
-దేశాన్ని మలుపుతిప్పే ఎన్నికలు ఇవి ఐదేండ్లలో మోదీతో ఒరిగిందేంలేదు -16 మందిని ఢిల్లీకి పంపిస్తే.. గల్లా పట్టుకుని అడుగుతం -మనకు కావాల్సినవన్నీ నడుచుకుంటూ వస్తాయి: కేటీఆర్ -పేదలను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్‌కు సాటిలేరు -కొడంగల్‌లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో చెల్లుతదా? -లాల్‌బజార్ సభలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -టీఆర్‌ఎస్‌లో చేరిన కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ, పలువురు నేతలు
ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశరాజకీయాలను మలుపుతిప్పే ఎన్నికలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్రంలో ఏ పార్టీకీ సొంతంగా మెజార్టీ రాదని, ఢిల్లీలోని ఎర్రకోట మీద ఎవరుండాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందని స్పష్టంచేశారు. పార్లమెంట్ ఎన్నికలంటే మోదీ వర్సెస్ రాహుల్ అని, సీఎం కేసీఆర్‌కు ఏం సంబంధమని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ఐదేండ్లలో ప్రధాని మోదీతో తెలంగాణకు, దేశానికీ ఒరిగిందేమీలేదని విమర్శించారు. శనివారం మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధి కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని లాల్‌బజార్ మహంకాళి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. నాకు తమిళం రాదు.. తెలుగు మాత్రమే వచ్చు అంటూ తమిళంలో ప్రసంగం ప్రారంభించిన కేటీఆర్.. ఆ తర్వాత తెలుగులో కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా గులాబీ జెండాను ఎగురవేశారని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఎన్నికలు అయిపోయాయని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు ఏం సంబంధమని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌గాంధీకి, బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి మాత్రమే లాభమని.. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే కంటోన్మెంట్ గడ్డకు లాభం జరుగుతదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎర్రకోట మీద ఎవరుండాలో తెలంగాణ గల్లీ ప్రజలు నిర్ణయించేలా ఓటర్లు టీఆర్‌ఎస్‌ను ఆదరించాలని కోరారు.
సీఎం కేసీఆర్‌ను మించినోళ్లు లేరు యావత్ దేశం సీఎం కేసీఆర్‌ను అనుసరిస్తున్నదని, పేదలకు మంచి చేయడంలో ఆయనను మించిన నాయకుడు దొరకడని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుబంధును ప్రధాని మోదీ, ఎపీ సీఎం చంద్రబాబు కాపీ కొట్టారని గుర్తుచేశారు. లాల్‌బజార్‌కు వస్తుంటే ప్యాట్నీ సిగ్నల్‌కాడ ఒక అమ్మ కనిపించిందని.. నా కోడలు మంచిగ చూసుకుంటున్నది. ఇదంతా నా పెద్ద కొడుకు కేసీఆర్ వల్లనే అని సభలో చెప్పుబిడ్డా అని అన్నదని చెప్పారు. పెంచిన ఆసరా పింఛన్లను మే నెల నుంచి ఇవ్వబోతున్నామని, అర్హత వయసును 57 ఏండ్లకు కుదించామన్నారు. గతంలో ఏ ప్రభుత్వమైనా ఒంటరి మహిళకు రూ.వెయ్యి పింఛన్ ఇచ్చి ఆదుకున్నదా? అని ఆలోచించాలని కోరారు. పెండ్లి నేనే చేస్తా.. డబుల్‌బెడ్ రూం ఇల్లు కట్టిస్తా.. అని అంటున్న సీఎం కేసీఆర్‌కు ఓటేయాలని విజ్ఞప్తిచేశారు.

కేంద్రం దుర్మార్గంగా వ్యవహరించింది కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినా మోదీ సర్కారు సహకరించలేదని కేటీఆర్ మండిపడ్డారు. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రూ.2,500 కోట్లు కేటాయించామని, స్కైవే నిర్మించేందుకు స్థలం ఇవ్వాలని రక్షణశాఖ మంత్రి దగ్గరికి పదిసార్లు పోయినా పట్టించుకోలేదన్నారు. 100 ఎకరాలిస్తే బదులుగా శామీర్‌పేటలో 500 ఎకరాలు ఇస్తామన్నా.. గోడతోని మాట్లాడినట్టు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బడితె ఎవరి దగ్గర ఉంటే.. బర్రెను వారే మళ్లించుకుపోయినట్టుగా కేంద్రంలో పరిస్థితి ఉన్నదన్నారు. 16 మంది గులాబీ సైనికులను ఢిల్లీకి పంపిస్తే గల్లాపట్టి అడుగుతారన్నారు.
పట్టాలిప్పిచ్చే బాధ్యత నాదే మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిని గెలిపిస్తే రక్షణశాఖ భూముల్లో ఇండ్లు కట్టుకున్నవారికి పట్టాలిప్పించే బాధ్యత తానే తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. లాల్‌బజార్‌లో తాగునీటి కష్టాలను దూరం చేశామని, సీఎం కేసీఆర్ ఒకే సంతకంతో రూ.24 కోట్ల నీటి బకాయిలను రద్దుచేశారని గుర్తుచేశారు. త్వరలోనే నీటి బిల్లులను జీహెచ్‌ఎంసీ తరహాలో సవరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని ఐదారు చెరువులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ కేంద్రం పరిధిలోదే అయినా.. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న విన్నపం మేరకు రూ.5 భోజన కేంద్రాలు ఐదు ఏర్పాటు చేశామన్నారు.

కొడంగల్‌లో చింపి అవతల పారేశారు మల్కాజిగిరిలో కాంగ్రెస్ తరఫున నిలబడుతున్న వ్యక్తి రెండునెలల కిందట కొడంగల్‌లో పదిపదిహేను వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడని కేటీఆర్ గుర్తుచేశారు. కోడంగల్‌లో చెల్లని రూపాయి.. మల్కాజిగిరిల చెల్లుతదా.? చెల్లని నోటని అక్కడివాళ్లు చింపి అవతలపారేస్తే.. మీరు నెత్తినమీద పెట్టకుంటరా? అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఊదితే కొట్టుకుపోయినాయనను మనం ఎందుకు ఆదరించాలో ఓటర్లు ఆలోచించాలని కోరారు. కంటోన్మెంట్ 7వ వార్డు సభ్యులు ప్యారసాని భాగ్యశ్రీ, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ప్యారసాని గౌరీశంకర్, మాజీ సభ్యుడు శ్యాంకుమార్, రాంకుమార్ ఈ సందర్భంగా కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మల్కాగిజిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కంన్మెటోన్మెంట్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ, సభ్యులు అనితాప్రభాకర్, మహేశ్వర్‌రెడ్డి, సదాకేశవరెడ్డి, పాండుయాదవ్, మన్నె క్రిశాంక్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌గాంధీకి లాభం. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభం. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం. రాబోయే ఎన్నికల్లో ఎర్రకోట మీద ఎవరుండాలో తెలంగాణ గల్లీ ప్రజలు నిర్ణయించేలా ఓటర్లు టీఆర్‌ఎస్‌ను ఆదరించాలి. – కేటీఆర్