Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నిర్వాసిత గిరిజనులకు భారీ ప్యాకేజీ

-తండాలను గ్రామ పంచాయతీలుగా మార్పుపై చర్చ -మార్గదర్శకాల ఖరారుకు మరోసారి సమావేశం -ఏజెన్సీలో అక్షరాస్యత పెరగడం లేదు -ఎస్టీ పారిశ్రామికులు ఢిక్కీ తరహా సంస్థ పెట్టుకోవాలి -గిరిజన సలహా మండలి మొదటి సమావేశంలో కేసీఆర్ -లక్ష నష్టపోతే నాలుగు లక్షల పరిహారం: సీఎం -ప్రాణహిత-చేవెళ్లకు గిరిజన సలహా మండలి ఆమోదం

KCR Review meet with TRIBAL MLA's

రాష్ట్రంలో ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యే గిరిజనులకు ఏ రాష్ట్రంలో ఇవ్వనంత భారీ ప్యాకేజీ ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే గిరిజనులకు ఈ ప్యాకేజీ కింద ఎకరం లక్ష రూపాయలు చేసే భూమికి నాలుగు లక్షల పరిహారం అందుతుందని చెప్పారు. ఇండ్ల వంటి ఇతర స్థిరాస్తులను లెక్కించే క్రమంలో కూడా నిబంధనలు సవరించి గిరిజనులకు ఎక్కువ న్యాయం చేస్తామన్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న ప్యాకేజీతో పోలిస్తే తామిచ్చేది చాలా ఎక్కువ అని కేసీఆర్ వివరించారు.

 

శనివారం సచివాలయంలో జరిగిన గిరిజన సలహామండలి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. వివిధ పార్టీలకు చెందిన గిరిజన ఎమ్మెల్యేలతో పాటు మంత్రి హరీశ్‌రావు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల నిర్వాసిత గిరిజనుల సమస్య, గిరిజన, ఆదివాసీ తండాలు, గూడేలు గ్రామపంచాయతీలుగా మార్పు తదితర అంశాలమీద ప్రధానంగా చర్చ జరిగింది.

ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టుకు ఆమోదం సమావేశంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 7 రిజర్వాయర్లు ఉంటాయని, 9 గ్రామాలు ముంపునకు గురవుతాయని, 789 గిరిజన కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయని వివరించారు. ఇందులో 93 కుటుంబాలు పూర్తిగా, 696 కుటుంబాలు పాక్షికంగా నిర్వాసితులు అవుతాయని వెల్లడించారు.

పరిహారం తదితర అంశాలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ విశ్లేషించారు. ఉన్న భూమినంతా కోల్పోయిన గిరిజనులను బాధితులుగా పరిగణించాలని అధికారులకు నిర్దేశించారు. ప్రాజెక్టు కింద ఎవరెవరు భూములు కోల్పోతున్నారో వారి వివరాలను ముందుగానే నోటిఫై చేసి గిరిజన ఎమ్మెల్యేలకు ఆ వివరాలు అందించాలని ఆదేశించారు. అనంతరం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు గిరిజన సలహా మండలి ఆమోదముద్ర వేసింది. తర్వాత గిరిజన తండాలు, ఆదివాసి గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చే విషయంపై చర్చించారు.

తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను పంచాయతీలుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు మాత్రమే ఖరారు కావాల్సి ఉందని, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సూచనలు అందించాలని కోరారు. గ్రామపంచాయతీకి మూడు కిలోమీటర్ల అవతల తండాలు ఉంటే వాటన్నింటినీ కలుపుతూ ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు సూచించారు. 500 జనాభాకు ఒక గ్రామ పంచాయతీ అనే నిబంధన కాకుండా మూడు,నాలుగు తండాలను కలిపి ఒక పంచాయతీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఈ విషయాలను మరింత లోతుగా అధ్యయనం చేసి, విధివిధానాలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు మరోసారి గిరిజన ప్రజాప్రతినిధులతో సమావేశం జరుపుకుందామని చెప్పారు. ఆ సమావేశంలోనే విధివిధానాలకు తుదిరూపు ఇచ్చి ఖరారు చేద్దామని వారికి హామీ ఇచ్చారు. ఎస్టీలకు పునరావాస ప్యాకేజీ విషయంలో కూడా మరిన్ని సలహాలు, సూచనలు చేయాలని కోరారు.

ఏజెన్సీలో అక్షరాస్యతపై సీఎం అసంతృప్తి.. గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏలు, విద్యాలయాలు ఉన్నా అక్షరాస్యతలో పురోగతి కనిపించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.అక్షరాస్యత ఎందుకు పెరగడం లేదు..? ఎన్ని విద్యాలయాలు ఉన్నాయి..? మొత్తం ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయనే వాటిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. ఎస్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల పరిస్థితిపై కూడా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకోవడానికి గిరిజన పారిశ్రామిక వేత్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఢిక్కీ తరహాలో ఎస్టీ పారిశ్రామిక వేత్తలు కూడా ట్రైబల్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగర్‌రావు, రామ్‌లక్ష్మణ్, ఎంపీలు కే కేశవరావు, సీతారాంనాయక్, నగేష్, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ , కోవ లక్ష్మి, రాథోడ్ బాబూరావు, బానోత్ శంకర్, అజ్మీరా చందులాల్, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, బానోతు మదన్‌లాల్, సున్నం రాజయ్య, రవీంద్రకుమార్, రెడ్యానాయక్, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ రాములునాయక్, ప్రిన్సిపల్ సెక్రెటరీలు ఎస్‌కే జోషి, టీ రాధా, ఐఎఎస్‌లు సోమేష్‌కుమార్, శ్రీదేవి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు హాజరయ్యారు.

