క్రిస్టియన్లకోసం హైదరాబాద్ నగరంలో రూ.పది కోట్లతో క్రైస్తవ భవన్ నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఆ భవన్‌లోనే జరుగుతాయని చెప్పారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన జీవోను శుక్రవారమే విడుదల చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ నెలలోనే శంకుస్థాపన కూడా ఉంటుందని తెలిపారు.

-క్రిస్మస్‌కు రెండు రోజులు సెలవు జనవరి ఒకటిన కూడా.. -వచ్చే ఏడాది క్రిస్మస్ ఆ భవన్‌లోనే -దళిత క్రిస్టియన్లు దళితులతో సమానం -క్రిస్టియన్లకు ప్రత్యేక బోర్డు -క్రిస్మస్ వేడుకల్లో సీఎం వరాల జల్లు క్రిస్టియన్లకు నగరంలో ప్రత్యేక భవనం లేదన్న విషయం తమ దృష్టిలో ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మంచి ఆర్కిటెక్చర్‌తో అంతర్జాతీయ స్థాయిలో దీని నిర్మాణం ఉంటుందని తెలిపారు. భవన నిర్మాణ బాధ్యతలు పూర్తిగా డిప్యూటీ సీఎం టీ రాజయ్యకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా రెండు రోజులు సెలవులు ఇస్తామని ప్రకటించారు. జనవరి ఒకటిని కూడా సెలవుగా ప్రకటించారు.
క్రైస్తవులకు ప్రత్యేక బోర్డు కూడా లేదని, త్వరలోనే ఒక బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని పబ్లిక్‌గార్డెన్స్‌లోని లలిత కళాతోరణంలో నిర్వహించిన యునైటెడ్ క్రిస్మస్ -2014 వేడుకల్లో కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పావురాలు, బెలూన్లు ఎగురవేసి కేక్ కట్‌చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ గతంలో క్రిస్మస్ పండుగకు ఒక్కరోజు సెలవు ఉండేదని, దాన్ని తమ ప్రభుత్వం రెండు రోజులకు పెంచిందని తెలిపారు. జనవరి 1న కూడా సెలవు ఉంటుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో దళిత క్రిస్టియన్లను దళితులతో సమానంగా చూస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరు ఏ మతం పుచ్చుకున్నా కులం మాత్రం మారదు. కానీ దళితులకు మాత్రం కులం మారుతుంది. దీనికి లాజిక్కే లేదు. కారణం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అన్ని అవకాశాలు హాస్టల్, స్కాలర్‌షిప్ వంటివి కూడా దళిత క్రిస్టియన్లకు అమలు చేస్తాం అని సీఎం చెప్పారు.
క్రిస్టియన్లకు శ్మశానవాటికలకు స్థలాలు అడిగారు. ఈ డిమాండ్ నేను ఉద్యమం సమయంలోనే పెట్టాను. పట్టణాన్ని ఆనుకుని కొన్ని భూములున్నాయి. రెవెన్యూ అధికారులతో మాట్లాడి హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి సమాధుల కోసం స్థలాలు కేటాయింపచేస్తా అని కేసీఆర్ చెప్పారు. హజ్ యాత్రకు పోయేవారికి హజ్ కమిటీ ఉంటుంది. క్రైస్తవుల కోసం ఒక బోర్డును ఏర్పాటు చేస్తం. దీని ద్వారానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి.
విద్యాసంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్, ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు అడిగారు.. దీనిపై చర్చించి సానుభూతితో నిర్ణయిస్తాం. 341జీవోలోని రాయితీలు అమలు కావడం లేదని అన్నారు. కలెక్టర్లు, అధికారులకు ఈ జీవో అమలుపై కొత్త ఆదేశాలు జారీ చేస్తాం అని సీఎం హామీ ఇచ్చారు. కొన్ని అసాంఘిక శక్తులు క్రైస్తవ ఫాదర్లు, పాస్టర్స్‌పై దాడులు చేస్తున్నాయి. దీన్ని ఖండిస్తున్నా.
దాడులు నియంత్రించాలని ఆదేశాలు ఇచ్చిన. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటివి జరగకూడదు. తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులకు సంపూర్ణ రక్షణ ఉంటుంది. దాడి ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. కేసీఆర్ మాట ఇవ్వడు.. ఇస్తే తలతెగి పడినా మాట తప్పడు అని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి క్రిస్మస్ పండుగను క్రిస్టియన్‌లు ఆనందోత్సవాల మధ్య, వైభవంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. తనకు చాలా మంది క్రైస్తవ స్నేహితులు చిన్ననాటి నుంచి ఉన్నారని సీఎం చెప్పారు. క్రీస్తు జన్మించడమే ప్రేమకోసం.
ఆయన సందేశం ఎప్పుడూ స్మరణీయమే అన్నారు. ఆలయాలు, మసీదుల నిర్మాణానికి ప్రస్తుతం అమలుల్లో ఉన్న తరహాలోనే చర్చిల నిర్మాణాల కోసం త్వరితగతిన అనుమతుల విషయమై జీవో జారీ చేస్తానని హామీ ఇచ్చారు. యునైటెడ్ క్రిస్మస్ ఉత్సవాల కమిటీ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు టీ రాజయ్య, మహమూద్ అలీతోపాటు.. శాసనసభ్యుడు వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్వీస్ స్టీవెన్సన్, రెవరెండ్ తుమ్మల, రెవరెండ్ జాన్ కెనడీ, ఏసురత్నం, భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.