Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నీరే ప్రాణము జగతికి

నీటి విలువను డబ్బుతో లెక్కకట్టలేము. నీరే సమస్తం. నీరు లేకుండా ఏ పరిశ్రమ పనిచేయదు. తొలకరి జల్లుల స్పర్శకే పుడమి తల్లి పులకరిస్తూ మట్టి పరిమళాలను వెదజల్లుతుంది. తడి తగలని మట్టి జీవాన్ని కోల్పోయి నిస్సారంగా మారుతుంది. నీటి పదను అంటీ అంటగానే విత్తనం భూమి పొరలను చీల్చుకుని మొక్కగా మారుతుంది, వేల విత్తనాలకు పురుడు పోస్తుంది. ఐక్యరాజ్యసమితి ఇటీవల ప్రపంచ జల దినోత్సవానికి (మార్చి 22) నీటి విలువ (వ్యాల్యూయింగ్‌ వాటర్‌)ను ప్రచారాంశంగా ఎంచుకున్నది.

జలం అంటే సంస్కృతంలో జీవనం. పంచభూతాల్లో (ఆకాశం, వాయువు, భూమి, అగ్ని, నీరు) ఒకటి. సమస్త ప్రాణులు మొక్కలు నీటి వల్లనే జనిస్తాయి, జీవిస్తాయి. మనిషి పుట్టుక నుంచి చావుదాకా నీటితోనే గమనం. తినే తిండి, తాగే నీరు, పీల్చేగాలి అన్నీ నీటి రూపాలే. మొక్కలు కార్బన్‌ డై ఆక్సయిడ్‌ను, విష వాయువులను పీల్చుకొని నీటితో శుద్ధి చేసి ఆక్సిజన్‌ను మానవాళికి అందిస్తాయి. భూగర్భంలోని ప్రతి ఖనిజం, ప్రతి రసాయనం , ప్రతి మూలకం జల సంబంధమే. భూమి తాపాన్ని చల్లార్చేది నీరే. జ్వలించే లావా (అగ్ని పర్వతాలు)ను చల్లార్చేదీ నీరే. ఆరు ఖండాలను సముద్రాలతో ఆవరించి సూర్యతాపాన్ని భూమిపై సమతుల్యంగా (బ్యాలెన్స్‌) ఉండేలా చూసేదీ, సకల జీవుల మనుగడకు ఆధారం నీరే. ప్రాణకోటిని ప్రకృతితో అనుసంధానం చేసేదీ నీరే. మండుటెండలో దప్పికతో సొమ్మసిల్లిన మనిషి పెదాలను, నాలికను, గొంతును తడిపి ఆ ప్రాణాన్ని నిలబెట్టిన నీటికి వెలకట్టగలమా?

చేలను తడిపే నీటి జాడ కోసం తపించి తపించి వందల అడుగుల లోతుకు బోర్లు వేసి వేసి ఆ అప్పులతో బలవన్మరణాలకు పాల్పడిన వేలకొద్ది రైతుల భార్యాబిడ్డలకు తెలుసు నీటి విలువ ఎంతో? పసిడి పంటలు పండే భూములున్నా నీటి కోసం గోసపడి దుబాయికి, బొంబాయికి వలసబోయి అష్టకష్టాలు పడుతూ నగరాల్లో జీవచ్ఛవాలుగా ఉంటూ, కల్వకుర్తి, కాళేశ్వరం నీళ్ళు తమ భూములను ముద్దాడుతున్నాయని, శిశిరంలో సైతం జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయని తెలుసుకొని తిరుగు ప్రయాణమైన పాలమూరు, మెతుకుసీమ వలసజీవుల కళ్ళల్లోని ఆనంద బాష్పాలకు వెలకట్టగలమా? దోసెడు నీళ్ళ కోసం కోసెడు దూరం నెత్తిపైన కుండలను పెట్టుకొని నడిచిన తెలంగాణ అక్క చెల్లెళ్ళ అడుగు జాడలను వెదుక్కుంటూ తమ గడప ముందుకు వచ్చిన ‘మిషన్‌ భగీరథ’ పైపుల నల్లాల్లోంచి ఒలుకుతున్న స్వచ్ఛమైన తాగునీటి సవ్వడుల వెనుక దాగిన కేసీఆర్‌ విజన్‌కు వెలకట్టగలమా? నీరు పల్లమెరుగు… సామెతను తలకిందులు చేస్తూ బాహుబలి పంపులతో ఐదువందల మీటర్ల ఎత్తుకు ప్రాణహిత జలాలను ఎదురెక్కిస్తున్న భగీరథ ప్రయత్నానికి ధర నిర్ణయించగలమా?

మూడేండ్ల కిందట నేను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌ దేశంలో జరిగిన 8వ ప్రపంచ జల సదస్సుకు హాజరైనప్పుడు తెలిసింది సమస్త దేశాల్లో, నాలుగు వందల కోట్ల జనం తాగునీటి కోసం, సాగునీటి కోసం ఎంత గోసపడుతున్నారోనని! నదుల నీటి కోసం దేశాల మధ్య యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అర్థమైంది. ప్రపంచంలోని 150 దేశాలు మరో దేశంతో నదుల నీటిని పంచుకుంటూ పరస్పరం ఘర్షణలకు దిగుతున్న దుస్థితి గమనిస్తే పొరుగు రాష్ట్రాలతో చర్చల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకుంటున్న కేసీఆర్‌ రాజనీతిజ్ఞత ఎంత గొప్పదో తెలిసింది. మరో వందేండ్ల దాకానైనా తెలంగాణకు నీటి గోస రాకుండా, దారి పొడవునా జలాశయాలను నిర్మిస్తూ ‘తెలంగాణ బిడ్డను నేన’ని మనమంతా గర్వపడేలా ప్రపంచ పటంలో తెలంగాణ కీర్తిని సుస్థిరం చేసిన సందర్భం.

నీటి విలువను తెలుసుకోవాలని ఐరాస ప్రపంచ ప్రజలను కోరడానికి బలమైన కారణం ఉంది. ప్రకృతి సహజంగా అన్ని దేశాలకు మంచినీటి వనరులు సమాన నిష్పత్తిలో లేవు. ప్రపంచ జనాభాలో 17 శాతం ఉన్న భారతదేశానికి విశ్వ జలాల్లో వాటా కేవలం నాలుగు శాతమే. రెండున్నర శాతం జనం ఉన్న బ్రెజిల్‌ దేశానికి లభించిన జల వాటా 19 శాతం. భూమిపై ఉన్న వందశాతం నీటిలో సముద్రాల్లో ఉన్న ఉప్పు నీరు 97 శాతం. మిగిలిన 3 శాతం మంచినీటిలో ప్రపంచ జనాభాకు, సమస్త ప్రాణులకు, వృక్ష జాతులకు వినియోగానికి అందుబాటులో ఉన్నది కేవలం 0.3 శాతం మాత్రమే! ఈ నీరే ప్రపంచంలోని నదులు, జలాశయాల్లో భూగర్భంలో అందుబాటులో ఉన్నది. దీనిలో 0.2 శాతం వ్యవసాయ అవసరాలకు పోగా 780 కోట్ల మందికి, ఇతర ప్రాణులకు లభించేది 0.1 శాతమే. 1921లో 200 కోట్లున్న ప్రపంచ జనాభా 2021 నాటికి 780 కోట్లు దాటింది. కోట్ల ఏండ్లుగా నీటి పరిమాణంలో ఏ మార్పూ లేదు. నీరు వివిధ రూపాలను సంతరించుకుంటుందే తప్ప ఏ నాడూ నశించదు, సృజించబడదు. జలానికి జనన మరణాలుండవు. భూదేవి ఒడిలో, సూర్య కిరణాల పరిష్వంగంలో కాలుష్య కంపును దులిపేసుకొని ఆవిరై మేఘాల తేరుపై కదిలి స్వచ్ఛమై నేలను ముద్దాడుతుంది నీరు.

నీటిని వాణిజ్య వస్తువుగా మార్చుతూ ఇతరులకు చెందనివ్వకుండా, స్వార్థబుద్ధితో, లాభార్జనకు జల వనరులను బంధిస్తున్న మనుషులకు తనలాగే కుళ్ళును, కంపును కడుక్కొని పవిత్రులు కావాలని సందేశాన్నిస్తుంది నీరు. హిమగిరులలో జాలువారినప్పటి స్వచ్ఛతే బంగాళాఖాతంలో కలిసేదాకా తనకుండాలని కోరుకుంటున్నది నీరు. నీరు నాగరికతలను నిర్మిస్తుంది. ఆగ్రహిస్తే నాగరికతలను ధ్వంసం చేస్తుంది. నీరు పరిష్కారమే తప్ప సమస్య కారాదు. జల వివాదాలను సృష్టించేది మనుషులే తప్ప ప్రకృతి కాదు. ఐరాస స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో ఆరవ లక్ష్యం- ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత 2030 నాటికి అందించాలనేది. ఈ లక్ష్య సాధన కోసం పునరంకితమవుదాం. జల సంరక్షణే… మన సంరక్షణ! (వ్యాసకర్త: చైర్మన్‌, రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ)
వి. ప్రకాశ్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.