-2020 నాటికి కోటి ఎకరాలకు ప్రాజెక్టుల నీళ్లు -ప్రాజెక్టులు పూర్తయితే రైతుల వార్షికాదాయం 1.25 లక్షల కోట్లు -రైతాంగానికి ముందున్నదంతా స్వర్ణయుగమే -రైతు సమన్వయ సమితులతో లక్షా 61వేల సైన్యం -రైతు సమన్వయ సమితులే గ్రామ కథానాయకులు కావాలి -రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి -యాసంగి నాటికి ప్రీపెయిడ్ కార్డులద్వారా పెట్టుబడి సాయం -సమస్యల పరిష్కారానికి సంకల్పబలంతో సాగుదాం -యాభైశాతం సబ్సిడీపై ట్రాక్టర్లు ఇస్తాం -పొలాల సోలార్ ఫెన్సింగ్‌కూ సబ్సిడీ -రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ -తాను పంటకు పెట్టుబడి సహాయం తీసుకోబోనని ప్రకటన -సదస్సులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

పంట పెట్టుబడిసాయం అందించేందుకు 12వేల కోట్లు వెచ్చించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్ర రైతాంగానికి ముందున్నది స్వర్ణయుగమేనని చెప్పారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితులతో రైతన్నల దశ, దిశ మారుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. 2020 నాటికి కోటి ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా నీళ్లిస్తామని, తద్వారా రాష్ట్ర రైతుల వార్షికాదాయం 1.25 లక్షల కోట్లు అవుతుందని చెప్పారు. అంత సంపద రైతుల వద్ద ఉండటం అంటే అదే బంగారు తెలంగాణ అని అన్నారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితికి గుత్తా సుఖేందర్‌రెడ్డిని చైర్మన్‌గా నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.

రాష్ట్రరైతాంగానికి ముందున్నదంతా స్వర్ణయుగమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రైతు సమన్వయ సమితులతో రైతన్నల దశ, దిశమారుతుందని ఆకాంక్షించారు. ప్రభుత్వం విప్లవాత్మకంగా అమలుచేయనున్న పంటల పెట్టుబడి పథకానికి 12వేల కోట్లు వెచ్చిస్తామని ప్రకటించారు. 2020 నాటికి కోటి ఎకరాలకు ప్రాజెక్టులద్వారా నీళ్లు ఇస్తామని చెప్పారు. దాంతో రాష్ట్ర రైతుల వార్షికాదాయం రూ.1.25 లక్షల కోట్లు ఉంటుందని తెలిపారు. రైతు సమన్వయ సమితుల పేరిట ఏర్పాటయ్యే 1.61 లక్షలమందితోకూడిన సమన్వయ సైన్యం రైతన్నల కష్టనష్టాలను దూరంచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఈ సమితుల్లోని ప్రతి ఒక్కరూ ఒక కేసీఆర్ కావాలన్నారు. రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సులలో భాగంగా తొలి సదస్సు ఆదివారమిక్కడ రాజేంద్రనగర్‌లోని జయశంకర్ వ్యవసాయ వర్షిటీ ప్రాంగణంలో నిర్వహించారు. 13 జిల్లాల సమన్వయ సమితుల సభ్యులు, మార్కెట్ కమిటీలు, డీసీసీబీల చైర్మన్లు హాజరైన సదస్సులో సమన్వయ సమితుల లక్ష్యాలు, విధులు, ప్రభుత్వ విధానాల గురించి సీఎం సుదీర్ఘంగా అవగాహన కల్పించారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. రైతులకు న్యాయంచేయాలన్న లక్ష్యంతో, సంకల్పబలంతో ముందుకెళ్లాలని సమన్వయ సమితులకు పిలుపునిచ్చారు. వారు చేపట్టిన బాధ్యత పవిత్రమైనదని అన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం విశేషాలు ఆయన మాటల్లోనే..

