Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పాలనకు ప్రజలే కేంద్రం

-ఏప్రిల్‌ 2 నుంచి టీఎస్‌ బీపాస్‌
-పారదర్శకంగా పౌరసేవలు
-నిర్దిష్ట గడువులో అనుమతులివ్వాలి
-గ్రీన్‌యాక్షన్‌, శానిటేషన్‌, హెల్త్‌ప్లాన్లను సిద్ధంచేయాలి
-అవినీతికి పాల్పడితే తొలిగింపే
-మున్సిపల్‌ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్‌ సిబ్బందితో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో ప్రజలు కేంద్రంగా పురపాలన సాగాలని మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఏ అధికారి అయినా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే.. సస్పెన్షన్‌ వంటి నామమాత్రపు చర్యలు కాకుండా.. విధుల నుంచి పూర్తిస్థాయిలో తొలిగించేలా అత్యంత కఠిన చర్యలు కూడా తీసుకొంటామని హెచ్చరించారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో పురపాలక శాఖ కమిషనర్లు, నూతన కార్పొరేషన్ల కమిషనర్లు, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ టౌన్‌ప్లానింగ్‌ సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ప్రజలకు మరింతచేరువ కావాలన్నారు.

కొత్త మున్సిపల్‌ చట్టాన్ని ప్రతి కమిషనర్‌ తన విధినిర్వహణలో ఒక జాబ్‌చార్ట్‌గా పరిగణించాలని కోరారు. పట్టణ ప్రజలు అధికారుల నుంచి అద్భుతాలేమీ ఆశించడంలేదని, కేవలం వారి ప్రాథమిక అవసరాలు, పౌరసేవలందిస్తే సరిపోతుందని భావిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అధికార వికేంద్రీకరణే స్ఫూర్తిగా రాష్ట్రం ఏర్పడిందని, అదే స్ఫూర్తితో ప్రజలకు సుపరిపాలన ఫలాలను అందించాలన్న లక్ష్యంతో గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను కలిపి కొత్తగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందాలంటే స్థానిక కమిషనర్లు తమ సిబ్బందితోపాటు.. ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు.

ఏప్రిల్‌ 2 నుంచి టీఎస్‌ బీపాస్‌ పూర్తిస్థాయిలో అమలు
టీఎస్‌ బీపాస్‌ (తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం) ను మార్చి నెలలో ప్రయోగాత్మకంగా చేపడుతామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలతోపాటు పట్టణాభివృద్ధి సంస్థల్లో ఏప్రిల్‌ రెండో తేదీనుంచి పూర్తిస్థాయిలో అమలుచేయనున్నట్టు తెలిపారు. ఫైర్‌ సర్వీసెస్‌, విద్యుత్‌, ట్రాఫిక్‌, ప్లానింగ్‌ విభాగాలనుంచి భవన నిర్మాణ అనుమతులను సత్వరంగా జారీచేసేందుకు టీఎస్‌ బీపాస్‌ను రూపొందించినట్టు తెలిపారు. దీనిపై ఆయాశాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థలతో చర్చించనున్నట్టు చెప్పారు. పురపాలకశాఖలో తీసుకొస్తున్న టీఎస్‌ బీపాస్‌ ద్వారా 21 రోజుల్లో ప్రజలకు భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాల్సిందేనని, ఇందులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టంచేశారు. పురపాలనలో అవినీతిని అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్లకు చెప్పారు.

