– కేసీఆర్‌కు కలిసొచ్చిన రెండు వారాల వ్యవధి – పలు రంగాలపై ఇప్పటికే పూర్తయిన సమీక్ష – సీఎం పదవి చేపట్టేనాటికి అన్ని విభాగాలపై సాధికారత

తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన పాలనపై ముందస్తుగానే పట్టు పెంచుకుంటున్నారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టకముందే తనకు కలిసివచ్చిన కాలాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒకటి రెండు రోజులలోపే గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
కానీ నూతనంగా ఏర్పాటుకానున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నికల ఫలితాల అనంతరం దాదాపు పదిహేను రోజుల సమయం దక్కింది. 16న ఎన్నికల ఫలితాలు విడుదల కాగా జూన్ 2న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫలితాల వెలువడినప్పటి నుంచి వందలాదిగా వస్తున్న వివిధ తెలంగాణ సంఘాల నేతలను పార్టీ కార్యకర్తలను పలుకరిస్తూ వారి నుంచి కేసీఆర్ శుభాకాంక్షలు స్వీకరిస్తున్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తున్న పలు తెలంగాణ సంఘాల నుంచి ఫిర్యాదులను కూడా స్వీకరించి, వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివిధ వర్గాల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలను ఈ ఖాళీ సమయంలో అధికారులతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన అంశాలను ఒక్కొకటిగా నెరవేర్చేందుకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందే తలెత్తిన ఉద్యోగుల పంపిణీ వివాదాస్పదం కాకుండా కేసీఆర్ తక్షణ చర్యలు చేపట్టారు. ఉద్యోగ సంఘాలను సమావేశపరిచి నూతన రాష్ట్రంలో వారి ఉద్యోగాలకు పూర్తి భద్రతతోపాటు సీమాంధ్ర ఉద్యోగుల వలన నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఇంక్రిమెంటు ప్రకటించారు. యుద్ధప్రాతిపదన పార్టీ కార్యాలయంలో వార్‌రూంను ఏర్పాటు చేసి ఉద్యోగుల విభజనకు సంబంధించిన సమాచారాన్నంతటినీ సేకరించేందుకు ఎమ్మెల్యేలతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు.
భవిష్యత్ కార్యాచరణపై దృష్టి మరోవైపు వివిధ ప్రభుత్వ విభాగాలు, ఆయా రంగాలకు చెందిన అధికారులు ఐఏఎస్ అధికారులతో కేసీఆర్ నిరంతరం చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఆస్తి అప్పుల వివరాలతో పాటు నీటిపారుదల, ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ, వ్యవసాయం తదిరత రంగాల్లో తెలంగాణ కు దక్కాల్సిన వాటాలపై లెక్కలేసి మరీ ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నారు.
గత రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో సమావేశమైన కెసిఆర్ విభజన సందర్బంగా తెలంగాణకు కేటాయించిన భవనాల వివరాలను ఆరా తీశారు. నీటిపారుదల రంగంపై సమీక్షకు సెలవు దినమైన ఆదివారాన్ని కూడా కేసీఆర్ సద్వినియోగపరుచుకున్నారు. నరేంద్ర మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఢిల్లీకి బయలుదేరే ముందు కూడా దాదాపు ఐదు గంటలపాటు నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో సమావేశమయ్యారు. తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. రెండు మూడేళ్ల కాలపరిమితిలో కృష్ణా గోదావరి నదీజలాల నీటిని తెలంగాణ భూములకు మళ్లించాల్సిందేనని దిశానిర్దేశం చేశారు.
దాదాపు 70 మంది నీటిపారుదల శాఖకు చెందిన రిటైర్డ్ ఇంజినీరు,్ల ప్రస్తుతం పనిచేస్తున్న శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేసీఆర్ ఇచ్చిన సలహాలు, సూచనలు అత్యంత ప్రతిభావంతంగా ఉన్నాయని సీనియర్ ఇంజనీర్లు ప్రకటించడం గమనార్హం. ఈ విధంగా తన ప్రమాణ స్వీకారానికి ముందే కలిసి వచ్చిన సమయాన్ని వినియోగించుకోవడమే కాకుండా కేసీఆర్ ముందుచూపుతో తీసుకుంటున్న చర్యలు తెలంగాణ రాష్ట్రం త్వరితగతిలో అభివృద్ధి చెందేందుకు దోహదపడనున్నాయని ఆయనతో చర్చలో పాల్గొన్న అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.