జరిగింది కొంతే.. జరుగాల్సింది ఎంతో రైతుల ఆత్మహత్యలన్న వార్తలను పేపర్లలో చూస్తున్నాం. గత ప్రభుత్వాలు రైతే రాజు అన్నాయి. పెద్ద పెద్ద డైలాగులు చెప్పాయి. కానీ, రైతు పరిస్థితి చెప్రాసీ కన్నా, పాన్‌డబ్బాలో పనిచేసేవారికన్నా దారుణంగా ఉండేది. వ్యవసాయం ఒక జీవనవిధానం. రైతు తన వ్యవసాయ క్షేత్రానికి రాజు. కాలం మంచిగున్నపుడు రైతు ఒక గ్రహంలా ఉండేవాడు. కుమ్మరి, కమ్మరి, కంసాలీ వంటి వృత్తులవారు ఉపగ్రహాలుగా ఉండేవారు. వర్షాలు సకాలంలో పడేవి. కరువు అరుదుగా వచ్చేది. ప్రభుత్వాల అసమర్థత, అవివేకం, ఆలోచనారహిత విధానాలు, పెడమార్గం వల్ల అడ్డంగా చెట్లను నరికారు. వాతావరణ సమతుల్యతను దెబ్బతీసిన ఫలితంగా కురువాల్సిన తీరులో వర్షాలు కురుస్తలేవు. 21 రోజులు చెన్నై నీటిలో మునిగింది. ముంబై, హైదరాబాద్‌లోనూ ఇలాగే జరిగింది. అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. రైతుల పరిస్థితి అనేక విపరిణామాలవల్ల దారుణంగా మారింది. సమైక్యరాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు ఇవ్వగలిగే పరిస్థితి ఉన్నా, ఇచ్చేవారు కాదు. తెలివి తక్కువతనమో పక్షపాత ధోరణో అర్థంకాదు. కరంటు కూడా ఇవ్వలేని దుస్థితికి నెట్టివేశారు. అనేకమంది యువ రైతులు అర్ధరాత్రి కరంటు పెట్టబోయి షాక్‌కొట్టి చనిపోయారు. ఇవన్నీ గతం. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది. చాలామంది మిత్రులతో చర్చలుచేశాం. పోచారం స్వయంగా రైతు బిడ్డ. నేను బక్కపేదను. సీనన్న తెలంగాణ మోతుబరి. ఢిల్లీకి వెళ్తే కూడా ఆయననే ముందుపెడుతుంటా. ఆయనకు లక్ష్మీపుత్రుడు అని పేరుపెట్టిన. ఆయన వ్యవసాయశాఖలో అడుగుపెట్టిన తర్వాత అంతా మంచే జరుగుతున్నది. ఎండకాలంలోనే ఎవ్వరూ ఎరువులగురించి పట్టించుకోనపుడే ఎరువులు, విత్తనాలు తెప్పించి గోదాంలలో పెట్టించి రైతులకు సకాలంలో అందిస్తున్నారు. ఈయనకు సోపతి గోదాముల మంత్రి హరీశ్‌రావు. రాష్ట్రం వచ్చేనాటికి 4లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను 23 లక్షల టన్నుల సామర్థ్యానికి పెంచారు. శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రితో ఏమీకాదు. జరిగింది కొంతే.. జరుగాల్సింది ఎంతో ఉన్నది. రైతు సమన్వయ సమితులు కథానాయకులు కావాలి. గ్రామం, మండలం, జిల్లాలవారీగా రైతు సమస్యలపై చర్చించాలి.
రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమిస్తున్నా. ఆయన రైతు బిడ్డ, స్వయంగా రైతు. ఇప్పటికీ 60-70 ఎకరాల ఆసామి. హైదరాబాద్‌లో తక్కువ, పొలం దగ్గరే ఎక్కువ ఉంటాడు. నల్లగొండలో పాడిపరిశ్రమను అభివృద్ధి చేసిన వ్యక్తి. ఆ డెయిరీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. అన్నిరకాలుగా అనుభవం ఉన్న వ్యక్తి. కాపుదానం బిడ్డయితేనే పని నడుస్తుంది. అందుకే పెద్దకాపాయననే పెద్దకాపుగా పెట్టుకున్నాం. ఆయన పెద్దకాపు.. మనం చిన్నకాపులం. ఇక కథ రంజుగా నడువాలి. ఇక గుత్తకుపైన పెద్దకాపు పోచారం శ్రీనివాస్‌రెడ్డి. ఖమ్మంలో మిర్చి, ఇంకోదగ్గర పత్తి వచ్చిందని రైతులు కోపానికి వచ్చారని, కొట్లాట అయిందని వార్తలు వచ్చాయి. ఏ జిల్లావాడు ఏం తిన్నాడో ఇప్పటివరకు తెలియదు. తెలంగాణ ఆహార అవసరాలేమిటో తెలియవు. మన వ్యవసాయ వర్సిటీ సర్వేచేయించింది. ఎక్కడ ఏ అవసరం ఉందో పుస్తకరూపంలో పేర్కొన్నారు. దీన్ని రైతు సమన్వయ సమితి సభ్యులందరికీ ఇచ్చాం. దీన్ని అటకమీద పెట్టవద్దు. క్షుణ్ణంగా చదువాలి. సమన్వయ సమితుల నాయకులకు శిక్షణ కూడా ఇస్తాం.

కోటీ 65లక్షల ఎకరాల భూముల లెక్కలు తేలాయి భూమిదో హరిగోస. లెక్కపత్రం లేకుండా ఉండేది. పంట పెట్టుబడి కోసం జాబితాలడిగితే వ్యవసాయాధికారులు ఒకటి, రెవెన్యూవాళ్లు ఇంకోటి ఇచ్చారు. రెంటికీ పొంతన లేదు. అందుకే రికార్డుల ప్రక్షాళన చేపట్టాం. కోటీ 65 లక్షల ఎకరాల రికార్డుల ప్రక్షాళన జరిగింది. ఈ భూములకు సంబంధించిన రైతులకు పెట్టుబడి ఇవ్వబోతున్నాం. యాసంగికోసం నవంబర్ నాటికి ప్రీపెయిడ్ కార్డులిస్తాం. మేం ఇక్కడ డబ్బులు జమచేస్తాం. అక్కడ వారు తీసుకోవచ్చు. పాలమూరు ఎత్తిపోతలు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తాం. రాబోయే వానకాలానికి చాలావరకు ప్రాజెక్టులు పూర్తవుతాయి. పాలమూరు, డిండి, సీతారామ, కాళేళ్వరం, దేవాదుల ఎత్తిపోతలను పూర్తిచేసి 2020 చివరినాటికి ప్రాజెక్టుల ద్వారానే కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తాం. తెలంగాణ వచ్చిన తర్వాత మైనర్ ఇరిగేషన్‌పై దృష్టిసారించాం. మిషన్ కాకతీయను ప్రపంచం కొనియాడుతున్నది. వీటిని శాశ్వత ప్రయోజన సాధనాలని, ప్రజలకు మేలుచేస్తాయని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ అన్నారు. స్వయంగా నర్సంపేట చెరువు గట్టు మీద తన పుట్టినరోజు వేడుక చేసుకున్నారు.