ప్రభుత్వం తన ప్రాధాన్యాలను ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఏ అధికారి అయినా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే.. సస్పెన్సన్‌ వంటి నామమాత్రపు చర్యలు కాకుండా విధుల నుంచి పూర్తిస్థాయిలో తొలిగించేలా అత్యంత కఠిన చర్యలు కూడా తీసుకొంటామని కేటీఆర్‌ హెచ్చరించారు. నూతన భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ అమలును హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా మానిటర్‌ చేస్తామని తెలిపారు. వ్యక్తులపై వ్యవస్థ ఆధారపడరాదని, అభివృద్ధిని వ్యవస్థీకృతంచేసేందుకు సులభతరంగా అనుమతులు జారీచేసే ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పెంచనున్నట్టు ఆయన చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా రెగ్యులర్‌ నియమకాలు జరిగేవరకు.. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఔట్‌సోర్సింగ్‌ ద్వారా తాత్కాలికంగా నియామకాలు చేపడుతామని కేటీఆర్‌ వెల్లడించారు.

గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం
పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌరసేవలు, టెక్నాలజీ వినియోగం, గ్రీవెన్స్‌ రిడ్రెసెల్‌, అవినీతికి తావులేకుండా భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలకు నూతన పురపాలకచట్టం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని.. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు పనిచేయాలని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. పట్టణ పారిశుద్ధ్యం మున్సిపల్‌ కమిషనర్ల ప్రాథమిక విధి అని, ఉదయం 4.30 గంటలకే పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని కమిషనర్లు పర్యవేక్షించాలన్నారు. ఈ విషయంలో వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టే ప్రయత్నంచేయాలని చెప్పారు.

సాధ్యమైనన్ని పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించాలని, ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా ‘షీ టాయిలెట్ల’ను పెద్ద ఎత్తున ఏర్పాటుచేయాలని సూచించారు. పురపాలిక బడ్జెట్‌లో కనీసం పదిశాతాన్ని గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌కు కేటాయించాలని.. పట్టణాల్లో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా హరిత కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని పేర్కొన్నారు. ప్రతి పట్టణానికి శానిటేషన్‌ ప్లాన్‌తోపాటు గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ కూడా తయారుచేయాలన్నారు. దీంతోపాటు సీజనల్‌ వ్యాధులను అరికట్టడానికి అవసరమైన హెల్త్‌ ప్లాన్లను సిద్ధంచేసి ఉంచాలని తెలిపారు. ఇందుకోసం అవసరమైతే వెటర్నరీ వైద్యులు, ఎంటమాలజిస్టులు, ఇతర సిబ్బంది సహకారం తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

ప్రజలే బాస్‌లు
పురపాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడంలో మరింత చొరవచూపించాలని కమిషనర్లను మంత్రి కేటీఆర్‌ కోరారు. ఇందుకోసం సామాజిక మాధ్యమంలో అందుబాటులో ఉన్న అన్ని వేదికలను ఉపయోగించుకోవాలన్నారు. ప్రజలతో కలిసి పనిచేస్తూ వారికి అపూర్వమైన సేవలందించి పట్టణాలపై తమదైన చెరగని ముద్రవేసేలా అధికారులు పనిచేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అందరికీ బాస్‌లనే విషయాన్ని గుర్తుంచుకొని వారితో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే అధికారులు, నాయకులను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకొంటారని కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలు వివిధ రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టాయని, జాతీయ స్థాయిలోనూ పలునగరాలు వినూత్న విధానాలతో ముం దుకు దూసుకెళ్తున్నాయని అన్నారు. వాటిని స్ఫూర్తిగా తీసుకొని స్థానికంగా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పనచేయాలని పేర్కొన్నారు.

అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి
దేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఆటుపోట్లను అధిగమించి అన్నిరంగాల్లో దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఉత్తమ జీవనప్రమాణాలు ఉన్న నగరంగా ప్రపంచస్థాయి సంస్థలు హైదరాబాద్‌ను అనేకసార్లు గుర్తించాయని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చేస్తున్న కృషి ఇందుకు కారణమని మంత్రి అభినందించారు. రియల్‌ఎస్టేట్‌ రంగం అభివృద్ధి కూడా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నదని తెలిపారు. ఈ సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌, సీసీపీ దేవేందర్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, నూతన కార్పొరేషన్ల కమిషనర్లు, పురపాలక సంఘాల మున్సిపల్‌ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.