Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పల్లెలకూ ఐటీ సేవలు

-పంచాయతీ, వైద్యం, విద్య రంగాల్లోనూ అమలు -15 ఏళ్లకు సరిపోయే ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తం -ఐటీఐఆర్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తం -రేపు హైదరాబాద్‌లో 150 ఐటీ కంపెనీలతో సమావేశం -ఐటీ, పీఆర్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి.. ఒరాకిల్ ప్రతినిధులతో భేటీ

KTR

పట్టణాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)సేవలను గ్రామాలకూ విస్తరిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ప్రతి పల్లెలోనూ ఐటీ సేవలు అందించడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందని, దీంతో గ్రామస్థాయిలో అవినీతిని కూడా అరికట్టేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. విద్య, వైద్యం, పంచాయతీ శాఖల్లో ఐటీ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. దీని కోసం కసరత్తు జరుగుతోందని, రానున్న 15 ఏళ్లకు సరిపోయే ఆధునిక శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని ఇందుకు వినియోగించనున్నామని తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రేషన్, పింఛన్లు వంటివి అనర్హులకూ అందుతున్నాయన్నారు. అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఐటీ సేవలు ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపును తీసుకొస్తామన్నారు. గ్లోబల్ మార్కెట్‌లో టాప్ 5లో ఈ ప్రాజెక్టును నిలబెట్టేందుకు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో తెలంగాణను అత్యున్నతంగా నిలబెడతామన్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌లో 150 ఐటీ కంపెనీలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ రంగం పై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందన్నారు. అలాగే సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ ఒరాకిల్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ప్రధానంగా ఐటీ సెక్టార్‌లో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ఆహ్వానించేందుకు అవసరమైన చర్యలపై సమీక్ష నిర్వహించారు. విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌తోపాటు ఐటీ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఒరాకిల్ సహకారంతో ఈ గవర్నెన్స్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు ఈ గవర్నెన్స్ విధానాన్ని విస్తరించాలని యోచిస్తోంది. తొలిదశలో పౌరసరఫరాలు, గృహ నిర్మాణ రంగానికి ఐటీ సేవలు వినియోగించాలని భావిస్తోంది. అదేబాటలో ఈ-పంచాయత్, ఈ-హెల్త్, ఈ-ఎడ్యుకేషన్ సేవలను కూడా ప్రతి పల్లెకు అందించేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని ఒరాకిల్ సంస్థ నుంచి స్వీకరించేందుకు చర్చలు జరిగాయి. ఉచితంగానే ఈ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వానికి సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు హామీఇచ్చింది. ఇప్పటికే సంస్థ ప్రతినిధి సుబ్రమణ్యం తమతో చర్చలు జరిపినట్లు ఐటీ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. త్వరలోనూ సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి ప్రభుత్వానికి అందించనుంది.

ఒరాకిల్ సంస్థ ఈ ప్రక్రియను పూర్తిచేసిన తర్వాత సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ పరిశీలనకు పంపుతారు. వారి ఆమోదం పొందితే అమల్లోకి తీసుకురానున్నట్లు హర్‌ప్రీత్‌సింగ్ బుధవారం టీ మీడియాకు వివరించారు. అన్ని శాఖలకు ఈ సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణులకు పౌర సేవలతో పాటు ఇతర వ్యక్తిగత, సామాజిక సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు ఉపయోగపడే సలహాలు, సూచనలను కూడా ఈ గవర్నెన్స్ ద్వారా అందించనున్నారు. ఏదైనా చిన్నపాటి అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యుడి సలహా అవసరమైతే ఈ-హెల్త్ ద్వారా పొందే సదుపాయం ఉంటుంది. అలాగే విద్య రంగంలోనూ దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు కార్యదర్శి తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అర్హులకు చేర్చేందుకు ఐటీ సేవలను వినియోగించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ఐటీ సెక్టార్‌పై సర్కారు దృష్టి -సమస్యల పరిష్కారం దిశగా అడుగులు -ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం -రేపు ఐటీ కంపెనీలతో భేటీ తెలంగాణ ఐటీ రంగాన్ని మరింతగా ప్రగతిబాట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా ప్రతిష్ఠాత్మకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్(ఐటీఐఆర్) ప్రాజెక్టు అమలుకు పకడ్బందీ కార్యాచరణను రూపొందిస్తోంది. అలాగే ఐటీ రంగంలోని సమస్యల పరిష్కారానికీ ప్రభుత్వం నడుంబిగించింది. హైదరాబాద్‌లో శుక్రవారం (27న) సాయంత్రం 6 గంటలకు ఐటీ రంగ నిపుణులు, వ్యాపారవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశం ఈ కోవలోనిది. హైదరాబాద్ ఐటీ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్, తెలంగాణ ఐటీ అసోసియేషన్ల సహకారంతో ఈ భేటీని తలపెట్టింది. 150 కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలు దీనికి హాజరవుతారని అంచనా. ప్రభుత్వం ఆలోచనలతో ఐటీ రంగం ప్రతినిధులతో పంచుకోవడానికి, వారి సమస్యలు తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్టు ఐటీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ బుధవారం టీ మీడియాకు తెలిపారు. కొంతకాలంగా తెలంగాణ ఉద్యమాన్ని బూచీగా చూపించి ఐటీ కంపెనీలు రాకుండా దుష్ప్రచారం చేశారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని సామరస్యపూర్వక వాతావరణాన్ని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే ఐటీ విభాగంలో ప్రభుత్వం అనుసరించనున్న విధి విధానాలను, ఇవ్వనున్న ఇన్సెంటివ్స్, ప్రోత్సాహకాలు, రాయితీలను వివరిస్తామన్నారు.

ఆ తర్వాత పాలసీని రూపొందించేందుకు అవసరమైన సూచనలను వారి నుంచి స్వీకరిస్తామన్నారు. దాంతోపాటు ఇప్పుడున్న ఐటీ కారిడార్‌లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలను తీసుకునేందుకు కార్యాచరణను రూపొందిస్తామని హర్‌ప్రీత్‌సింగ్ చెప్పారు. ఐటీ శాఖతోపాటు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డు, రవాణా, పోలీసు తదితర శాఖల అధికారులు కూడా సమావేశానికి వస్తున్నారని తెలిపారు.. ఔత్సాహిక ఐటీ పారిశ్రామికవేత్తలు వ్యక్తీకరించే ప్రతి సమస్యను గుర్తించి వీలైనంత త్వరగా పరిష్కరించే ఎజెండాను అమలుచేయనున్నట్లు చెప్పారు. ఇలాంటి ముఖాముఖి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ఐటీ సెక్టార్‌ను అభివృద్ధి పర్చుకునేందుకు అవసరమైన రోడ్ మ్యాప్‌ను డిజైన్ చేసేందుకు దోహదపడుతుందని ఉద్దేశంతోనే ఐటీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఐటీ అసోసియేషన్(కార్పొరేట్ వింగ్) ప్రెసెడెంట్ కే మోహన్‌రాయుడు తెలిపారు. వారు ఎదుర్కొంటోన్న సమస్యలు తెలిసినప్పుడే ప్రభుత్వం పరిష్కరించగలదని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.