Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఒక్క తాటిపై తెలంగాణ!

అన్ని శక్తులు ఒక్కటి కావాలి ఇది రాజకీయాలకు సమయం కాదు తెలంగాణ బలమైన రాష్ట్రం గా తీర్చిదిద్దుకోవాలి చేవెళ్ల శంకరపల్లి లో మంచి ఆస్పత్రి పెడతాం సిఎం కే.చంద్రశేఖర్ రావు స్పష్టీకరణ

తెలంగాణ యావత్ రాజకీయశక్తులు ఒక్కటి కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఇపుడు రాజకీయాలు చేసుకోవడం మంచిది కాదు.. రాష్ట్రం అభివృద్ధి కోసం రాజకీయశక్తులన్నీ ఒకే తాటిపైకి రావలసిన అవసరం ఉందని అన్నారు.

KCR

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కే యాదయ్య ఆదివారం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొత్తగా రాష్ట్రం వచ్చింది.. కాబట్టి దీన్ని అందరం కలిసి నిలబెట్టుకోవాలి.. తెలంగాణ గెలిచి నిలవాలి.. నిలిచి గెలవాలి. తెలంగాణను బలమైన రాష్ట్రం గా తీర్చి దిద్దుకోవాలి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల్లో ఇవాళ ఎన్నో ఆశలున్నాయని కేసీఆర్ అన్నారు. మన రాష్ట్రం మనకు వచ్చింది. మనం అన్ని విధాలా బాగుపడాలి. ఎన్నో సంవత్సరాల నుంచి మనకున్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. తెలంగాణ సమాజం మొత్తం పెద్ద ఆశతో ఇవాళ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైపు చూస్తున్నది. ఇందులో తప్పు లేదు. కొత్త రాష్ట్రం కాబట్టి ప్రజల్లో కోటి ఆశలుంటాయి. తప్పకుండా అవన్నీ నెరవేరి తీరాలి. అయితే తెల్లారేసరికి చేయలేం కాబట్టి దానికి క్రమపద్ధతిలో చేసుకుంటూ పోవాలి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి పుష్కలమైన నిధులు, అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వాటికి తోడు కోర్టు కేసుల్లో మూలుగుతున్న విలువైన ప్రభుత్వ భూ ములు చెర విడిపిస్తే లక్షల కోట్లు వచ్చే ఆస్కారం ఉంటుందని, వాటితో ఎన్నో పనులు చేసుకోవచ్చునని అన్నారు.

మూడేండ్ల తర్వాత రెప్పపాటు కూడ కరెంటు పోదు: మూడేండ్ల తర్వాత రెప్పపాటు కూడా కరెంటు కోత లేకుండా చేస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. నాలుగో సంవత్సరం పూర్తయ్యేనాటికి ప్రతి ఇంటికీ నల్లాను పెట్టించి కృష్ణా, గోదావరి జలాలు అందిస్తామన్నారు.

మంచినీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు కూడా అడగదని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ హైదరాబాద్ చుట్టూ వెయ్యి ఎకరాల్లో గ్రీన్ హౌజ్ కల్టివేషన్, హార్టికల్చర్ పెట్టామని, డ్రిప్ ఇరిగేషన్‌లో ఎస్టీలకు 100శాతం, బీసీలకు90శాతం, ఇతరులకు 80శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు అందిస్తామని చెప్పారు. రైతులు ముందుకు వస్తే ఎన్ని ఎకరాలకైనా రాయితీ ఇవ్వటానికి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించిందని చెప్పారు. దాదాపు రూ.30-34లక్షలు ఖర్చయ్యే పాలీహౌజ్‌లకు 75శాతం రాయితీ కల్పిస్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో ఇది ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యంగా తాండూరు, పరిగి, ఇబ్రహింపట్నం, మేడ్చల్, మహేశ్వరం, చేవెళ్ల నియోజక వర్గాల రైతులకు మంచి అవకాశాలుంటాయని అన్నారు. ఈ విధానంలో రైతులు లక్షాధికారులు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీనిపై రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. ఇకపై హైదరాబాద్‌లో అంతా రంగారెడ్డి కూరగాయలే తినే పరిస్థితి రావాలని అన్నారు.

ఆస్పత్రులకు ఓకే..: ఎమ్మెల్యే యాదయ్య కోరికలన్నీ న్యాయమైనవన్నారు. నూటికి నూరుశాతం వాటిని తీర్చి ప్రజల్లో ఆయన పేరును నిలబెడతామని అన్నారు. శంకరపల్లి, చేవెళ్లలో మంచి ఆస్పత్రులు కావాలన్నది న్యాయమైన కోరిక. తప్పకుండా వందశాతం చేయిద్దామని హామీ ఇచ్చారు. చేవెళ్లలో అద్భుతమైన అభివృద్ధికి అవకాశం ఉందన్నారు.

స్థానికులకు ఉద్యోగావకాశాల గురించి ప్రస్తావించారని చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల్లో మంచి కార్యక్రమాలు తీసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఎమ్మెల్యే యాద య్య ప్రముఖంగా ప్రస్తావించిన జీవో నెంబరు 111 పై కేసీఆర్ వివరణ ఇచ్చారు. అది రాష్ట్ర ప్రభుత్వ జీవో కాదు.. కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిందన్నారు. గండిపేట, హిమాయత్‌సాగర్‌లోకి వచ్చే నీరు కలుషితం కావద్దన్న ఆలోచన మంచిదైనా ఈ జీవో ఫలితంగా ఇక్కడ ఆంక్షలు విధించి ఏ పనీ చేయనివ్వడం లేదన్నారు.

సిటీ పక్కనే ఉన్నా భూములకు విలువ లేకుండా పోయే ప్రమాదం వచ్చిందన్నారు. దీన్ని నివారణకు ప్రత్యేక వ్యూహం అమలు చేయాల్సి ఉందన్నారు. పర్యావరణ శాఖ అభ్యంతరమైన కాలుష్యం సమస్య రాకుండా ఇక్కడ వాతావరణ, పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా రాష్ట్రం పనిచేస్తుందని ప్రభుత్వం హామీ ఇస్తే.. కొన్ని సవరణలతో ఆ ఆంక్షలు తొలగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే జిల్లా నేతలు యాదవరెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చారని చెప్పారు. సిటీ పక్కన భూములు ఉన్నా దేన్నీ కట్టనీయటం లేదు.. పట్టుకోనీయటం లేదు. ముట్టనీయటం లేదు.

విలువ లేకుండా పోయిందని వారు వివరించారన్నారు. రాష్ర్టానికి ఇంకా పూర్తి స్థాయి అధికారులు రాలేదని ఒకసారి వారు వచ్చాక మన రాష్ట్ర అటవీశాఖ, పర్యావరణ శాఖను పురమాయించి చీఫ్ కన్జర్వేటర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలతో కమిటీ వేసి పూర్తి స్థాయిలో పరిశీలన చేయిస్తామని చెప్పారు. తనకున్న సమాచారం మేరకు 80గ్రామాలను ఇందులో పెట్టాల్సిన అక్కర లేదని, కొన్నింటిని వెంటనే తీసేయవచ్చునని అన్నారు.. వాటిని తీసివేసి మిగతా వాటి విషయంలో కమిటీ వేసుకుని ముందుకు వెళ్దామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

అంతకుముందు ప్రసంగించిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య 60 ఏళ్ల పోరాటం, అమరుల త్యాగ ఫలితంతో తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్ నిష్పక్షపాతంగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నరని, ఆయన కార్యక్రమాలు ఆకర్షించడం వల్లనే సత్వర నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇన్నాళ్లూ పశ్చిమ రంగారెడ్డి జిల్లా నిరాదరణకు గురైందని ఆ లోటు భర్తీ కాగలదనే విశ్వాసం ఉందని అన్నారు. వైఎస్ తనకు గుర్తింపు తెచ్చిన నాయకుడన్నారు. తెలంగాణ గాలిలో ప్రజలు తనను గెలిపించారని చెప్పారు. తమ నియోజకవర్గంలో 84గ్రామాలకు జీవో 111 ప్రాణాంతకంగా మారిందని వాపోయారు. దానిని ఎత్తి వేయడమో సడలించడమో చేయాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అది జరిగితే మా అదృష్టంగా భావిస్తాం. సీఎం కేసీఆర్ అంత దేవుడు ఉండరు.మిమ్మల్నే దేవుడిగా భావించి ఇంట్లో ఫొటో పెట్టుకుని పూజిస్తాం అని ఆయన అన్నారు.

రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పనితీరు, ప్రవేశపెట్టిన పథకాలు చూసి వివిధ పార్టీల వారంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు చేయనివి.. మ్యానిఫెస్టోలో లేనివి కూడా చేస్తున్నారని ప్రశంసించారు. ఎప్పుడూ లేని విధంగా భారీ బడ్జెట్ పెట్టారని, ఆర్‌అండ్‌బీ, పీఆర్ రోడ్లకు రూ10 వేల కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఉనికి ఉండదన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ప్రతి కార్యక్రమం చేవెళ్ల నుంచి ప్రారంభించేవారని అలాంటిది ఇవాళ చేవెళ్లలోనే కాంగ్రెస్ లేకుండా పోతున్నదన్నారు.

టీఆర్‌ఎస్ పోరాటం తెలంగాణ అభివృద్ధి కోసమేనన్నారు. ఈ సభలో మంత్రులు ఈటెల రాజేందర్, తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, పీ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, సంజీవ్‌రావు, సుధీర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్లలోని కాంగ్రెస్ ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వికారాబాద్‌కు చెందిన వివిధ పార్టీల నేతలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.