కరంటు మోటర్లకు ఆటోస్టార్టర్లు వద్దు ఇక తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లోను కరంటు పోదు. గతంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆటో స్టార్టర్లు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు వాటి అవసరం లేదు. మీరు ఎప్పుడైనా వెళ్లి నీళ్లు పెట్టుకోవచ్చు. కరంటును జాగ్రత్తగా వాడుకోవాలి. ఏడాదిపాటు భూగర్భ జలాలను కాపాడుకోవాలి. 12 గంటల కరంటు ఇస్తే చాలు అని కొందరు అంటున్నారు. కరంటును 24 గంటలూ ఇస్తాం. తగ్గించే ప్రసక్తే లేదు. రైతులకు గతంలో సంఘం ఉండేది కాదు. ఇప్పుడు రైతు సమన్వయ సమితులు ఆటంబాంబులా పనిచేయాలి. తెలంగాణ ఉద్యమసాధనే ఒక ఉదాహరణ. అందరం ఒక్కతాటిపైకి వచ్చి సాధించుకున్నాం. బంగారు తెలంగాణ సాధించుకుంటామన్న నమ్మకం ఉన్నది. మీకోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధం. ఎకరానికి రూ.4వేల పెట్టుబడి విప్లవాత్మక చర్య అని కేంద్ర హోంమంత్రి అన్నారు. దీన్ని వెనక్కు కట్టించుకుంటారా? అని అడిగారు. అలాంటిదేమీ లేదంటే ఆయన చక్కరొచ్చిపడ్డట్టు చేసిండు. దేశంలో, ప్రపంచంలో ఇలాంటి పథకం మరొకటి లేదు. అంకాపూర్ రైతులతో చర్చించినపుడు ఈ పథకం ప్రకటించాను. రూ.12వేల కోట్లు ఖర్చుచేయబోతున్నాం ఇదో చరిత్ర కాబోతున్నది. పాలమూరు, సీతారామ, కాళేశ్వరం దేవాదుల తదితర ఎత్తిపోతల పథకాలను పూర్తిచేస్తే రైతులు పండించే పంట విలువ లక్షా 25వేల కోట్లు ఉంటుంది. అంత సంపద రైతు జేబులో ఉంటే అది బంగారు తెలంగాణనే అవుతుంది. ఇది వందకు వందశాతం నిజం అవుతుంది. ఏదైనా చేయాలంటే ఆత్మవిశ్వాసం కావాలి. ఆంధ్ర నేతలు అనేకరకాలుగా నన్ను అవమానించారు. అయినా, వెనుదిరగలేదు. ఒకసారి ఢిల్లీకి వెళ్లేటపుడు ఇక తిరిగి వచ్చేది తెలంగాణ రాష్ట్రానికే అని చెప్పా. చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టా. సంకల్ప బలంతో దేన్నైనా సాధించవచ్చు. మనం గెలువాలంటే రైతులను సంఘటితం చేయాలి.
కల్తీ విత్తనాలు అమ్మేవారి భరతం పట్టండి కల్తీపై ప్రేక్షకపాత్ర వద్దు. కల్తీ విత్తనమనే పురుగులపై ప్రభుత్వం పీడీ యాక్టు పెట్టింది. ఇక కల్తీ విత్తనాల అమ్మకాలు జరుగకుండా చూడాల్సింది సమన్వయ సమితుల సభ్యులే. వేలితో కొడితే దెబ్బతాకదు. పిడికిలితో కొడితే దెబ్బతాకుతుంది. పిడికిలిగా ఉండటమే సంఘటిత శక్తి. రైతులను ఆర్గనైజ్ చేయాలి. సంవత్సర కాలంలో కొన్ని లక్ష్యాలు సాధించాలి. వచ్చే సంవత్సరం పంటకాలనీల ఏర్పాటుకు నడుం బిగించాలి.
రైతు వేదికల నిర్మాణానికి రూ.12 లక్షలు వ్యవసాయాధికారులు మంచిగా పనిచేయాలి. వారికి కూడా ప్రోత్సాహకాలిస్తాం. ఎకరం భూమిలో రైతు వేదికలు నిర్మించాలి. వీలైతే దానంగా ఎవరైనా ఇస్తారేమో చూడాలి. లేకపోతే కొనుగోలు చేయాలి. రైతు వేదికల నిర్మాణానికి రూ.12 లక్షలిస్తాం. వచ్చే వానకాలంనుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ పంట ఎంత వస్తున్నదో లెక్కలు తీయాలి. మండల కమిటీలు జిల్లా కమిటీలకు, జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీకి నివేదికలివ్వాలి. పాస్‌పుస్తకాల పంపిణీ తర్వాత ఫౌతి, మ్యుటేషన్‌కోసం పైరవీలు చేయాల్సిన పరిస్థితి ఉండదు. భూముల వివరాలతో ధరణి వెబ్‌సైట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. అమ్మినవాళ్లకు, కొన్నవాళ్లకు పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్ కాగితాలు పోస్టులో పాస్‌పోర్టులా వస్తాయి. రిజిస్ట్రార్ ఒకరోజు ఆపితే రోజుకు వెయ్యి, ఎమ్మార్వో ఆపితే ఆయనకు, ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో ఆపితే అక్కడి బాధ్యుడికి రూ.వెయ్యి ఫైన్‌వేస్తాం. రైతు చనిపోతే వీఆర్వో తక్షణమే రైతు భార్య వివరాలను ఎమ్మార్వోకు అందజేయాలి. ఎమ్మార్వో ఫౌతి చేయాలి.
మార్కెట్లకు నియంత్రణ విధానం రావాలి.. వరి, మొక్కజొన్న, కంది, పత్తి ఎంత వస్తుందో మార్కెట్లకు వివరాలు తెలియాలి. పంట సీజన్‌లో ఏ గ్రామానికి సంబంధించిన పంటను ఎప్పుడు కొనాలో నిర్ణయించుకోవాలి. వచ్చినవారు అర్ధగంటలో కాంటా చేయించుకుంటారు. గ్రామ, మండల సమన్వయ సమితులే చొరువ తీసుకోవాలి. వచ్చే వర్షాకాలం నుంచి ఎన్ని ఎకరాల్లో ఏ పంట ఉందో లెక్క తేలాలి. వ్యవసాయ కార్యదర్శి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడికి, ముఖ్యమంత్రికి రోజువారీ వివరాలు తెలియాలి. నియంత్రణ విధానం అవలంబించాలి. కమిషన్ ఏజెంట్లు కుమ్మక్కై రైతులను ముంచుతుంటారు. ఇక అలాంటిది ఉండదు. 6-7వేల కోట్లు గుత్తా సుఖేందర్‌రెడ్డి వద్ద ఉంటాయి. అడ్తీదారులు మద్దతు ధర ఇస్తే సరి. లేకపోతే రాష్ట్ర రైతుసంఘం నేరుగా కొనుగోళ్లు చేస్తుంది. అలా వచ్చే ఆదాయం సమన్వయ సమితులకే చెందుతుంది.
వ్యవసాయ యాంత్రీకరణ అవసరం ప్రతి ఐదు వేల ఎకరాలకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు.. ఇలా ఏం ఉన్నాయి? ఏం లేవన్న లెక్కలు తీయాలి. రాబోయే రోజుల్లో వ్యవసాయ పనులు చేసే మనుషులు దొరుకరు. అందుకే మండలానికి పది చొప్పున నాట్లు వేసే యంత్రాలు 50% సబ్సిడీతో ఇస్తాం. ట్రాక్టర్లను, కలుపు తీసే యంత్రాలను ఇస్తాం. దున్నకం మొదలు పంట పండేవరకు అన్నిస్థాయిల్లో యాంత్రీకరణ తప్పనిసరి. నీళ్లు, యంత్రాలు, పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు అన్నీ ఉంటాయి. ఏడాదిలో ఈ క్రమం సాధిద్దాం. చివరి దశలో పంట కాలనీలకు వెళ్తాం. మహబూబ్‌నగర్‌లో తక్కువ వర్షపాతం, ఆదిలాబాద్‌లో డబుల్ వర్షపాతం ఉంటుంది. గాలి, వాయువేగం పరిస్థితి, వాతావరణ స్థితిగతులు, నేల స్వభావం, వ్యావసాయిక పరిస్థితులపై విశ్లేషణ జరుగాలి. తెలంగాణను పంట కాలనీలవైపు తీసుకెళ్లాలి. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి. పంటలను నిల్వచేసే శీతల గిడ్డంగులను ఏర్పాటుచేసుకుంటాం. రైతుల విశ్వాసం పెరిగింది. రైతులు వారికి లాభం ఉందని గమనిస్తే మనం చెప్పేది వింటారు.
