
-రైతులంతా సంతోషంగా ఉండాలి -పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా సాధిస్తా -యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం -ప్రజాసేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చా -సీఎం కేసీఆరే ఆదర్శం.. ఆయన పాలన దేశానికి అవసరం
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకువచ్చేందుకు కృషిచేస్తా. రైతులంతా సంతోషంగా ఉండాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. అన్నివర్గాల ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్ సాగిస్తున్న పాలన దేశానికి అనుసరణీయం. అంతటి గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకునే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నది. రైతుల కష్టాలు తెలుసు. ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తా అంటున్న టీఆర్‌ఎస్ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డితో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ…
మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు.? మాది మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని మారుమూల గ్రామం గురుకుంట. వ్యవసాయ కుటుంబం. మా సోదరుడు మన్నె సత్యనారాయణ రెడ్డి ఫార్మా రంగంలో విజయం సాధించాడు. మేమంతా అదే వ్యాపార రంగంలోకి వెళ్లాం. కష్టపడేతత్వం ఉన్న మేం వ్యాపార రంగంలో విజయవంతమయ్యాం. మేమెంత ఉన్నత స్థాయిలో ఉన్నా, సొంత ప్రాంతానికి ఏదైనా చేయాలనే ఆలోచన ఉన్నది. అదే సమయంలో సీఎం కేసీఆర్ స్వరాష్ట్రం కోసం చేసిన పోరాటం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణం కోసం పడుతున్న తపన మాకు స్ఫూర్తినిచ్చింది. అన్నివర్గాల ప్రజల కోసం ఆయన పడుతున్న తపన ఎంతో ఆలోచింపచేసింది. ప్రజా సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చా. మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేస్తున్నా. సొంత ప్రాంతంలో ఎంపీగా పోటీచేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా.
పోటీ ఎలా ఉండబోతున్నది? సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు విశ్వవ్యాప్తంగా పేరు గడించాయి. రైతుబంధు, రైతుబీమా పథకాలకు ప్రపంచంలోనే ఉత్తమ 20 పథకాల్లో స్థానం లభించింది. ఐక్యరాజ్య సమితి ఈ పథకాలకు కితాబునిచ్చింది. ఇవే కాకుండా విద్యా, వైద్యం, విద్యుత్, ఇతర మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉన్నది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రుణ మాఫీ, రైతులకు నిరంతర ఉచిత విద్యుత్, అన్నివర్గాలకు ఆసరా పింఛన్లు, ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలు ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు సబ్సిడీ గొర్రెల పంపిణీ, ఉచిత చేపపిల్లల పంపిణీ చేపట్టారు. కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి లాంటి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి జరుగుతున్నది. కేసీఆర్ పథకాలు, ఆయన చేపట్టిన అభివృద్ధి కారణంగా మహబూబ్‌నగర్ ఎంపీగా అత్యంత సులభంగా విజయం సాధిస్తాననే నమ్మకం ఉన్నది. 70 ఏండ్లకుపైగా కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని పాలించాయి. కానీ నేటికీ ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయి. తెలంగాణ ఏర్పడిన ఐదేండ్లలోనే రాష్ట్రంలోని అనేక సమస్యలను కేసీఆర్ పరిష్కరించారు. ప్రభుత్వ పథకాలతో ప్రజల్లో భరోసా కల్పించారు. ఇప్పడు దేశమంతా కేసీఆర్ వైపు చూస్తున్నది. ఆయన పాలన దేశానికి ఎంతో అవసరం.
కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ సాధించారు. ఆ స్థానం నుంచే మీరు ఎంపీగా పోటీచేస్తున్నారు. ఎలా భావిస్తున్నారు? తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన మహబూబ్‌నగర్ ఎంపీగా ఉంటూ తెలంగాణ సాధించడం ఈ ప్రాంతానికి గర్వకారణం. ఉద్యమ సమయంలో పాలమూరు ప్రజలంతా సీఎం కేసీఆర్‌కు అండగా ఉన్నారు. పాలమూరులో ఆయనను ఓడించి ఉద్యమం లేదని ప్రపంచానికి చాటేందుకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నమే చేసింది. కానీ పాలమూరు బిడ్డలంతా ఆయనకు అండగా ఉండటంతో ఆయన ఘన విజయం సాధించారు. అనంతరం మహబూబ్‌నగర్ ఎంపీగా ఉంటూనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. తెలంగాణ సాధించారు. ఎంతో ప్రాధాన్యమున్న మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.
ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందనుకుంటున్నారు? గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పోటీచేసిన ఎమ్మెల్యేలంతా విజయం సాధించారు. ఆ ఏడుగురు ఎమ్మెల్యేల అండతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తా. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే డా. సి. లకా్ష్మరెడ్డి సహా ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎంతో శ్రమిస్తున్నారు. వారందరి సహకారంతో పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ రానంత మెజార్టీతో విజయం సాధిస్తామనే నమ్మకం ఉన్నది. బరిలో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన మిగతా ఇద్దరు అభ్యర్థులు నాన్ లోకల్. నేను స్థానికున్ని. ఈ విషయాన్ని ఓటర్లు గమనిస్తారు.
ఎన్నికల ప్రచారం ఎలా సాగుతున్నది? ప్రచారం బ్రహ్మాండంగా సాగుతున్నది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలంతా సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటామంటున్నారు. ఏడు నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉన్నది. పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతానికి ఏం చేస్తారు? పాలమూరు అంటేనే ఒకప్పుడు వలసల జిల్లా. కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఆ పరిస్థితి పోయింది. ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చురుగ్గా సాగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా సాధించడం నా ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే ఈ ప్రాంతం పచ్చబడుతుంది. రైతులంతా సంతోషంగా ఉంటారు. జడ్చర్ల నుంచి శంషాబాద్ వరకు పారిశ్రామిక కారిడార్ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం నా రెండో ప్రాధాన్యం. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను సాధించేందుకు కృషి చేస్తా. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ప్రస్తుతం జరుగుతున్న రైల్వేలైన్ పనులను మరింత వేగవంతంగా చేయిస్తా. దీనిని కర్నూలు వరకు పొడిగించేలా ప్రయత్నిస్తా. కృష్ణా- వికారాబాద్ రైల్వేలైన్ చేపట్టేందుకు ప్రయత్నిస్తా. కొత్త జిల్లా కేంద్రాల్లో నవోదయ, కేంద్రీయ విద్యాలయాను తీసుకువచ్చి విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తాను.