పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సహా రాష్ట్రంలో చేపట్టనున్న అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన భూమిని రైతుల నుంచి మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భూసేకరణతో నిర్వాసితులుగా మారే వారిపట్ల సానుభూతితో వ్యవహరించాలని ఆయన స్పష్టంచేశారు. నిర్వాసితులకు విద్యార్హతలనుబట్టి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. భూసేకరణ కోసం రైతులతో స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పాలమూరు భూసేకరణలో నిర్వాసితులుగా మారుతున్నవారికి నష్టపరిహారంగా చెల్లించేందుకు ఇప్పటికే రూ.300కోట్లను విడుదల చేసి, జిల్లా కలెక్టర్ వద్ద ఉంచినట్లు తెలిపారు.

-అర్హతనుబట్టి కుటుంబానికి ఒక ఉద్యోగం -మార్కెట్ ధర చెల్లించి భూమి కొనుగోళ్లు -నిర్వాసితులకు పరిహారం చెల్లింపే తొలికార్యం -వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది -సత్వరమే పాలమూరు లిఫ్ట్‌కు టెండర్లు -రీడిజైనింగ్‌తో సమస్యలు తగ్గుముఖం -సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం కేసీఆర్ -డిండి భూ సేకరణకు నేడు 75 కోట్లు విడుదల వాటిని ఆయా నిర్వాసితులకు అందించి, భూసేకరణ పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్వాసితులకు పరిహారం చెల్లింపే తొలి కార్యమని సీఎం స్పష్టంచేశారు. రాష్ట్రంలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకింద ఎన్ని ఎకరాల భూమి ముంపునకు గురవుతున్నది? ఎన్ని గ్రామాలు మునిగిపోతాయి? ఎంతమంది నిర్వాసితులు అవుతారు? ఎన్ని ఇండ్లు పోతున్నాయి? తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో శుక్రవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టులను రీ డిజైన్ చేయడంవల్ల అంతర్రాష్ట్ర వివాదాలు, ఇతరత్రా సమస్యలు చాలా వరకు తగ్గాయని చెప్పారు.
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో సహజంగా తలెత్తే సమస్యలు, అడ్డంకులను సత్వరం అధిగమించి, చాలా తక్కువ సమయంలోనే నదీ జలాలను పొలాలకు మళ్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ముంపు పెద్దగా లేనప్పటికీ, కొద్దిపాటి ఆవాస ప్రాంతాల ప్రజలను తరలించడం అనివార్యమని సీఎం అన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా విధి లేని పరిస్థితుల్లోనే కొన్ని ఆవాస ప్రాంతాలను, కొద్దిమంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నామని చెప్పారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి కడుతున్న ప్రాజెక్టులకోసం తమ భూములను, ఇండ్లను, వ్యవసాయాన్ని కోల్పోతున్నవారిపట్ల అత్యంత సానుభూతితో వ్యవహరించాలని సీఎం స్పష్టంచేశారు. గూడు చెదిరి, గుండె చెదిరిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి శంకుస్థాపన చేసిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చాలా వేగంగా పూర్తిచేసి, వలస బారినపడిన పాలమూరులో బంగారు పంటలు పండించాలని సీఎం అన్నారు.
పాలమూరు ప్రాజెక్టుకోసం భూములు కోల్పోయిన వారికి మార్కెట్ రేటుకు అనుగుణంగా ధర చెల్లించి భూములు కొనుగోలు చేయాలని చెప్పారు. ఇండ్లు కోల్పోయినవారికి కూడా వెంటనే పరిహారం చెల్లించాలన్నారు. భూ నిర్వాసితులకు డబ్బులు చెల్లించడమే ప్రాజెక్టుల నిర్మాణ ప్రక్రియలో తొలి కార్యక్రమమని సీఎం తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే పాలమూరు ప్రాజెక్టు భూ నిర్వాసితులకు చెల్లించడానికి ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసి, మహబూబ్‌నగర్ కలెక్టర్ వద్ద ఉంచిందని వెల్లడించారు. ఆ డబ్బులు వెంటనే నిర్వాసితులకు అందించి, భూ సేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
భూసేకరణలో జాప్యం వద్దు వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు కడుతున్నామని, కొద్దిపాటి డబ్బులతో పరిష్కారమయ్యే భూసేకరణ పూర్తి చేయకుండా, ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యాన్ని కొని తెచ్చుకోవడం మంచి పద్ధతి కాదని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రాజెక్టులకోసం భూమి కోల్పోయిన కుటుంబాలకు మానవతా దృక్పథంతో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని భావిస్తున్నామని చెప్పారు. ఒక్కో కుటుంబానికి అర్హతలను బట్టి ఒక్కో ఉద్యోగం చొప్పున భూ నిర్వాసితులకోసం 15 వేలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని అన్నారు.
