– సంక్షేమ పథకాల ప్రచారమే లక్ష్యంగా కొత్త పథకం – గ్రామ గ్రామాన ప్రచార బృందాలు – నేను కూడా పాట రాస్తా: సీఎం కేసీఆర్ – కళాకారులకు శాశ్వత ఉద్యోగం – ఇందిరాపార్క్ సమీపంలో తెలంగాణ కళాభవన్ – కళాకారులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి – చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పల్లె, పల్లెకూ.. గడపగడపకూ తెలిసేలా ప్రచారం చేయడానికి తెలంగాణ సాంస్కృతిక వారధిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దీనికోసం తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలతో తన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు ఆరు గంటల పాటు ఈ వినూత్న పథకం గురించి వాళ్లతో చర్చించారు. ఈ సాంస్కృతిక వారధి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు కళాత్మకంగా చేరవేస్తుంది.
ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణను ఒక మహోద్యమంలా చేపట్టాలని కళాకారులను కోరారు. చెరువుల ప్రాముఖ్యం, వాటి పునరుద్ధరణపై ప్రజలలో అవగాహన పెంచే విధంగా అద్భుతమైన పాటలు రాయాలని సూచించారు. దీనికోసం తాను కూడా ఒక పాట రాస్తానని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. సాంస్కృతిక వారధిలో కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిని సీఎం ఆదేశించారు. ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం రేయింబవళ్లు శ్రమకోర్చి పనిచేసిన సుమారు 500 మంది కళాకారులను ఎంపిక చేసి వారికి సముచిత గౌరవం కల్పించాలన్నది సీఎం కేసీఆర్ ముఖ్య ఉద్దేశం.
వీరందరికీ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగావకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వయసు, విద్యార్హతలలో మినహాయింపులు కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రాంతంలోని ఏయే కళాకారులు, కవులు, రచయితలను సాంస్కృతిక వారధిలో నియమిస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వాలని గోరటి వెంకన్న, జయరాజ్, వరంగల్ శ్రీనివాస్, యశ్‌పాల్, నందిని సిధారెడ్డిలను ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక వారధికి హైదరాబాద్‌లోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, వారు ఉండేందుకు భవనాలను కూడా కేటాయించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఈ సాంస్కృతిక వారధి ఏర్పాటుకు కో-ఆర్డినేటర్లుగా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ముఖ్యమంత్రి ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌లు వ్యవహరించనున్నారు. తెలంగాణ సాంస్కృతిక వారధి కార్యాలయాన్ని తాత్కాలికంగా రవీంద్ర భారతి పరిసరాల్లోనే ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో నందిని సిధారెడ్డి, గోరటి వెంకన్న, జయరాజ్, దేశపతి శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, వరంగల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరాపార్క్ సమీపంలో తెలంగాణ కళాభవన్ ఇందిరాపార్క్ సమీపంలోని 11 ఎకరాల ప్రభుత్వ స్థలంలో సువిశాలమైన తెలంగాణ కళాభవన్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ కళాకారులతో సమావేశంలో వెల్లడించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే కళాకారులకు ఈ భవనంలో వసతి సదుపాయాలను కల్పించేవిధంగా ఏర్పాట్లు చేస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కళాభవన్ నిర్మిస్తామని సీఎం పేర్కొన్నారు. నిర్మాణ వ్యయం, డిజైన్, ఇతర అంశాలన్నింటినీ అధికారులతో చర్చించి వెల్లడిస్తామని కేసీఆర్ చెప్పారు.
చెరువుల ప్రాముఖ్యతపై పాటలు రాయండి చెరువుల పునరుద్ధరణపై ప్రజలకు అవగాహన కల్పించేలా అద్భుతమైన పాటలు రాయాలని సీఎం కేసీఆర్ కళాకారులను కోరారు. తెలంగాణ ప్రజల జీవితానికి, చెరువులకు ఉన్న అనుబంధాన్ని… ఆంధ్ర వలస పాలనలో తెలంగాణలోని చెరువులు నిర్లక్ష్యానికి గురై, ధ్వంసమైన తీరును, చెరువులను పునరుద్ధరించాల్సిన ప్రాముఖ్యాన్ని తెలిపే విధంగా పాటలు ఉండాలని దిశా నిర్దేశం చేశారు. అదే విధంగా తెలంగాణకు హరితహారం, సామాజిక అడవుల పెంపకం వంటి విషయాలపై ప్రజల్లో అవగాహన పెంచేలా పాటలు రాయాలని సూచించారు. దళిత వాడల నుంచి దారిద్య్రాన్ని తరిమికొట్టాలని ప్రతిజ్ఞ చేశానని ముఖ్యమంత్రి కళాకారులతో అన్నారు.
దళితులలో ఆత్మ విశ్వాసం పెంచేలా, తామూ ఇతరులతో సమానంగా పోటీపడగలమనే విధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టబోతున్నదన్నారు. ఇదే రీతిలో పాటలు రాయాలని, కళారూపాలు రూపొందించాలని సీఎం సూచించారు. కళాకారులకు సీఎం కేసీఆర్ శాశ్వత ఉద్యోగాలు ఇస్తామనడం హర్షణీయమని, ఆయనకు కళాకారులు ఎంతో రుణపడి ఉంటారని ఈ సందర్భంగా కవులు, కళాకారులు అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.