Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి..

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి నిజామాబాద్‌లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని, మహిళలకు సైనిక్ స్కూల్ ఏర్పాటు, రక్షణ బలగాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. -కేంద్ర రక్షణశాఖ మంత్రిని కోరిన ఎంపీ కల్వకుంట్ల కవిత -మహిళా సైనిక్‌స్కూల్, రక్షణ బలగాల రిక్రూట్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు విజ్ఞప్తి

TRS-MP's-and-Ministers-met-Union-defence-minister-Manohar-Parrikar

ఈ మేరకు గురువారం ఢిల్లీలో రక్షణశాఖ మంత్రికి ఆమె విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఎంపీ కవితతోపాటు కేంద్రమంత్రి పారికర్‌ను కలిసిన వారిలో రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి ఉన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు రక్షణ రంగంలో గొప్ప ముందడుగు అవుతుందని, దిగుమతుల వ్యయం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రక్షణ రంగ పరిశ్రమలకు నిజామాబాద్‌లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెరుగైన సేవలందించే అవకాశముంటుందని ఆమె తెలిపారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అవసరమైన అనుమతులు తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని నిజామాబాద్ ఎంపీ కవిత హామీ ఇచ్చారు. అలాగే జిల్లా కేంద్రంలో మహిళా సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా బాలుర కోసం మాత్రమే సైనిక్ స్కూళ్లు ఏర్పాటు చేశారని, దాంతో వారికి మాత్రమే సైన్యంలో చేరే అవకాశం లభిస్తుందని ఆమె అన్నారు. రక్షణశాఖలో మహిళల నియామకాలు జరుగుతున్నా.. డిఫెన్స్‌కు సంబంధించిన అంశాలు నేర్చుకునే అవకాశం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో మహిళా సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే బాలికలు కూడా రక్షణ రంగానికి సేవ చేసే అవకాశం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

-ఆర్మీ రిక్రూట్‌మెంట్ సెంటర్ కోసం.. రక్షణశాఖలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం పెంచేందుకు నిజామాబాద్‌లో రిక్రూట్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పారికర్‌ను పార్లమెంట్ సభ్యురాలు కవిత కోరారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ నియామక కేంద్రం చాలా దూరంగా ఉందని, దాంతో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తున్నదని తెలిపారు. నిజామాబాద్‌లో రిక్రూట్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే సైన్యంలో చేరాలన్న తెలంగాణ నిరుద్యోగుల కల సాకారమవుతుందని రక్షణ మంత్రికి వివరించారు.

నిజామాబాద్‌లో పసుపు పార్కును నెలకొల్పండి -నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ప్రతినిధి బృందం విజ్ఞప్తి పన్నెండో ప్రణాళిక కాలంలో ప్రతీ రాష్ట్రంలో స్పైస్ పార్కు ఏర్పాటుకు నిర్ణయించినందున నిజామాబాద్‌లో పసుపు పార్క్‌ను నెలకొల్పాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. గతంలో పలుమార్లు పసుపు బోర్డు చైర్మన్‌కు విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. కేంద్రమంత్రితో రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు సమావేశమయ్యారు. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. అనంతరం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పసుపు పార్క్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 39.38 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచిందని, ఉద్యానవనశాఖ పేరు మీద రిజిస్టర్ కూడా చేసిందని తెలిపారు.

స్పైస్ బోర్డు ఛైర్మన్ విజ్ఞప్తి మేరకు మొత్తం 40.23 ఎకరాల స్థలాన్ని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడ్గల్ గ్రామంలో గుర్తించి సంబంధిత డాక్యుమెంట్లను కేంద్రానికి అందజేసిందని మంత్రి గుర్తు చేశారు. అనంతరం స్పైస్‌బోర్డు కూడా ఈ వివరాలను వాణిజ్యశాఖకు సమగ్ర నివేదికను పంపడమే కాకుండా రూ.30.82 కోట్లను మంజూరు చేయాలను ఆదేశించిందని మంత్రి తెలిపారు. నిజామాబాద్‌లో పసుపు పార్కును ఏర్పాటు చేసే విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. వరంగల్‌లో మిర్చి పంటకు, నిజామాబాద్‌లో పసుపు పంటకు, గుడిమల్కాపూర్‌లో పూలకు, ఒంటిమామిడి, బోయిన్‌పల్లిలో కూరగాయలకు కోల్డ్ స్టోరేజి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.