రైతులకు లక్షరూపాయలలోపు ఇచ్చే పంటరుణాలపై ఎలాంటి వడ్డీ వసూలు చేయరాదని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించింది. రైతుల నుంచి వసూలు చేసిన వడ్డీని వెంటనే వాపసు ఇవ్వాలని సూచించింది. వర్షాభావం దృష్ట్యా వ్యవసాయంతోపాటు అనుబంధ కార్యక్రమాలకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉదారంగా రుణాలివ్వాలని కోరింది.
-రైతులనుంచి తీసుకున్న వడ్డీని వాపసు ఇవ్వండి
-ఎస్సెల్బీసీ సమావేశంలో బ్యాంకర్లకు సర్కారు ఆదేశం
-ఈ ఏడాది 25వేల కోట్ల పంటరుణాలివ్వాలని నిర్ణయం: మంత్రి ఈటల
సచివాలయంలో శుక్రవారం బ్యాంకర్ల రాష్ట్రస్థాయి ఎనిమిదో సమావేశం (ఎస్సెల్బీసీ) నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ ఏడాదికి రూ.78,766 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించింది. సమావేశ నిర్ణయాలను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
రైతులకు 25వేల కోట్ల రుణాలు: పోచారం రాష్ట్రంలోని రైతులకు ఈ ఏడాది రూ.25వేల కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో సెప్టెంబర్ నెలాఖరు వరకు రూ.18వేల కోట్ల రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 80శాతం రుణాలు మంజూరు చేశామన్నారు. పంటరుణాలను రీషెడ్యూల్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని బ్యాంకర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో రూ.7,700 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు రబీ రుణాలు ఇస్తామని వెల్లడించారు. రైతులకిచ్చే లక్షలోపు పంట రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని పోచారం తెలిపారు.
ఇందులో ఆర్‌బీఐ 3శాతం, రాష్ట్రప్రభుత్వం 4 శాతం వడ్డీని భరిస్తాయని వివరించారు. కొన్నిచోట్ల బ్యాంకులు రైతులకు రుణాలిచ్చేటప్పుడే 4 శాతం వడ్డీని మినహాయించుకుంటున్నట్లు ప్రభు త్వం దృష్టికి వచ్చిందని, ఆ వడ్డీని తిరిగి రైతులకు చెల్లించాలని బ్యాంకులను ఆదేశించినట్లు తెలిపారు. లక్షలోపు రుణాలున్న రైతులకు అప్పుమాఫీ చేసినట్లు ప్రభుత్వపరంగా ధ్రువీకరణ పత్రాలిచ్చామని, బ్యాంకులను కూడా త్వరలో ఇవ్వమని ఆదేశించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 36లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేశామని వెల్లడించారు. రబీలో కొత్తగా రూ.7వేల కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించాయని తెలిపారు.
రైతులు రుణాలపై వడ్డీ చెల్లించాల్సిన అవసరంలేదని మరోసారి స్పష్టం చేశారు. పంట రుణాల జారీలో బడుగు, బలహీనవర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెలు, పాడి పశువులను సమకూర్చుకోవడానికి రుణాలివ్వాలని బ్యాంకర్లను కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఈసారి వర్షాభావం ఉన్నప్పటికీ పంటలసాగు బాగానే ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 41,43,000 హెక్టార్ల సాగుభూమి ఉండగా ఇప్పటికే 34,08,000 హెక్టార్లలో పంటలు వేశారని పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
అనర్హుల ఖాతాల్లోకి 800 కోట్లు: మంత్రి ఈటల రుణ మాఫీ పథకంలో కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటివరకు చెల్లించిన 17వేల కోట్లలో దాదాపు 7శాతం రుణాలు అనర్హుల ఖాతాలోకి చేరినట్లు గుర్తించామన్నారు. ఈ మొత్తం రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు ఉంటుందన్నారు. రుణాల మాఫీతోపాటు అవి అర్హులకు చేరుతున్నాయా? లేదా? అనే విషయంపై కూడా శాఖాపరంగా ఆడిట్ నిర్వహిస్తున్నామని ఈటల తెలిపారు. మెదక్ తదితర జిల్లాల్లో రుణమాఫీలో కొన్ని అక్రమాలు జరిగాయని, కొందరు భూమి లేకుండానే బోగస్ పట్టాదారు పాస్ పుస్తకాలతో రుణం తీసుకున్నారని చెప్పారు. అక్రమాలపై పూర్తిస్థాయి అడిట్ నిర్వహించి ఆ డబ్బును తిరిగి రాబడుతామని ఆయన స్పష్టంచేశారు.
