Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఎన్టీఆర్ పేరొద్దు

-డొమెస్టిక్ టెర్మినల్‌పై కేంద్రప్రభుత్వ నిర్ణయం విచారకరం
-యథాతథస్థితిని కొనసాగించాలి.. శాసనసభ, మండలి ఏకగ్రీవ తీర్మానం
-దిక్కు మొక్కు లేకుండా ఉన్నామా?
-తెలంగాణ చరిత్ర కనబడొద్దా?
-పీవీ, కొమురం భీం సహా అనేక మంది ప్రముఖులు మాకూ ఉన్నారు
-కలకలం సష్టించేందుకు రాయి వేశారు
-కమ్యూనిస్టులూ పత్రికల పేర్లు మార్చుకుంటున్నారు
-ఆంధ్ర పేర్లు తొలగించాలన్న ఆవేదన ప్రజల్లో ఉంది
-ఈ సమయంలో మళ్లీ ఆంధ్ర నాయకుల పేర్లా?
-అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన

CM KCR addressing in Assembly

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌ను వేరుచేసి, దానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు పేరు పెట్టడంపై రాష్ట్ర అసెంబ్లీ, మండలి అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విచారం వ్యక్తంచేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించాయి. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పేరును యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశాయి. శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మండలిలో మంత్రి హరీశ్‌రావు ఈ తీర్మానాలను ప్రవేశపెట్టారు.
అసెంబ్లీలో సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి అధికార టీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు.. సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, ఎంఐఎం మద్దతు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నాలుగు విమానాశ్రయాలకు ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఇక్కడ పేర్లు లేవా? మాకు దిక్కు మొక్కు లేకుండా ఉన్నామా? మా చరిత్ర కనబడొద్దా? మా పేర్లు వద్దా? అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రశాంతంగా స్వయం పాలన చేసుకుంటున్న తెలంగాణలో కలకలం సృష్టించేందుకు అనవసరంగా రాయి వేశారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అంతగా పేరు మార్చాల్సివస్తే కొమురం భీం మొదలుకుని పీవీ నర్సింహారావు వరకూ అనేక మంది తెలంగాణ బిడ్డలు ఉన్నారని చెప్పారు.

కమ్యూనిస్టులు నిర్వహించే పత్రికల పేర్లు కూడా తెలంగాణ పదంతో కొత్తగా వస్తున్న విషయాన్ని ప్రస్తావించిన సీఎం.. ఈ సమయంలో మళ్లీ ఆంధ్ర నాయకుల పేర్లు ఎందుకని ప్రశ్నించారు. అంతకుముందు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సభ్యులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై మాట్లాడేందుకు అవకాశం కావాలని స్పీకర్ మధుసూధనాచారిని అడిగారు. స్పీకర్ మాత్రం ప్రశ్నోత్తరాల తరువాతే అందరికీ అవకాశం ఇస్తానని చెప్పారు. అయినా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సభ్యులు మాత్రం దీనిపైనే చర్చించాలని పట్టుబట్టారు. ఈ సమయంలోనే స్పీకర్ కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డికి మైక్ ఇచ్చారు.

సీమాంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలంతా ఏకమై, ఉద్యమంచేసి రాష్ర్టాన్ని సాధించుకున్నారని, కానీ ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టడం అంటే ఆ ఆధిపత్యాన్ని
కొనసాగించడమేనని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా సభ తీర్మానం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జోక్యం చేసుకుంటూ.. ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌కు ఎన్టీరామారావు పేరు పెట్టడం అనేది సున్నిత అంశమని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ భాగంగా ఉన్నప్పుడు ఎన్నో సాంస్కతిక దాడులు జరిగాయని చెప్పారు. తెలంగాణ భాష పై కూడా దాడి జరిగిందనే బాధ ఉందని అన్నారు. ఇప్పుడు స్వయం పాలన చేసుకుంటున్న తెలంగాణలో పరిస్థితిని కల్లోలం చేసేందుకు రాయి విసిరారని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో సంస్థలకు ఉన్న ఆంధ్ర పేర్లను తొలగించాలనే ఆవేదన ప్రజల్లో ఉందని సీఎం అన్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ ఆంధ్రా నాయకుడి పేరు పెట్టడంపై అభ్యంతరం తెలిపారు.

