– రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్
తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలను అనుసంధానం చేస్తూ పౌరసేవలను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీ రామారావు అన్నారు. మొబైల్ రేడియేషన్‌పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ సెల్యులార్ ఆపరేటర్స్ అసోయేషన్ ఆఫ్ ఇండియా (కాయ్) గురువారం ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 9 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయని, తండాలను పంచాయతీలుగా మారిస్తే ఈ సంఖ్య 10 వేలకు చేరుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ సేవలన్నింటిని వికేంద్రీకరించి, ఈ-పంచాయతీలుగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల అన్ని పౌరసేవలు వినియోగదారునికి అందుబాటులో ఉంటాయన్నారు.
మీ సేవ కేంద్రాలను మరింత మెరుగుపరుస్తామన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో పౌరసేవలను అందించేందుకు కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో 2000 గ్రామ పంచాయతీలను దీనికోసం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో 4జీ సేవలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని, దశలవారీగా ఈ సేవలను మునిసిపాలిటీలు, గ్రామాలకు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. దేశంలోని మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వైఫై సిటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని, అక్టోబర్ మొదటి వారంలో వెస్ట్‌జోన్ పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వరల్డ్ మెట్రోపాలిస్ సదస్సుకు వచ్చే 60 దేశాల ప్రతినిధులకు వైఫై సిటీని పరిచయం చేసి హైదరాబాద్ కీర్తిని చాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెల్‌టవర్లు, మొబైల్ ఫోన్ల వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్న అపోహలను దూరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఒక ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధి ఐటీ, టెలికాం రంగంపై ఎంతగానో ఆధారపడి ఉంటుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ సేవలను అందించేందుకు జీహెచ్‌ఎంసీ ద్వారా సింగిల్ విండో మొబైల్ సొల్యూషన్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ప్రొఫెసర్ ఆర్‌వీ హోసూర్, రేడియో అంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రాకేష్ జలాలీతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ మైఖేల్ రెప్లోచీ, డాక్టర్ రాజేష్ దీక్షిత్‌తో పాటు పలువురు వైద్యులు, శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.