ఈసారి రైతు బడ్జెట్ ఈసారి రైతులకు ప్రత్యేకించి వ్యవసాయబడ్జెట్ ప్రవేశపెడ్తాం. ప్రభుత్వం రైతుల కోసం కట్టుబడి ఉన్నది. అలవికాని, అబద్ధపు మాటలను చెప్పదు. రైతాంగం దుఃఖాన్ని కడతీర్చేవరకు, సాగునీటిని ప్రతీ ఎకరానికి అందించేవరకు పనిచేస్తాం. రైతు సమన్వయ సమితులు మార్కెట్‌కు ఇప్పుడే నియంత్రిత విధానంలో పంట తెచ్చే పద్ధతి తీసుకురావాలి. మీకు వెన్నుదన్నుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంటుంది. గొప్ప డిసిప్లేన్ ఉన్న రైతులు, ధనిక రైతులు తెలంగాణలో ఉన్నారని చెప్పుకోవాలి. మనం ఖరాబు కాలేదు. ఆంధ్రప్రదేశ్ కన్నా, దేశంలోని అనేక రాష్ట్రాలకన్నా ముందున్నాం. పొగడ్తలకు పొంగిపోవద్దు. రైతును గడ్డకు వేసేవరకు విశ్రమించవద్దు. లక్షా 61వేల మంది కేసీఆర్‌లు కావాలి. రెండేండ్లలో గుణాత్మకమైన మార్పు రావాలి.
CMKCR4 గిరిజన విద్యార్థినికి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ సీఎం కేసీఆర్ ఆదేశం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏ సందర్భంలోనైనా ఎలాంటి సాయమైనా అందించడంలో తన ప్రత్యేకతను సీఎం కేసీఆర్ మరోసారి చాటుకున్నారు. రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సు సందర్భంగా ఓ రైతు కష్టాన్ని తీర్చిన సీఎం.. ఆ రైతు బిడ్డ విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ప్రకటించారు. ఆదివారం రాజేంద్రనగర్‌లో నిర్వహించిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సు సందర్భంగా రైతుల నుంచి సీఎం కేసీఆర్ సలహాలు, సూచనలను లిఖితరూపంలో కోరారు. అనంతరం రైతుల సలహాలపై స్పందించారు. ఈ సందర్భంగా వేదికకు ఎదురుగా ఉన్న గ్యాలరీలో కూర్చున్న సూర్యాపేట జిల్లాకు చెందిన మాలోతు కృష్ణ రోదిస్తూ లేచి, సంచి నుంచి ఫైల్ తీశారు. దీనిని గుర్తించిన సీఎం కేసీఆర్ అతనిని తన దగ్గరకు తీసుకురావాలని కోరారు. దీంతో మాలోతు కృష్ణను పోలీసులు వేదికపైకి తీసుకెళ్లారు. సమస్యను తెలుసుకున్న సీఎం కేసీఆర్.. కృష్ణ కూతురుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రత్యేక కేసుగా పరిగణనలోకి తీసుకోవాలని జేఏడీ అధికారులకు సూచించారు. ఈ విషయాన్ని పర్యవేక్షించాలని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. సీఎం కేసీఆర్ స్పందించిన తీరుపై సదస్సుకు హాజరైన ప్రతినిధులు పెద్ద ఎత్తున చప్పట్లతో హర్షం ప్రకటించారు.
నేను పంట పెట్టుబడి తీసుకోను నేను పెట్టుబడి సాయం తీసుకోను. నాలాంటివాళ్లు కొందరు ఉంటారు. ఇలా గివ్ ఇట్ అప్‌కు ముందుకు వచ్చినవారు వదులుకునే సొమ్ము కూడా సమన్వయ సమితి వద్దే ఉంటుంది. ఇప్పటికే రూ.200 కోట్లు మూలధనం ప్రభుత్వం సమకూర్చింది. మరో 6-7వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ కూడా ఇస్తుంది. రాష్ట్ర రైతు సమన్వయ సమితి జోక్యం చేసుకుంటే గిట్టుబాటు ధర సచ్చినట్టు వచ్చి తీరుతుంది. రైతు సమన్వయ సమితుల్లో ఉన్నవారితో పెద్ద సైన్యం తయారైంది. లక్షా 61వేల మంది కూడబలుక్కుంటే కానిది లేదు.
మా పాలనలో అసెంబ్లీకి కందిళ్లు రాలేదు.. రైతు సమన్వయ సమితుల్లో టీఆర్‌ఎస్ వాళ్లే ఉంటారు. 14 ఏండ్లు తెలంగాణకోసం పేగులు తెగేవరకు కొట్లాడిండ్రు. ఇదే విషయం ప్రతిపక్షాలకు అసెంబ్లీలోనే చెప్పాను. సమన్వయ సమితుల సభ్యులు నా మాట నిలబెట్టండి. ప్రతిపక్షాలు గతంలో ఎన్నో డ్రామాలు చేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై 200 కేసులు వేస్తారా? జడ్జిలుకూడా తిడుతున్నారు. సిగ్గులేదా వీళ్లకు? రైతులకు నీళ్లు రావద్దు. నీళ్లు వస్తే టీఆర్‌ఎస్ వాళ్లకు ఓట్లస్తయి. అందుకే ప్రాజెక్టులు కట్టవద్దు.. ఇదే ప్రతిపక్షాల దందా. ఇవా రాజకీయాలు? రైతులకు సమస్యలొస్తే వెంటనే మార్కెట్ కమిటీల వద్ద ధర్నాలు చేస్తారు. మూడేండ్ల క్రితం వరకు వీళ్లే అధికారంలో ఉన్నారు కదా? 64 రకాల ఆకుపసర్లు తాగి పవిత్రమైనారా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి టీడీపీ కందిళ్లు తెచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ కందిళ్లు తెచ్చి కరంటు లేదన్నది. కందిళ్లు లేకుండా చేసింది ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వమే. మొసలి కన్నీళ్లు కార్చే దొంగలు, బట్టేబాజి రాజకీయం మన రైతుల కన్నీళ్లు తుడువదు. లక్షా 61వేల రైతు సమన్వయ సమితుల సైన్యమే రైతాంగ దుఖం తీర్చాలి. వారిని తీరానికి చేర్చే నావకావాలి. దిక్సూచి కావాలి. రైతు సమన్వయ సమితుల్లో పైరవీలకు ఆస్కారం ఉండొద్దు. చెక్కుల పంపిణీ వద్ద మీరుండాలి. రైతు సమితులతో స్థానిక సమితులు నిర్వీర్యమవుతాయని ఎవరో పేపర్ల రాసిండు. మనం ఏమైనా పంచాయతీ ఆఫీసులో కూర్చుంటామా? చెట్లు, చెలకలు పట్టుకొని తిరిగే మన పని పంచాయతీ వాళ్లు చేస్తారా? గొడ్డలిపెట్టు అని మాట్లాడుతున్నారు. రాజకీయం చేస్తున్నారు. దిక్కుదివాణం లేని రైతులను ఆర్గనైజ్ చేసి వారికి శక్తి ఇద్దామంటే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్ర రైతాంగానికి చేతులెత్తి దండం పెడుతున్నా. నేను మీ బిడ్డనే. నేను కూడా రైతునే. ముఖ్యమంత్రిగా ఉన్నా రైతుగా మట్టే పిసుకుతా. ఏ మాత్రం టైం దొరికినా పొలంకాడికి ఉరుకుతా. కాల్వకాల్వకు తిరుగుతా. చెట్టుచెట్టుకు.. కాయకాయకు తిరుగుతా. నాకు తెలుసు రైతు కష్టం.