-వరంగల్- ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా ఎంపిక -మూడు జిల్లాల మంత్రులు, నేతలతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సుదీర్ఘ చర్చలు -టీఆర్‌ఎస్ – పట్టభద్రుల మధ్య అవినాభావ సంబంధం -అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి -రేపు నల్లగొండలో నామినేషన్ దాఖలు

శాసనమండలికి వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పార్టీ సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం తన క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితోపాటు మూడు జిల్లాల మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, అజ్మీరా చందూలాల్, పార్లమెంటరీ కార్యదర్శులు గాదరి కిశోర్, జలగం వెంకట్రావ్, వొడితెల సతీశ్‌కుమార్, దాస్యం వినయ్‌భాస్కర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టికెట్ ఆశిస్తున్న నేతలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. తర్వాత పార్టీ అభ్యర్థిగా రాజేశ్వర్‌రెడ్డిని ఎంపికచేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదే స్థానానికి అభ్యర్థిత్వం కోసం పోటీపడిన మిగిలిన వారికి మున్ముందు సముచిత స్థానం కల్పిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపుకోసం తాము ఏకతాటిపై నిలిచి కృషిచేస్తామని సమావేశానికి హాజరైన నేతలంతా చెప్పారు. దీంతో రాష్ట్ర శాసనమండలికి జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఆదివారం హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా టీఎన్జీవో నేత జీ దేవీప్రసాద్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
టీఆర్‌ఎస్, పట్టభద్రుల మధ్య విడదీయలేని బంధం: పల్లా పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు, పట్టభద్రులకు అవినాభావ సంబంధముందని పేర్కొన్నారు. పట్టభద్రుల అవసరాలేమిటో పార్టీకి తెలుసునన్నారు. వారి మనసులు దోచుకున్నందునే టీఆర్‌ఎస్.. రాష్ట్ర సాధన ఉద్యమంలో విజయవంతంగా ముందుకు సాగిందన్నారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికచేసినందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు పల్లా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 25న నల్లగొండలో నామినేషన్ దాఖలుచేయనున్నట్లు చెప్పారు. 14 ఏండ్ల ఉద్యమంలో రాష్ట్ర సాధనతోపాటు ఎనిమిదిన్నర నెలలుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో అనూహ్య స్పందన ఉందన్నారు. ఇది పలు సందర్భాల్లో వెల్లడైందని చెప్పారు. సమగ్ర సర్వేపై కొందరు అపోహలు కల్పించినా.. దేశంలోఎక్కడా లేనివిధంగా ప్రజలు దాన్ని విజయవంతంచేశారన్నారు. ఇందులో యువత ఎంతో సహకరించిందని చెప్పారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికతోపాటు ఇటీవలి కంటోన్మెంట్ ఎన్నికల్లో ఓటర్ల నాడి టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నదని పల్లా పేర్కొన్నారు.
మంచి పథకాలతో రాష్ర్టాభివృద్ధికి కృషిచేస్తున్నారని, అదే రీతిలో ముందుకెళ్లాలని ప్రజలు ఈ ఫలితాలతో టీఆర్‌ఎస్ వెన్నుతట్టి నిలిచారన్నారు. ప్రతి పట్టభద్రుడు ప్రభుత్వోద్యోగం ఆకాంక్షిస్తాడన్న పల్లా.. త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో అర్హత గల ప్రతి పట్టభద్రుడికీ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. త్వరలో ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీద్వారా త్వరలో పలు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ల జారీకి కసరత్తు చేస్తున్నదన్నారు. ఇప్పటికే వాటర్ గ్రిడ్ పథకంలో ఇంజినీర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయ్యిందని చెప్పారు. త్వరలో నిర్మించే విద్యుత్ ప్రాజెక్టుల్లో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీకానున్నాయని వివరించారు. గ్రూప్-1, 2 విభాగాల్లో నియామకాల ప్రక్రియపై కసరత్తు తుదిదశకు చేరుకున్నదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. మూడు జిల్లాల్లోని పట్టభద్రులు టీఆర్‌ఎస్‌కు ఘన విజయాన్నందించి ఉత్తర తెలంగాణకు దీటుగా పార్టీకి మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తంచేశారు.
మూడు జిల్లాలతో అనుబంధం వల్లే..! తనకు మూడు జిల్లాలతో అనుబంధం ఉండడం వల్లే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారుచేశారని పల్లా చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కవగా పట్టభద్రుల్లోకి చొచ్చుకుపోగలిగే వారెవ్వరన్న అంశాలను కూడా పరిశీలించారన్నారు. చాలామంది నేతలకు తనకంటే ఎక్కువ ఉద్యమ నేపథ్యం ఉన్నదన్నారు. అయితే అధినేత అన్ని అంశాలు కూలంకుషంగా పరిశీలించి, తీవ్ర కసరత్తుచేసిన తర్వాతే తనను ఎంపికచేశారని తెలిపారు. పార్టీకిగానీ, ప్రభుత్వానికిగానీ, తెలంగాణ అభివృద్ధికిగానీ ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో తమ అధినేతకు తెలుసునని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అవగాహన లేని ఆరోపణలుచేశారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు రూ.1360 కోట్లకు కేవలం రూ.500 కోట్లు మంజూరయ్యాయని పల్లా తెలిపారు. వాటిలో రూ.350 కోట్లు మాత్రమే విడుదల చేశారని చెప్పారు. వాటిలోనూ అత్యధికంగా రూ.2000 – 3000 విద్యార్థుల వ్యక్తిగత స్కాలర్‌షిప్‌లే ఉన్నాయన్నారు. ఒక్కో విద్యార్థికి వచ్చిన స్కాలర్‌షిప్‌లోనూ గతంలో అధికారంలో ఉన్నవారు కమిషన్లు తీసుకున్నట్లు ఇప్పుడు జరిగిందనే అపోహ పడుతున్నారన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నేతలు శశిధర్‌రెడ్డి, రమణారెడ్డి, జెల్లా మార్కండేయులు, కార్యాలయ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.