ఒకే ఒక్కడు! పద్నాలుగేళ్ల క్రితం వేసిన తొలి అడుగు! తొలి ఒంటరి అడుగు! నిండు చందురుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు! ఆకాశమంత ఆకాంక్షను నెత్తినేసుకుని.. సముద్రమంత గోసను యావత్ ధరిత్రి దిక్కులు పిక్కటిల్లేలా ఇన్నాళ్లూ వినిపించిన ఉక్కు ప్రాణం! లక్ష్యం ఒక్కటే.. వలసదోపిడీ అంతమయ్యే తెలంగాణ! ఆశయం ఒక్కటే.. యాచించే స్థితి నుంచి తెలంగాణను శాసించే స్థాయికి తేవటం! మార్గం ఒక్కటే.. రాజీలేని పోరాటం! అలుపూలేదు.. సొలుపూలేదు! విరామమెరుగని పరిశ్రమ! తెలంగాణ మాగాణంలో స్వేచ్ఛాకుసుమాలు పండించేందుకు చెమటోడ్చిన కృషీవలుడు !
అచ్చమైన తెలంగాణ భవన నిర్మాణ కార్మికుడు! తెలంగాణ కోసం కుష్టురోగినైనా కౌగలించుకోడానికి, బొంత పురుగునైనా ముద్దు పెట్టుకోవడానికి సిద్ధపడిన సాహసం! ఆఖరుకు అదే తెలంగాణ సాధన కోసం మత్యువు ద్వారాన్ని తట్టి వచ్చిన తెగువ! సచ్చుడో.. తెచ్చుడో..! ఏ పదవి చేపడితేనేం? ఏ కూటమిలో చేరితేనేం? అది తెలంగాణకు ఏదో ఒక మేలు చేస్తుందనే చిన్న ఆశ! అదే పదవిని తణప్రాయంగా విసిరికొట్టి.. లెక్కలేనన్ని ఉప ఎన్నికలకు తానే కాకుండా.. తన పార్టీ యోధులను సిద్ధం చేసినా.. తెలంగాణకు నానాటికీ పెరుగుతున్న మద్దతు చాటాలనే తపన! పిలుపిస్తే ప్రభంజనం! ఆయన మాట్లాడితే సంచలనం! ఆయన మౌనం దాల్చితే.. తదుపరి మహా ప్రళయంలాంటి నిర్ణయం! అందుకే ఆయనను చూసి అంతా నవ్వారు! ఉప ఎన్నికల పార్టీ అన్నారు! ప్రజాసమస్యలు పట్టవన్నారు! నవ్విన నాపచేను పండింది! ఫిబ్రవరి 18, 2014న లోక్‌సభలో టీ బిల్లు ఆమోదంతో సువర్ణాధ్యాయం లిఖితమైంది! ఎట్టకేలకు ఉద్యమం పరిమళం పది జిల్లాలను ముంచెత్తింది! పోరు తెలంగాణ నుంచి.. విజన్ తెలంగాణ బాటలో… ఒక్కడే.. ఉద్యమం ఆరంభించినవాడు.. కడదాకా కలెబడి గెలిచినవాడు! ఆ ఒక్కడే.. తెలంగాణకు మాట ఇచ్చినవాడు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడు! ఇప్పుడూ అదే ఒక్కడు.. ఓట్ల కురుక్షేత్రంలో ఒంటరిపోరుకు దిగినవాడు.. పది జిల్లాల మద్దతును ధర్మబద్ధంగా అడుగుతున్నవాడు!

… కేసీఆర్ !!మొదట వాళ్లు నిన్ను విస్మరిస్తారు.. ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు.. ఆ తర్వాత నీతో యుద్ధం చేస్తారు.. తర్వాత నువ్వు గెలుస్తావు! సత్యాగ్రహాల గాంధీ మహాత్ముడు తన అనుభవసారాన్ని కాచి వడపోసి చెప్పిన మాట ఇది! సరిగ్గా కేసీఆర్ విషయంలో రుజువైంది! పద్నాలుగేళ్ల క్రితం ఆయన తొలి అడుగు వేసినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు! గేలి చేశారు.. పదవి దక్కలేదనే అంటూ తిట్టిపోశారు! వటుడు ఇంతింతైన కొద్దీ.. దోపిడీశక్తుల వణుకు పెరిగింది! బ్రహ్మాండాంతసంవర్దియైనప్పుడు భయపడ్డారు! ఉద్యమంపై దాడి తీవ్రమైంది! తుంచేయాలనుకున్నారు.. బురదజల్లారు.. సాక్షాత్తూ నిండు చట్టసభలో అవమానించారు.. ఆఖరుకు చిదిమేసేందుకు సిద్ధమయ్యారు! కాదంటే దృతరాష్ట కౌగిళ్లు! అయినా అన్నీ తట్టుకున్నాడు! ఉద్యమం కొత్త చిగురేసింది! పోరాటం కొత్తపుంతలు తొక్కింది! సబ్బండ వర్ణాలను సకల జనుల సమ్మెలోకి నడిపింది!
పది జిల్లాలను పోటెత్తించింది! హస్తిన పాలకుల తీరు కలిచివేస్తుంటే.. వలస ప్రభుత్వాధినేతలు అడ్డంపడుతుంటే బీరువులైన తెలంగాణ బిడ్డలు ఆత్మత్యాగాలే మార్గమని దహించుకుపోతుంటే.. ఉద్యమ ఆకాంక్షల తీవ్రతను పెంచుతుంటే.. మానసిక వ్యథ! బంగారాల్లాంటి బిడ్డలు ఆహుతైపోతున్నారన్న ఆవేదన! ఇంక ఒక్కరూ చనిపోకూడదనే సంకల్పం! నిండు వరదతో పోటెత్తిన కష్ణమ్మను నిలువరించే శ్రీశైలం ఆనకట్టలా! ఎంత భారం? ఎంత ఒత్తిడి? అన్నీ తట్టుకుందా ఉక్కు శరీరం! ప్రణాళికాబద్ధంగా ఉద్యమాన్ని పారించి.. ఉరకలెత్తించి.. అవసరమైన చోట పోటెత్తించి.. పోరు పంటలు పండించింది! ఒకే ఒక్కడై నడిపిన ధర్మ యుద్ధం.. అంతే ధర్మబద్ధంగా విజయం సాధించింది! జూన్ రెండును తెలంగాణకు కొత్త విముక్తి దినంగా ప్రసాదించింది! ఇది తెలంగాణకు మూలమలుపు! బంగారి తెలంగాణ సాధించుకునే కీలక సందర్భం! సరిగ్గా ఏడు రోజుల్లో తెలంగాణ తన భవితవ్యానికి పునాది రాయి వేసుకునే సమయం! ఓట్ల పండుగ!
కానీ.. విచిత్రం! సకల తెలంగాణ వ్యతిరేకశక్తులు జట్టుకడితే.. ఇప్పుడూ కేసీఆర్ ఒక్కడే! ఆశ్చర్యం! ఒకప్పటి తెలంగాణకు బద్ధ శత్రువులంతా ఇప్పుడు రాత్రికి రాత్రి తెలంగాణ సాధకులైపోయారు! చిత్రం! ఒకప్పుడు తెలంగాణను వేధించినవారంతా ఇప్పుడు భావి తెలంగాణకు మేమే చోదకులమంటున్నారు! మాటలు మారిపోతున్నాయి! తెలంగాణను దశాబ్దాలపాటు నాన్చినవాళ్లు.. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిందే మేమంటున్నారు! తెలంగాణకు వ్యతిరేకం కాదన్న మాట చెప్పడమే తప్పించి.. తెలంగాణకు అనుకూలం అనే మాటనే వాడేందుకు ఇష్టపడని మరొకరు నేనిచ్చిన లేఖ పుణ్యమే తెలంగాణ అంటున్నారు! చట్టసభలకు చేరిన తెలంగాణ ఆకాంక్ష ఆఖరి అడ్డంకి అధిగమించే సమయాన ఉన్నట్టుండి ఊడిపడి.. నానా యాగీ చేసినవాళ్లు.. నా మద్దతే తెలంగాణ తెచ్చిదంటున్నారు! ఇంకా.. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణలోనే సవాలు విసురుతున్నారు! అందరూ మారిపోయారు భయ్! తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు.. విభజించిన తీరుకే అభ్యంతరమంటున్నారు!
ఇదే సమస్య! ప్రతి మనిషి మాట వెనుక అతడి వర్గ ప్రయోజనం దాగి ఉంటుంది! తెలంగాణలో కోట్లకు కోట్లు కూడేసుకున్న సీమాంధ్ర పెత్తందార్ల సంపద గుట్టలకు ఇప్పుడు పహారా కావాలి! అదీ ఆ వర్గ ప్రయోజనం!
ఇప్పుడే అసలైన ప్రశ్న! అరవై దశాబ్దాల వలస పాలన.. తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాతా కొనసాగాలా? ఇన్నేళ్లూ దోచుకున్న ఆంధ్ర పార్టీలకే తెలంగాణ పాలనా పగ్గాలు అందించాలా? లేక తెలంగాణ కోసమే పుట్టి.. తెలంగాణనే శ్వాసించిన ఇంటిపార్టీని ఎన్నుకోవాలా?
ఇప్పుడు కేసీఆర్ అడుగుతున్నదీ ఇదే! యాచించే స్థితిలోనే ఉందామా? ఇకనైనా శాసించే స్థితికి చేరుకుందామా? ఈ చారిత్రక సంధి సమయంలో సీమాంధ్ర పార్టీల వైపు నిలుద్దామా? లేక వారితో కలెబడి నిలబడుదామా? సకల ఆంధ్ర దోపిడీ శక్తులు ఏకమైన వేళ.. ఒక్కడై నిలిచి, సూటిగా ప్రశ్నిస్తున్నాడు!
Please Click on the image to view full size image