సాధ్యమైనంతవరకు వారిని ప్రాజెక్టుల నిర్వాహణ కార్యకలాపాలకు వినియోగించుకుంటామని తెలిపారు. ఇంకా మిగిలినవారికి ఇతర శాఖల్లో అవకాశం కల్పిస్తామన్నారు. పాలమూరు పనులు చేస్తూనే, మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి తదితర ప్రాజెక్టులను కూడా తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల పురోగతిని కూడా సమీక్షించిన సీఎం ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
పాలమూరు పూర్తయ్యేవరకు నిరంతర పర్యవేక్షణ గతంలో నిర్మించిన ప్రాజెక్టుల మాదిరిగా కాకుండా, తెలంగాణలో నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులు శరవేగంగా పూర్తికావాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు ఎన్ని మోటార్లు, పైపులు కావాలో ముందే గుర్తించి, ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టు మొత్తం ఒకే ఏజెన్సీకి అప్పగించకుండా, ఐదారు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని, అన్ని ప్యాకేజీలలో పనులు ఎక్కడికక్కడ సమాంతరంగా జరుగాలని చెప్పారు. భూసేకరణ అనే సమస్య ఉండదు కాబట్టి ప్రాజెక్టులు త్వరితగతిన నిర్మించడం సాధ్యమేనన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు.
ఏ ప్రాంతంలో ఎవరు బాధ్యతలు తీసుకొని భూ సేకరణ తదితర అంశాలు పర్యవేక్షించాలో నిర్ణయించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయ్యేవరకు తాను, మంత్రి హరీశ్‌రావు నిరంతరం పర్యవేక్షిస్తామని కేసీఆర్ చెప్పారు. టెండర్లు ఖరారైన తరువాత కాంట్రాక్టర్లతో తానే స్వయంగా మాట్లాడి పనులు వేగంగా చేయాలని కోరుతానన్నారు. పనులు జాప్యమైతే ప్రాజెక్టు వ్యయం పెరుగటమే కాకుండా.. ఎంతోకాలంగా ప్రాజెక్టుకోసం ఎదురుచూస్తున్న రైతులు నిరాశ చెందుతారని సీఎం అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి వెంటనే మొదటి దశ టెండర్లు పిలవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పనులు వేగంగా జరిపించాలని, బిల్లులు కూడా వెంట వెంటనే చెల్లించాలని చెప్పారు. మోటార్లు, పైపుల తయారీ కోసం బీహెచ్‌ఈఎల్‌కు అడ్వాన్స్‌కూడా ఇస్తామన్నారు.
డిండి ప్రాజెక్టుకు 75 కోట్లు విడుదల చేయండి డిండి ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ముందుగా ప్రాజెక్టు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇందకు నిధుల కొరత రాకుండా వెంటనే రూ.75 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను సీఎం ఆదేశించారు. ఈ మేరకు శనివారం జీవో వెలువడనున్నట్లు తెలిసింది. డిండిద్వారా నల్లగొండ జిల్లాకు, లక్షీదేవిపల్లి రిజర్వాయర్‌ద్వారా రంగారెడ్డి జల్లాకు నీరివ్వాలని సీఎం చెప్పారు. పాలమూరుతో పాటు నల్లగొండ జిల్లాకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గాదరి కిశోర్, వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, పాలమూరు ప్రాజెక్టు ఓఎస్డీ రంగారెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ తదితర అధికారులు పాల్గొన్నారు.