ఇవాళ తెలంగాణ అనేది ఒక రియాలిటీ. సహజంగా కమ్యునిస్టు పార్టీలు పిడివాదంతో ఉంటాయి. ఇటీవల విశాలాంధ్ర పత్రిక పేరు మార్చుకుంటున్నామని, మన తెలంగాణ అని పేరు పెడుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ శాసనసభాపక్ష నేత రవీంద్రకుమార్, ఆ పత్రిక ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి నన్ను వచ్చి కలిశారు. ప్రజల ఉద్వేగాన్ని బట్టి పత్రిక పేరు మారుస్తున్నామని వారు తెలిపారు. పిడివాదంతో ఉండే వారే ప్రజల ఉద్వేగాన్ని బట్టి మార్చుకుంటున్నారు అని అన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న ఆంధ్ర పేర్లు మార్చాలనే ఆరాటం కూడా ప్రజల్లో ఉంది. కానీ తొందరపాటు వద్దనుకున్నాం అని సీఎం తెలిపారు. ఎయిర్‌పోర్టుకు రాజీవ్‌గాంధీ పేరు ఉంది.

ఆయన శాంతి సైన్యాన్ని శ్రీలంకు పంపితే అక్కడి తీవ్రవాదులు దారుణంగా, పాశవికంగా హత్య చేశారు. అప్పుడు సభకూడా తీర్మానం చేసింది. కానీ ఇప్పుడు డొమెస్టిక్‌కే పేరు అంటున్నారు. ఇక్కడో రాష్ట్రం ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మాకు మేధావులు, ప్రముఖులు లేరా? మా దళిత యోధుడు భాగ్యరెడ్డివర్మ, గిరిజన వీరుడు కొమురం భీం, సాయుధ పోరాట యోధులు బద్దం ఎల్లారెడ్డి, రావినారాయణరెడ్డి, షేక్‌బందగీ ఉన్నారు.

దక్షిణభారత దేశం నుండి ఇద్దరే ప్రధాన మంత్రులు అయ్యారు. ఒకరు కర్ణాటకకు చెందిన దేవెగౌడ, మరొకరు తెలంగాణ నుంచి పీవీ నర్సింహారావు ఉన్నారు. అయినా మాపై ఇంకా ఆంధ్రపేర్లు రుద్దడం ఎందుకు? దీనిపై చాలా మంది ఫోన్లుచేసి ఆవేదన వ్యక్తంచేశారు. ఆందోళన వద్దు. అసెంబ్లీలో చర్చిస్తాం అని చెప్పిన. స్పీకర్ సభను ఐదు నిమిషాల పాటు వాయిదా వేస్తే అన్ని పార్టీలం కలిసి కూర్చోని చర్చిద్దాం అన్నారు. అయితే ఆ తరువాత నెలకొన్న గందరగోళంతో సభను స్పీకర్ మధుసూధనాచారి 10నిమిషాలపాటు వాయిదావేశారు.

సభ తిరిగి సమావేశమైన తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం విచారకరమని, పేరు మార్చాలన్న ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయం తీసుకోలేదని పేర్కొన్నారు. తమ అభిప్రాయాన్ని తీసుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై సభలో చర్చ జరుగడం లేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కూడా పక్క రాష్ట్రం వారి పేరు పెట్టడంపైనే చర్చ జరుగుతున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్టీఆర్‌ను అగౌరపరచాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఉన్న పేర్లనే తొలగించుకుని తెలంగాణ పేరిట పేర్లు ఏర్పాటు చేసుకుంటున్నారన్న సీఎం.. సీపీఐ ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రికకు మన తెలంగాణ అని పేరు పెట్టుకుంటున్నారని చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ఏర్పాటుచేసిన ప్రజాశక్తి పత్రిక పేరు నవ తెలంగాణగా మారుతున్నదని సీపీఎం ఎమ్మెల్యే చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి కొత్త ఒరవడి కొనసాగుతుందని సీఎం అన్నారు. కానీ.. దీనికి వ్యతిరేకంగా కేంద్రం విమానాశ్రయం పేరు మార్చిందని అన్నారు. అవసరమనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నాలుగు విమానాశ్రయాలకు ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు.

ఇక్కడ పేర్లు లేవా? మాకు దిక్కు మొక్కు లేకుండా ఉన్నామా? మా చరిత్ర కనబడొద్దా? మా పేర్లు వద్దా? అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేంద్రం నుంచి పేరు మార్చుతూ పూర్తిస్థాయి ఆదేశాలు అందాయని చెప్పారు. ఘర్షణ వాతావరణం సష్టించవద్దని కేంద్రాన్ని కోరారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సీఎం సభలో చూపించారు. టీడీపీ సభ్యులు దీనిపై వివాదం చేసేందుకు ప్రయత్నించడాన్ని తప్పుపట్టిన సీఎం.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి మాత్రమే చేశామని, దీనిని వివాదం చేయవద్దని అన్నారు.

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానంపై పార్టీల అభిప్రాయాలను స్పీకర్ కోరగా బీజేపీ, టీడీపీ మినహా అన్ని పార్టీలు తీర్మానాన్ని బలపరిచాయి. దీంతో తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. ఏకగ్రీవం అన్న పదాన్ని తాము ఆమోదించబోమని టీడీపీ, బీజేపీలు స్పీకర్‌కు నిరసన తెలిపాయి. ఇదే సమయంలో స్పీకర్ సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. తీర్మానం చేయడానికి ముందు కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర అధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలంతా ఏకమై, ఉద్యమం చేసి, రాష్ర్టాన్ని సాధించుకున్నారని చెప్పారు.

ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టడం అంటే ఆ ఆధిపత్యాన్ని కొనసాగించడమేనని మండిపడ్డారు. రెండు రన్‌వేలు ఉన్నప్పుడు మరో పేరు పెట్టుకోవచ్చునని, కానీ రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు ఒకే రన్‌వే ఉందని తెలిపారు. ఎన్టీరామారావు సీమాంధ్ర నాయకుడిగానే మిగిలిపోయారని అన్నారు. ఎన్టీరామారావు పేరు పెట్టొద్దని సభ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని కోరారు. పేరు పెట్టడానికి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించి తరువాత అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్దామని అన్నారు. సీమాంధ్ర ఆధిపత్య ధోరణిని తుంచి వేయాల్సిన అవసరం ఉందని, ముఖ్యమంత్రి చేపట్టే చర్యలుకు శాసనసభ అండగా ఉంటుందని అన్నారు.

ఇదీ తీర్మానం..
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్భాగంగా ఉన్న డొమెస్టిక్ విమానాశ్రయాన్ని వేరుచేస్తూ ఎన్టీ రామారావు పేరు పెట్టడంపట్ల తెలంగాణ శాసనసభ విచారం వ్యక్తపరుస్తున్నది. కేంద్రం ముందు ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో కనీసం సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడంపట్ల ఈ శాసనసభ అభ్యంతరం వ్యక్తపరుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని, యథాతథ స్థితిని కొనసాగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానిస్తున్నది.

పేరు మార్పుపై దద్దరిల్లిన మండలి
డొమెస్టిక్ టెర్మినల్‌కు విడిగా ఎన్టీ రామారావు పేరు పెట్టడంపై మండలి దద్దరిల్లింది. అసెంబ్లీ బాటలోనే మండలి కూడా ఒక తీర్మానాన్ని ఏకగీవ్రంగా ఆమోదించింది. దీనికి ముందు ఉదయం పది గంటలకు సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సభ్యులు తీవ్ర నిరసన ప్రకటిస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, రంగారెడ్డి పోడియంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. కొంపల్లి యాదవరెడ్డి, పాతూరి సుధాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, పూల రవీందర్ తమ స్థానాల్లో నిలబడి కేంద్రం నిర్ణయంపై అభ్యంతరం తెలిపారు.

సభ్యులు తమ స్థానాల్లో కూర్చొనాలని చైర్మన్ స్వామిగౌడ్ పదే పదే విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత ఈ అంశాన్ని తీసుకుందామని నచ్చజెప్పారు. రాజీవ్‌గాంధీ జాతీయ నాయకుడని, దేశం కోసం ఆయన ప్రాణాలను అర్పించారని పోడియం వద్ద ఉన్న పొంగులేటి అన్నారు. ఆయన పేరును యథాతథంగా కొనసాగించాలని అన్నారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఏడు నిమిషాల్లోనే సభ వాయిదా పడింది. అనంతరం ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం లేకుండా కేంద్రం నిర్ణయం చేస్తున్నదని మండలి అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా.. ఏకపక్షంగా ఎన్టీఆర్ పేరు పెట్టిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని యథాతథ స్థితిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ.. మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగీవ్రంగా ఆమోదించింది. హరీశ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రతిపక్ష నేత డీ శ్రీనివాస్ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. టీడీపీ సభ్యులు మాత్రం అభ్యంతరం తెలుపుతూ వాకౌట్ చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.