Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఒక్కరు కాదు.. నలుగురు రండి

నాలుగు హెలికాప్టర్లు పెడతాం
-తెలంగాణతో ఎందులో మీ పోటీ?
-మా రాష్ట్రంలో ప్రగతి లేకుంటే..
-మీ అధికారులు ఎందుకొస్తున్నారు?
-ఎందుకు అధ్యయనం చేస్తున్నారు?
-రవీంద్రభారతిలో చర్చిద్దాం సిద్ధమా?
-బీజేపీ నేతలకు వినోద్‌కుమార్‌ సవాల్‌

బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మం త్రులు, నాయకులు రోజుకొకరు వచ్చి ఒక్కో జిల్లాలో పర్యటించడం కాదని, దమ్ముంటే అందరూ ఒకసారే రావాలని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ సవాలు చేశారు. అవసరమైతే నాలుగు హెలికాప్టర్లు పెట్టి తిప్పి చూపిస్తామన్నారు. తెలంగాణ ప్రగతిపై రవీంద్రభారతిలో విపులంగా చర్చిద్దామని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఇక్కడికొచ్చి ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తే ఇకపై సహించబోమని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీలు బస్వరాజు సార య్య, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధా న కార్యదర్శులు మెట్టు శ్రీనివాస్‌, రూప్‌సింగ్‌, పార్టీ నేతలు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, రవీందర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిలో తెలంగాణకు, బీజేపీ పాలిత రాష్ర్టాలకు పోలికే లేదని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీపై సద్విమర్శలు చేయాలని, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని హితవు చెప్పారు. దురదృష్టవశాత్తు బీజేపీ నేతలకు నిందలు వేయటమే పనిగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి రాష్ర్టాన్ని సాధించి, అనతికాలంలోనే అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపిస్తున్న గొప్ప నాయకుడు, సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు నోరుపారేసుకోవటం రివాజుగా మారిందని మండిపడ్డారు. ఇప్పటిదాకా సహించామని, ఇక నుంచి ఒక్కొక్కరినీ చీల్చిచెండాడుతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈశాన్యంలో స్పెషల్‌ స్టేటస్‌ అనుభవిస్తున్న అస్సాంలో జరిగిన ప్రగతి ఏమిటని నిలదీశారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్‌, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, బీజేపీ జాతీ య అధ్యక్షుడు జేపీ నడ్డా ఇలా ఒక్కొక్కరు ఒక్కో జిల్లాను ఎంచుకొని పర్యటిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పరామర్శించే పేరుతో సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా తిట్టడం దుర్మార్గమన్నారు.

మాతో మీకు పోలిక ఎక్కడిది?
దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఉన్నాయా? అని వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. జీఎస్డీపీలో తెలంగాణ రూ.9.89 లక్షల కోట్లు ఉంటే మధ్యప్రదేశ్‌లో రూ.9.17 లక్షల కోట్లు, ఛత్తీస్‌గఢ్‌ రూ.3.5 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. దేశంలో ప్రత్యేక రాష్ట్రాల ప్యాకేజీలో ఉన్న అస్సాంలో రూ.6.18 లక్షల కోట్లు మాత్రమే జీఎస్డీపీ ఉన్నదన్నారు. గత ఏడేండ్ల కాలంలో రాష్ట్రంలో జరిగినన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా కాలేదని తెలిపారు. కల్యాణలక్ష్మి, ఆసరా పిం ఛన్లు, తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, బీడీ కార్మికులు, బోదకాలు వ్యాధిగ్రస్తులకు, హెచ్‌ఐవీ బాధితులకు పింఛన్లు ఇస్తున్నామని గుర్తుచేశారు. రైతుబంధును కేంద్రం కాపీ కొట్టి కిసాన్‌ సమ్మాన్‌ యోజన తెచ్చిందన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయతో చెరువులు పునరుద్ధరణ, ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక పథకాల్లో దేనితో మీ రాష్ర్టాలను పోల్చుకొంటారో తెలపాలని ప్రశ్నించారు. విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, విదేశీ విద్యానిధి, గురుకులాల ఏర్పాటు.. ఇలా ఎన్నెన్నో చేశామని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్‌ చేసినన్ని ప్రయోగాలు ఈ దేశంలో మరే రాష్ట్రం చేయలేదని గుర్తుచేశారు. కేసీఆర్‌ మానవీయ విధానాలతో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ డయాలసిస్‌ సేవలు అందుతున్నాయని చెప్పారు.

సంపన్న గుజరాతే మోదీ లక్ష్యం
ప్రధానమంత్రి మోదీ లక్ష్యం సంపన్న గుజరాత్‌ తప్ప.. సంపన్న భారతదేశం కాదని వినోద్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దేశానికి ఒరగబెట్టింది ఏదీ లేదని అన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీ వంటి ప్రధానులు.. అప్పుడున్న పరిమిత వనరులు, పరిమిత సాంకేతిక పరిజ్ఞానంతోనే మన దేశం వైపు కన్నెత్తి చూడాలంటే సరిహద్దు దేశాలు హడలిపోయేలా చేశారని గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు బీజేపీ మాత్రం మతాల మధ్య, దేశాల మధ్య, ప్రజల మధ్య చిచ్చుపెట్టి నాలుగు ఓట్లు అడుక్కోవటమే పనిగా పెట్టుకొన్నదని ఆయన మండిపడ్డారు. 1992 నుంచి రామమందిర్‌ అని చెప్పుకొంటూ ఓట్లు దండుకొన్నారని విమర్శించారు. తమ నాయకుడు సీఎం కేసీఆర్‌ ఎటువంటి ప్రచారం లేకుండానే యాదాద్రిని చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించారని కొనియాడారు. తెలంగాణ లౌకికవాదానికి అసలు సిసలు అడ్డా అన్నారు. చేనేతను బతికించటం కోసం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, రంజాన్‌, క్రిస్‌మస్‌ సందర్భంగా ఆయా వర్గాలకు దుస్తులు పంపిణీ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ ఏడేండ్ల పాలన కాలంలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశ సంపదను కొల్లగొట్టి గుజరాత్‌కు తరలించటమే కేంద్రం పరమావధిగా మారిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మటమే దేశభక్తిగా బీజీపీ చెలామణి చేసుకొంటున్నదని వినోద్‌కుమార్‌ మండిపడ్డారు.

మీ వాళ్ల ప్రశంసలు మరిచారా?
దేశానికి అనేక రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రకాశ్‌ జవదేకర్‌, అరుణ్‌ జైట్లీ, జేపీ నడ్డా, పీయూష్‌గోయల్‌, స్మృతి ఇరానీ, చివరికి ప్రధాని మోదీ.. ఇలా ఎందరో నేతలు పార్లమెంట్‌ లోపలా, బయటా కీర్తించిన విషయాలు వాస్తవం కాదా? అని అడిగారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మిషన్‌భగీరథ వంటి పథకాలను మెచ్చుకొని తమ రాష్ట్రంలోనూ ఇటువంటి పథకాన్ని తెస్తామని చెప్పినమాట నిజం కాదా? అని నిలదీశారు. తెలంగాణలో ప్రగతి జరుగక పోతే.. ఆయా రాష్ర్టాల నుంచి ఉన్నతాధికారుల బృందాలు ఇక్కడికి వచ్చి ఎందుకు అధ్యయనం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.