-ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో రికార్డు -కాళేశ్వరం జలాలు వచ్చేలోగా -0.6 టీఎంసీల తరలింపునకు కసరత్తు -మెట్‌పల్లి వద్ద మోటర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

శ్రీరాంసాగర్‌కు పునర్జీవాన్ని కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పునర్జీవ పథకం రికార్డు నమోదుచేసింది. ఒకేరోజు మూడు మోటర్ల డ్రైరన్‌ను అధికారులు విజయవంతంగా పూర్తిచేసి రికార్డు నెలకొల్పారు. ఆదివారం మొదటి, రెండో పంపుహౌస్‌లోని మూడు మోటర్లను అధికారులు పరీక్షించగా.. నిర్ణీత సాంకేతిక ప్రమాణాల మేరకు అవి నడువడంతో ఇంజినీర్లలో సంతోషం వ్యక్తమైంది. గోదావరిలో వరద ఉధృతి పెరిగినప్పటి నుంచి మేడిగడ్డ మొదలు వరుస బరాజ్‌ల ద్వారా ఎల్లంపల్లి ఆపై మిడ్‌మానేరుకు గోదావరి జలాలను తరలించేందుకు అధికారులు అన్నిరకాలుగా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఎస్సారెస్పీ వరద కాలువలోకి జలాలు రాగానే.. అక్కడి నుంచి మిడ్‌మానేరుకు, పునర్జీవ పథకం ద్వారా శ్రీరాంసాగర్‌కు తరలించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట వద్ద నిర్మిస్తున్న పంప్‌హౌస్‌లో రెండు మోటర్ల ట్రయల్న్‌న్రు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రారంభించారు. జూలై 10 నాటికి నాలుగో మోటర్ బిగింపు, జూలై 15 నాటికి ఐదు మోటర్లను వినియోగంలోకి తేనున్నట్టు అధికారులు చెప్తున్నారు.
చకచకా డ్రైరన్ పనులు వరద కాలువ 73వ కి.మీ. వద్ద జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామ పరిధిలో కొత్త క్రాస్ రెగ్యులేటర్ నిర్మిస్తున్నారు. అక్కడే నిర్మిస్తున్న పంపుహౌస్‌లో 1450 క్యూసెక్కుల డిశ్చార్జి, 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉండే ఎనిమిది పంపులను ఏర్పాటుచేస్తున్నారు. తద్వారా 11,600 క్యూసెక్కుల నీటిని ఇక్కడ పంపింగ్ చేస్తారు. జగిత్యాల జిల్లా మెట్‌పలి మండలం రాజేశ్వర్‌రావుపేట గ్రామ పరిధిలో వరద కాలువ 34వ కిలోమీటర్ దగ్గర కూడా కొత్త క్రాస్ రెగ్యులేటర్, మొదటి దశ తరహాలోనే పంపుహౌస్ ఏర్పాటుచేస్తున్నారు. ఇక్కడ ఎనిమిది మోటర్లను ఏర్పాటుచేయాల్సి ఉండగా.. ఇప్పటికీ రెండు పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ గ్రామ పరిధిలోని వరద కాలువ 0.100 కిలోమీటర్ వద్ద ఎనిమిది పంపులతో పంపుహౌస్ నిర్మిస్తున్నారు. మొదటి రెండు దశల ద్వారా జలాల్ని ఎత్తిపోసినా శ్రీరాంసాగర్ జలాశయానికి జలాల్ని తరలించడంలో సాంకేతిక వెసులుబాటు ఉన్నందున.. అధికారులు మొదటి రెండు పంపుహౌస్‌లపై ప్రత్యేక దృష్టిసారించారు. జూలై నాటికి వరద కాలువ నుంచి శ్రీరాంసాగర్‌లోకి జలాల్ని ఎత్తిపోసేందుకు అధికారులు చకాచకా డ్రైరన్లను నిర్వహిస్తున్నారు.

ప్రతి ఎకరాకు సాగునీరివ్వడమే లక్ష్యం: ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యమనీ, అందులో భాగంగానే ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు చెప్పారు. రాజేశ్వర్‌రావుపేట పంపుహౌస్‌లో మోటర్ల డ్రైరన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమలో నీటిపారుదలశాఖ సలహాదారు కే పెంటారెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి, నవయుగ డైరెక్టర్ వెంకటరామారావు, ఎస్‌ఈ శ్రీకాంతారావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సంపత్‌రావు, ఈఈ సుధాకిరణ్, డీఈ రూప్లా, క్యూసీ ఈఈ రమేశ్, క్యూసీ డీఈఈ మధుసూదన్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఏడీఈ శ్రీనివాస్, రాంపూర్ పంప్‌హౌస్ ఇంచార్జి డీఈఈ రాంప్రదీప్, ఏఈఈ తిరుపతి, మధు, సైట్ ఇంచార్జి నారాయణ, మెట్‌పల్లి ఎంపీపీలు మారు సాయిరెడ్డి, జాజాల భీమేశ్వరి, మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి ఉమారాణి, కాటిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.