగ్, రొబోటిక్స్, కాగ్నిటివ్ సైన్సెస్ పరిశోధనలకు కేసీఐఎస్ పరిశోధన సంస్థ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు.