-ఇన్నాళ్లు నాకేం ఇస్తావ్? అంటే పరిశ్రమలు రాలేదు -మీకేం కావాలని ఇప్పుడు ప్రభుత్వం అడుగుతున్నది -సంక్షేమ పథకాల్లో అనర్హులను ప్రజలే గుర్తించాలి -భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సూచన
గత ప్రభుత్వాలు నాకేం ఇస్తావని అడగడంతో వచ్చిన పరిశ్రమలు పారిపోయాయి. ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో పరిశ్రమలకు మీకేం కావాలని అడిగి సింగిల్‌విండో విధానంలో అన్ని అనుమతులు ఇస్తున్నాం. పారదర్శక పాలనే ప్రభుత్వలక్ష్యం అని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
శుక్రవారం మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారంలో మన ఊరు-మన ప్రణాళికలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. 45 రోజుల్లోనే తమ ప్రభుత్వం 43 నిర్ణయాలు తీసుకున్నదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చంద్రబాబు సర్కార్ అనవసర రగడ చేస్తున్నదన్నారు. మీ పిల్లలకు మీరు.. మా పిల్లలకు మేం ఫీజులు కట్టుకుందామనడం తప్పా అని ప్రశ్నించారు. గత పాలకులు ఆఫీసుల్లో కూర్చొని పథకాలు ప్రారంభించి నిధుల వరద పారించేవారు.
నేతలు, అధికారులు పంచుకునేవారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అలా చేయదు. ప్రజలకు అవసరాలపై గ్రామాల నుంచి వచ్చే ప్రణాళికతో ప్రాధాన్యతా క్రమంలో నిధులిస్తాం. దశలవారీగా పనులు పూర్తిచేస్తాం. సంక్షేమ పథకాల్లో అనర్హులను గుర్తించే బాధ్యత ప్రజలే తీసుకోవాలి. ఈ సందర్భంగా గ్రామంలోని 11 కుంటల మరమ్మతులకు వచ్చిన నిధులను కాంట్రాక్టర్ దిగమింగాడని ఆరోపణలు రావడంతో మంత్రి ఆగ్రహించారు. దిగమింగిన ప్రతిపైసాను మళ్లీ వసూలు చేస్తామన్నారు. ఈ అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు.