-టీఆర్‌ఎస్‌ను క్యాడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దుదాం -జూలై 10లోగా సభ్యత్వ నమోదు పూర్తిచేయాలి.. క్రియాశీల సభ్యులు 35 శాతం ఉండేలా చూడాలి -కార్యకర్తల పూర్తి సమాచారాన్ని సేకరించాలి.. పత్రాలన్నీ పక్కాగా పూర్తిచేస్తేనే బీమా సదుపాయం -వారం రోజుల్లో ఆన్‌లైన్, మొబైల్‌లో సభ్యత్వ నమోదు సౌకర్యం -జూలై 20 నాటికి గ్రామాలు, పట్టణాలు, మండలాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటుచేయాలి -బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 51 శాతం ప్రాతినిధ్యం కల్పించాలి.. బీజేపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి -పార్టీ సభ్యత్వ నమోదు కమిటీల ఇంచార్జీలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం

తెలంగాణ రాష్ట్ర సమితిని క్యాడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దుదామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించి పకడ్బందీగా పూర్తిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం కేటీఆర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కమిటీల ఇంచార్జీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదులో పక్కాగా పత్రాలన్నీ పూర్తిచేస్తేనే బీమా వర్తిస్తుందన్నారు. జూలై 10లోగా సభ్యత్వ నమోదు పూర్తిచేయాలని, ఈ కార్యక్రమం పూర్తికాగానే వార్డులు, గ్రామాలు, పట్టణాలు, మండలాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటుచేయాలని చెప్పారు. ఈ కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 51 శాతం ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు టీఆర్‌ఎస్‌పై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, పార్టీ ప్రచారం కోసం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వాడుకోవాలని శ్రేణులకు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వ నమోదుకు వీలుగా పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని, మొత్తం సభ్యత్వ నమోదులో 35 శాతం క్రియాశీల సభ్యులను నమోదు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జీలతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమన్వయం చేసుకునేందుకు హైదరాబాద్ నగర పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున, మిగిలిన ప్రాంతాల్లో రెండు నియోజకవర్గాలకు ఒకరు చొప్పున ఇంచార్జీలను పార్టీ ప్రకటించిందన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వీరంతా వచ్చే రెండువారాలపాటు ఆయా నియోజకవర్గాల్లో ఉండి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని, సభ్యత్వ నమోదులో స్థానిక టీఆర్‌ఎస్ నాయకులందరినీ భాగస్వాములను చేయాలని చెప్పారు. టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని ఆన్‌లైన్, మొబైల్ ద్వారా చేసుకునే సౌకర్యాన్ని వారం రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు.

కార్యకర్తల పూర్తి సమాచారాన్ని సేకరించాలి సభ్యత్వ నమోదు సందర్భంగా కార్యకర్తల పూర్తి సమాచారాన్ని సేకరించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పిస్తున్నందున వారి చిరునామా, ఆధార్ నంబర్ , మొబైల్ నంబర్, నామినీ వివరాలను విధిగా సేకరించాలని సూచించారు. ఈ వివరాలుంటే బీమా సదుపాయాన్ని పొందేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను స్వయంగా తానే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని తెలిపారు.
గ్రామస్థాయిలో పార్టీ అనుబంధ కమిటీలు పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు పార్టీ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను కేటీఆర్ వివరించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కనీసం 51 శాతం ఉండేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ, మండల కమిటీలు, నగరాలు, పట్టణాల్లో డివిజన్, వార్డు కమిటీల ఏర్పాటు జూలై 20 నాటికి పూర్తయ్యేలా చూడాలని, ఇందుకోసం స్థానిక నాయకత్వంతో కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని ఇంచార్జీలకు కేటీఆర్ సూచించారు. ప్రతి కమిటీలో 15 మందికి తగ్గకుండా ఉండేలా చూడాలని, అన్ని కమిటీల్లోనూ పార్టీ క్రియాశీల సభ్యులకు మాత్రమే అవకాశమివ్వాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో పార్టీకి అనుబంధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు, యువజన, కార్మిక, మహిళా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సభ్యత్వాల డిజిటలీకరణ సభ్యత్వ నమోదు వివరాలను ఎక్కడికక్కడే డిజిటలీకరణ చేస్తున్నామని, కొత్త జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే జిల్లా ఇంచార్జీలను కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. సభ్యత్వం పూర్తయిన పుస్తకాలను ఆయా జిల్లా కేంద్రాలకు పంపగానే కంప్యూటీకరిస్తారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేశారు. క్రియాశీల సభ్యత్వాలనే కాకుండా సాధారణ సభ్యత్వాలను కూడా పూర్తిస్థాయిలో కంప్యూటీకరించనున్నారు. భవిష్యత్‌లో పార్టీ నాయకులతో మాట్లాడేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేసేందుకు వీలుగా ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్‌లను సేకరిస్తున్నారు.
సభ్యత్వ నమోదు పండుగలా జరుగాలి మంచి కార్యకర్తలు, అభిమానులకు తప్పనిసరిగా పార్టీ సభ్యత్వం లభించేలా చూడాలని, రాసి కంటే వాసి ముఖ్యమని కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు టీఆర్‌ఎస్ శ్రేణులంతా సిద్ధం కావాలని, వార్డుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోనూ పార్టీ సభ్యత్వ నమోదును పండుగలా నిర్వహించాలన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాల్లో పెద్ద సమావేశ మందిరాన్ని నిర్మించుకోవాలని సూచించారు. సిరిసిల్లలోనూ ఇదేవిధంగా చేస్తున్నామని, దీని కోసం అదనంగా మరో రూ.40 లక్షల వరకు అవసరమవుతాయని భావిస్తున్నామని తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయాల్లో సిబ్బందిని నియమిస్తామని, సభ్యత్వ నమోదుకు వాడుతున్న కంప్యూటర్లను పార్టీ కార్యాలయాల్లో ఉపయోగించుకునేలా సమకూరుస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.