-బల్దియాను అవినీతిరహితంగా తీర్చిదిద్దుతా -విశ్వనగరమే లక్ష్యంగా ముందుకు -సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా -నమస్తే తెలంగాణతో మేయర్ బొంతు రామ్మోహన్
తెలంగాణ రాష్టం ఏర్పాటు అనంతరం రాజధాని నగరానికి మొట్టమొదటి మేయర్‌గా ప్రజలకు సేవచేసే అదృష్టం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీ రామారావు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ముచేయకుండా.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాను. నగర ప్రజలకు మేయర్‌గా కాకుండా ఒక సేవకుడిగా సేవలు అందిస్తాను.
– నమస్తే తెలంగాణతో నగర ప్రథమ పౌరుడు
తాను పాలకుడిని కాదు.. సేవకుడిని అంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా ఎన్నికైన బొంతు రామ్మోహన్. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షలకు అనుగుణంగా, మంత్రి కే తారక రామారావు దిశానిర్దేశంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. బల్దియాను అవినీతి నుంచి పూర్తిగా విముక్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆయన ప్రకటించారు. నగర నూతన మేయర్‌గా ఎన్నికైన అనంతరం ఆయన నమస్తేకు ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. నగరాభివృద్ధికి చేపట్టబోయే పలు పథకాలను గురించి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
మేయర్‌గా ఎన్నికైనందుకు ఎలా ఫీలవుతున్నారు?
తెలంగాణ రాష్టం ఏర్పాటు అనంతరం రాజధాని నగరానికి మొట్టమొదటి మేయర్‌గా ప్రజలకు సేవచేసే అదృష్టం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీ రామారావు నన్ను మేయర్ పదవికి ఎంపికచేయడం ఎంతో గర్వంగా ఉంది. వారు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ముచేయకుండా.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాను. నగర ప్రజలకు మేయర్‌గా కాకుండా ఒక సేవకుడిగా సేవలు అందిస్తాను.
150 మందిలో మిమ్మల్నే ఎంపిక చేయడం వెనుక ప్రత్యేక కారణమేదైనా ఉందా? ప్రత్యేక కారణం నాకు తెలియదు. ఒక్కటి మాత్రం చెప్పగలను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాను. మొదటినుంచీ కేసీఆర్‌కు వెన్నంటి ఉంటూ వారి ఆశీస్సులతో ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్లేందుకు నావంతు కృషిచేశాను. అప్పుడు, ఇప్పుడు, ఇక ముందు కూడా సీఎం ఏది ఆదేశిస్తే అది పూర్తి చిత్తశుద్ధి, అంకితభావంతో ముందుకు తీసుకొని వెళ్తాను.
మౌలిక సదుపాయాలను మెరుగు పర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నగరాభివృద్ధికోసం ప్రభుత్వం సిద్ధంచేసిన ప్రణాళికలను తు.చ. తప్పకుండా అమలుచేసేందుకు కృషిచేస్తాను. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటాను. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషిచేస్తాను.
అక్రమ నిర్మాణాలపై మీ అభిప్రాయం ఏమిటి? వాటిని నిరోధించేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటారా? నగరంలోని సకల సమస్యలకు అక్రమ నిర్మాణాలే ప్రధాన కారణం. ముఖ్యంగా నాలాలు కబ్జాలకు గురయ్యాయి. ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలను కఠినతరం చేస్తున్నది. వాటిని పకడ్బందీగా అమలుచేసేందుకు కృషిచేస్తాను.
నగరంపై మీకున్న అభిప్రాయం ఏమిటి? ఎలా ఉంటే బావుంటుందని మీరు భావిస్తున్నారు? పరాయిపాలనలో నగరం అన్ని విధాలుగా విధ్వంసానికి గురైంది. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగలేదు. అప్పటి పాలకులు ముందుచూపు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో నగరం ప్రతిష్ఠ మసకబారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునాటికి, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చేనాటికి కరెంటు కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. గత పాలకుల హయాంలో కనీసం మంచినీటి అవసరాలు తీర్చేందుకు ప్రయత్నించిన దాఖలాలు లేవు. నిజాంల కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థనే కొద్దిపాటి మార్పు చేర్పులతో ఇప్పటికీ కొనసాగించారు తప్ప కొత్తగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుకు కనీసం ఆలోచన కూడా చేయలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న తరహాలోనే గత ప్రభుత్వాలు ఆలోచించి ఉంటే నగరం ఈపాటికి విశ్వనగరంగా వర్థిల్లేదని నా అభిప్రాయం.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు, అనంతరం ఈ రెండేండ్లలో నగరంలో వచ్చిన మార్పులపై మీ అభిప్రాయం? రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడాలేని విధంగా రూపొందించిన ఈ విధానానికి విశేష స్పందన వస్తున్నది. ఇప్పటికే దాదాపు 1000 వరకూ చిన్న, పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి.
ముఖ్యంగా ఇటీవల కేటీఆర్ కృషితో ఏర్పాటైన టీహబ్‌కు విశేష స్పందన లభిస్తున్నది. వీటివల్ల నగరంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యే ఆస్కారముంది. గతంలో పెట్టుబడులు, నగర భవిష్యత్ ప్రణాళికల గురించి పట్టించుకున్న నాథుడే లేడు. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.
పాలనలో రామ్మోహన్ శైలి ఎలా ఉండబోతున్నది? రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమగ్ర సమాచారాన్ని సేకరించింది. అందులోని సమాచారం ఆధారంగా ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు తగ్గట్టుగా, సీఎం దిశానిర్దేశానుసారం పాలన కొనసాగుతుంది. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాను.
అవినీతి నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? బల్దియా అంటే అవినీతికి ఆలవాలమనే అభిప్రాయం బలంగా నాటుకుపోయి ఉంది. దీన్ని సమూలంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటాను. సీఎంతోపాటు మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో వారి ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతి రహిత బల్దియాను తీర్చిదిద్దేందుకు శక్తివంచనలేకుండా కృషిచేస్తాను.
మేయర్‌గా మీరు ఏం చేయబోతున్నారు? మీకంటూ నగరాన్ని ఇలా చేయాలి అని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధంచేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకమైన పేదల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, స్లమ్‌లెస్ సిటీ తదితరాలను విజయవంతంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తాను.
మేయర్ బయోడేటా.. పేరు :బొంతు రామ్మోహన్ పుట్టిన తేది : 06-06 -1973 భార్య : శ్రీదేవి కూతుళ్లు :కుజిత, ఉషశ్రీ విద్యాభ్యాసం :ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం (పీహెచ్‌డీ) కులం : బీసీ (మున్నూరుకాపు)
రాజకీయ జీవితం -విద్యార్థి దశలో ఏబీవీపీలో పలు పదవులు -2002లో టీఆర్‌ఎస్‌లో చేరిక, టీఆర్‌ఎస్వీ సిటీ ఇంచార్జిగా నియామకం. -2005లో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు -2008లో విద్యార్థి విభాగం రాష్ట్ర ఇన్‌చార్జి -2009 నుంచి టీఆర్‌ఎస్ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు. -ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపు