Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఒక్క పిలుపుతో 100 అంబులెన్స్‌లు

-తెలంగాణకు కేటీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌
-కరోనా పరీక్షలు కూడా చేసేలా రూపకల్పన
‌ -తనవంతుగా ఆరు అంబులెన్స్‌లు ఇస్తానని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ప్రకటన
‌ -ఆ వెంటనే మేము సైతం అన్నపలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు‌
-గొప్ప నిర్ణయానికి శ్రీకారం
‌‌

ఒక్క పిలుపు.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఒక్క సందర్భం.. ఓ గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టేలా చేసింది. ఆ నిర్ణయమే.. లక్షలమంది ప్రాణాలకు అండ అయ్యింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు జన్మదినం ఓ ఆదర్శవంతమైన కార్యక్రమానికి నాంది పలికింది.

కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల శ్రేయస్సుకు తనవంతుగా ఆరు కరోనా టెస్టింగ్‌ అంబులెన్స్‌లను ప్రభుత్వ దవాఖానలకు ఇస్తానని కేటీఆర్‌ ప్రకటించారు. ఆ ప్రకటన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి దాదాపు వంద అంబులెన్స్‌లను సమకూర్చేందుకు సిద్ధమయ్యారు.

స్నాతకోత్సవ వస్త్రధారణలో..

శుక్రవారం హైదరాబాద్‌ బాలానగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ 8వ స్నాతకోత్సవానికి హాజరైన మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రగతిభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఈటలతో మాట్లాడిన కేటీఆర్‌.. కరోనా నేపథ్యంలో ప్రజలందరికీ ఉపయోగపడేలా ఆరు అంబులెన్స్‌లను తాను వ్యక్తిగతంగా ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. అంబులెన్స్‌లను కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చును తాను భరిస్తానని, పార్టీ తరఫున ఇవ్వాలనుకుంటున్నానని వెల్లడించారు. ప్రభుత్వ దవాఖానల్లో వాటిని ఉపయోగించుకోవాలని కోరారు.

ఈ అంబులెన్స్‌ల్లో అన్ని సౌకర్యాలుంటాయని, కరోనా టెస్టులు కూడా చేసే వీలుంటుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఉపయోగించుకోవాలని, అతిత్వరలోనే వీటిని అందజేస్తామని తెలిపారు. కేటీఆర్‌ను అభినందించిన ఈటల.. తాను కూడా తన నియోజకవర్గం, కరీనంగర్‌ జిల్లా పార్టీ తరఫున 5 అంబులెన్స్‌లను సమకూరుస్తానని చెప్పారు. ప్రభుత్వం అంబులెన్స్‌లను సమకూరుస్తున్నా.. వీటిని కరోనా టెస్టులు చేసేలా రూపొందిస్తే చాలా ఉపయోగం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మినీ దవాఖానలుగా ఇవి ఉపయోగపడేలా చూస్తామని వెల్లడించారు. ప్రతి అంబులెన్స్‌లో అత్యవసర మందులతోపాటు ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైన సిబ్బంది అంబులెన్స్‌ల్లో ఉండేలా చూస్తామని ఈటల పేర్కొన్నారు.

మేము సైతం అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు

మంత్రి కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ కూడా సూర్యాపేట, భువనగిరి యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో ఆరు అంబులెన్స్‌లను సమకూరుస్తామని చెప్పారు. నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, సైదిరెడ్డి, గ్యాదరి కిశోర్‌, భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్‌, బొల్లం మల్లయ్యయాదవ్‌, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, పార్టీ నేత వేమిరెడ్డి నర్సింహారెడ్డి, తదితరులతో కలిసి మంత్రి, కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అక్కడే ఉన్న రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా పార్టీ, నేతల తరఫున 11 అంబులెన్స్‌లను సమకూరుస్తామని ప్రకటించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్‌ తదితరులతో కలిసి తమ వరంగల్‌ జిల్లా తరఫున 6 అంబులెన్స్‌లను ఇస్తామని హామీఇచ్చారు.

పార్టీలోని మరింత మంది నాయకులు, దాతలతో చర్చించి ప్రతి నియోజకవర్గంలోని దవాఖానకు కనీసం ఒక కొత్త అంబులెన్స్‌ ఉండేలా చేస్తామన్నారు. మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా తాను 4 అంబులెన్స్‌లను ఇస్తానని చెప్పగా, ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మూడు సమకూర్చడానికి సిద్ధమని ప్రకటించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్‌, గణేశ్‌గుప్తాతో కలిసి 5 అంబులెన్స్‌లు ఇస్తామని అన్నారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మూడు అంబులెన్స్‌లను ఇవ్వటంతోపాటు వీటిని సకాలంలో తయారు చేయించే బాధ్యతలో కూడా పాలుపంచుకుంటానని చెప్పారు. ఎంపీ రంజీత్‌రెడ్డి తన వంతుగా ఏడు అంబులెన్స్‌లు ఇస్తానన్నారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పార్టీ పక్షనేత నామా నాగేశ్వరరావు ఆరు అంబులెన్స్‌లు, మంత్రి గంగుల కమలాకర్‌ ఆరు, నిరంజన్‌రెడ్డి మూడు, మంత్రి మల్లారెడ్డి ఆరు అంబులెన్స్‌లు సమకూరుస్తామని వెల్లడించారు. విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి కూడా తన వంతుగా రెండు అంబులెన్స్‌లు ఇస్తానని చెప్పారు.

ఇలా అక్కడున్న నేతలంతా తమతమ జిల్లాల్లోని దవాఖానలకు అవసరమయ్యే అంబులెన్స్‌లను అందజేస్తామని ప్రకటించారు. వీరితోపాటు కొంతమంది పార్టీ సానుభూతిపరులు కూడా అంబులెన్స్‌లు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వంద అంబులెన్స్‌లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధమైంది. వీలైనంత త్వరగానే వీటిని ఆయా జిల్లాల్లోన్ని దవాఖానలకు అందేలా చూడాలని నిర్ణయించారు. స్వచ్ఛందంగా అంబులెన్స్‌లు సమకూర్చడానికి ముందుకు వచ్చినవారికి మంత్రి కేటీఆర్‌ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇంత స్పందన వస్తుందని తాను ఊహించలేదని, తాజా నిర్ణయంతో కరోనా సమయంలో అంబులెన్స్‌ల కొరత లేకుండా ఉంటుందని పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.