రుణాల మంజూరులో నిర్లక్ష్యంపై మంత్రుల అసంతృప్తి రైతులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు మందగమనంలో ఉన్నాయని, ఇంకా వేగాన్ని పెంచాలని మంత్రులు ఈటల, పోచారం అభిప్రాయపడ్డారు. కొన్ని బ్యాంకులు నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి వడ్డీని వసూలు చేయడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్సెల్బీసీ సమావేశంలో గత నాలుగు నెలల్లో బ్యాంకుల పరిస్థితి, రుణాల మంజూరుపై సమీక్షించిన వారు, రుణాల మంజూరులో బ్యాంకర్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. 2015-16 ఖరీఫ్ రుణాల లక్ష్యం రూ.18,032 కోట్లు కాగా జూన్ వరకు రూ.6,029.30 కోట్ల మాత్రమే బ్యాంకులు రుణాలిచ్చాయి. మొత్తం రుణ లక్ష్యంలో ఇది 33.44శాతం మాత్రమే.
రబీలో రూ.9,707.48కోట్ల రుణాలివ్వాలని నిర్ధేశించుకున్నారు. వార్షిక రుణ ప్రణాళిక రూ.69,068.69కోట్లు కాగా ఈ ఏడాది జూన్ వరకు వ్యవసాయం, ఇతర రంగాలకు రూ.49,042.08కోట్ల రుణాలిచ్చారు. ఇందులో 35శాతం వ్యవసాయ రుణాలున్నాయి. రాష్ట్రంలో రెండు వేల జనాభా ఉన్న ప్రతీ గ్రామంలో బ్యాంకింగ్ నెట్‌వర్క్ ఏర్పాటైంది. అన్ని బ్యాంకులలో కలిపి రూ.330.27 కోట్ల డిపాజిట్లున్నాయి. గత నాలుగు నెలల్లో డిపాజిట్లు రూ.2,094 కోట్లకు పెరిగాయి. అడ్వాన్స్ చెల్లింపులు రూ.348.68 కోట్ల వరకు ఉన్నాయి. ప్రాధాన్య రంగాలకు అడ్వాన్స్‌లు రూ.115.07కోట్ల వరకు చెల్లించారు. గతేడాతో పోల్చితే ఇది రూ.4,300 కోట్లు ఎక్కువ. బ్యాంకులలో నగదు నిల్వల నిష్పత్తి దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే రూ.105.57శాతం అధికంగా ఉంది.
నాలుగు నెలల్లో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రుణాల చెల్లింపులు రూ.4,932 కోట్లకు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రుణాలు రూ.240కోట్లు పెరిగాయి. అడ్వాన్స్ చెల్లింపులు రూ.9,455 కోట్లుగా ఉన్నాయి. 2015-16 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంలో బ్యాంకులు 71% ఫలితం సాధించాయి. అన్ని బ్యాంక్‌లు కలిసి వివిధ రంగాలకు మొత్తం 49,042 కోట్ల రుణాలిచ్చాయి. ఎస్సెల్బీసీ సమావేశంలో ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, ఎస్‌బీహెచ్ చీఫ్ జనరల్ మేనేజర్ విశ్వనాథన్, ఎస్సెల్బీసీ కన్వీనర్ వీ శివశ్రీ, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ వీవీవీ సత్యనారాయణ, ఆర్‌బీఐ ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ జీఆర్ రాపోలు పాల్గొన్నారు.