సీఎంకు ఎమ్మెల్యేల కృతజ్ఞతలు గిరిజనులకు పరిహార ప్యాకేజీని భారీగా పెంచినందుకు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చే నిర్ణయం తీసుకున్నందుకు పార్టీలకు అతీతంగా గిరిజన ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గిరిజనుల సంక్షేమానికి మంచి నిర్ణయాలు తీసుకున్నారని అభినందించారు. ఎమ్మెల్యేలు సీఎం వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలియచేశారు. గిరిజన తండాలు, ఆదివాసీగూడెలకు రోడ్ల సౌకర్యం కల్పించేందుకు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకోవాలని వారు సూచించగా సీఎం సానుకూలంగా స్పందించారు.

ఏజెన్సీ డీఎస్సీ ద్వారా ఖాళీల భర్తీ .. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఏజెన్సీ డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థుల మెస్‌ఛార్జీలు, కాస్మొటిక్ చార్జీలు సకాలంలో విడుదల చేయాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న గిరిజనులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరారు. పోడు వ్యవసాయం చేస్తున్న వారిపై దాడులకు బదులు వారికి ఒక్కొక్కరికి 10ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం వేగంగా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు.

15రోజుల్లో మరోసారి సమావేశం పెట్టుకుని మరింత కూలంకుషంగా చర్చిద్దామన్నారని తెలిపారు. దేవరకొండలో గిరిజన ఆడపిల్లలను అమ్ముకుంటున్నారని దాన్ని అరికట్టేందుకు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి లంబాడీలను ఆదుకోవాలని సీఎంను కోరినట్టు సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ చెప్పారు. నక్కల గండి నుండి డిండి ప్రాజెక్టు వరకు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయాలని కూడా కోరానని తెలిపారు.

ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న వారిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, నష్టపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం రెండురెట్లు అదనంగా పరిహారం చెల్లించాలని జీవో ఇస్తే, సీఎం కేసీఆర్ మూడురెట్లు అదనంగా పరిహారం ఇవ్వడానికి సంసిద్ధత ప్రకటించారని హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో పోలవరం నిర్వాసిత గిరిజనులకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న ప్యాకేజీనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడానికి, డాక్టర్ల నియామకానికి సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం తెలిపారని అన్నారు.

500 జనాభాతో గిరిజన పంచాయతీ మార్గదర్శకాలపై కసరత్తు తండాలు, గూడేలను, చెంచుపెంటలను గ్రామ పంచాయతీలుగా మార్చే ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అధికారులు ఆచరణ దిశగా సాగుతున్నారు. ఎలాంటి పద్ధతుల్లో గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చలు సాగుతున్నాయి. 500 జనాభా కలిగిన గిరిజన గ్రామాలను గ్రామ పంచాయతీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో ఉండే సాదకబాధకాలతో పాటు ఆచరణ పై అధికారులు చర్చిస్తున్నారు. సహజంగా తండాలు, గూడేల్లో 100 నుండి 200 జనాభా ఉన్నవే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మూడు నుంచి ఐదు తండాలుగానీ, గూడేలను కలపాలనే ప్రతిపాదన ఉంది. ఒక గ్రామ పంచాయతీకి కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో 500కంటే ఎక్కువ జనాభా ఉన్న తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చే అంశంపై చర్చిస్తున్నారు.

ఏదైనా ఒక గ్రామంలో వెయ్యికిపైగా జనాభా ఉండి ఆ గ్రామంలో 100మంది గిరిజన జనాభా ఉంటే వారిని అక్కడే కొనసాగించాలని, అదే సమయంలో గిరిజన గ్రామాల్లో గిరిజనేతరులు ఎవరైనా ఉంటే వారు అదే తండాల్లో కొనసాగించాలని ప్రతిపాదనలు అందాయి. శనివారం ముఖ్యమంత్రి వద్ద జరిగిన గిరిజన సలహా మండలి సమావేశం అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాధా, కమిషనర్ మహేష్ ఎక్కాతో సచివాలయంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చించారు.

గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసే క్రమంలో తండాలు, గూడేలను కలిపే సమయంలో ప్రజా ప్రతినిధులతో చర్చించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గ్రామ పంచాయతీల ఏర్పాటుపై సర్వే జరిగిన తరువాత జిల్లా స్థాయిల్లో కలెక్టర్ల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి తుది మార్గదర్శకాలు రూపొందించాలని అన్నారు.

ఏజెన్సీల్లో అర్హులు లేకుంటే నాన్‌ఏజెన్సీవారితో ఖాళీల భర్తీ..! ఏజెన్సీ ఏరియాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నింపే క్రమంలో ఉన్న నిబంధనలను సడలించాలని ఎమ్మెల్యేలు కోరినట్లు సమాచారం. పూర్తిగా ఏజెన్సీ వారితోనే ఖాళీలు భర్తీ చేయాలంటే సాధ్యం కావడం లేదని, నాన్ ఏజెన్సీలో అర్హులైన వారు ఉంటారని, వారితో ఖాళీలను నింపితే ఏజెన్సీ ఏరియాల్లో ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని సూచించారు.

జీవో 3 రాకముందే ఏజెన్సీ ఏరియాల్లో నాన్‌ఏజెన్సీవారితో కూడా ఖాళీలు నింపేవారని తెలిపారు. దీనిపై సీఎం మరోసారి సమావేశమయ్యే సందర్భంలో దీనిపై చర్చిద్దామని అన్నట్లు తెలిసింది. కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం వారికి సూచించారు. తెలంగాణ గిరిజన సలహా మండలి ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సలహా మండలి బిల్లును ప్రవేశపెడతామని సీఎం చెప్పినట్లు సమాచారం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.