మల్లన్న సాగర్ వివాదాన్ని మూడు ముక్కల్లో చెప్పాలంటే.. 1).17 గ్రామాలు, 13,966 ఎకరాలు ముంచి 7,160 కుటుంబాలను నిర్వాసితులను చేసి, తెలంగాణలో ఒక ఎకరం సాగుకు కూడా నీళ్లివ్వకుండా పులిచింతల ప్రాజెక్టును నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 2).ఖమ్మం జిల్లాలో 7 మండలాలను ముంచడమే కాకుండా వాటిని బలవంతంగా లాక్కొని, 20 వేల ఆదివాసీ కుటుంబాలను నిర్వాసితులను చేసి తెలంగాణలో మాత్రం ఒక ఎకరానికి కూడా సాగునీరివ్వని పోలవరం ప్రాజెక్టు కడుతున్న ఘనత టీడీపీది. 3).మల్లన్న సాగర్ ద్వారా కేవలం 7 గ్రామాలు,16 వేల ఎకరాలు ముంపుకు గురై, సుమారు 3 వేల కుటుంబాలు మాత్రమే నిర్వాసితులై, 10 లక్షల 23 వేల ఎకరాల తెలంగాణ బీడు భూములకు జలసిరులు అందించే ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది.

తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలే పునాది. ఈ అంశాల మీదే రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన నియామకాలు మనం చేసుకునే అవకాశం పొందగలిగాం. అలానే మన నిధులు, మన అభివృద్ధి కోసం ఖర్చు చేసే రాజ్యాంగబద్ధత కలిగింది. ఇక మిగిలింది నీళ్లు ఉపయోగించుకోవడం. ఇప్పటికే ఎగువ రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక కృష్ణా నీటి మీద అనుమతి ఉన్నవీ, లేనివీ అనేక ప్రాజెక్టులు నిర్మించడం వల్ల నీటి లభ్యత అంతంత మాత్రంగానే ఉన్నది. ఇక మిగిలింది గోదావరి నీరే. ఈ నదిలో నీటి లభ్యత ఉన్నందు వల్ల దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ నిపుణులతో చర్చించి, ప్రతిష్ఠాత్మకమైన వాప్కోస్ సంస్థ ద్వారా సర్వే చేయించారు. అత్యాధునికమైన లైడార్ సర్వే ద్వారా ప్రతి అంగుళం కొలిచి, గోదావరి మీద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణలోని 4 జిల్లాల్లో (మెదక్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి) 10 లక్షల 23వేల ఎకరాల నూతన ఆయకట్టుతో పాటు, ఇది వరకు ఉన్న ప్రాజెక్టుల స్థిరీకరణకు ఒక బృహత్ కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో.. ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్, టీడీపీలు మల్లన్న సాగర్‌లో నిర్వాసితుల అనుమా నాలు, భయాలను రాజకీయావకాశంగా మలుచుకుంటున్నాయి. రైతుల జీవనాధారమైన నీటి సమ స్య వారి చేతుల్లో రాజకీయాస్త్రంగా మారింది. అటు రైతుల నోట్లో మట్టికొడుతూ, ఇటు తెలంగాణ స్వయం సమృద్ధి చర్యలకు గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుగా నిలిచిన పక్క రాష్ట్ర పార్టీల ఎజెండాను తెలంగాణలో అమలు చేయాలనుకోవడం వారి రాజకీయ భావదారిద్య్రమే. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాల ప్రశ్నల అంతరార్థాన్ని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు అర్థం చేసుకోవాలి.
ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలు:
1.కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో భాగంగా భారీగా రిజర్వాయర్లు నిర్మించడం అవసరమా? గోదావరి నదిలో ఏటా 2000 టీఎంసీల నీరు ప్రవహిస్తే అందులో 80శాతం కేవలం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే లభ్యత ఉంటుంది. నీటి లభ్యత ఉన్నప్పుడే నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి తుమ్మిడిహట్టి, మేడిగడ్డ బ్యారేజీలు నిర్మించి, నాలుగు నెలల్లో ఎత్తిపోతల ద్వారా వీలైనంత నీటిని గోదావరి నుంచి మళ్లించడం, కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిర్మించిన రిజర్వాయర్‌ను నింపుకొని నీటి లభ్యత లేని సమయాల్లోనూ వాడుకునేట్లు చేసే ప్రక్రియే ప్రాజెక్టు రీడిజైనింగ్. ప్రతిపక్ష పార్టీలకు ఈ మాత్రం అర్థం కాదా?
2. మల్లన్న సాగర్ సామర్థ్యం తగ్గించండి. లేదా దాని డిజైన్ మార్చండి. లేదా అక్కడి నుంచి ఎక్కడికై నా తరలించండి..! తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే ఇక్కడే ప్రాజెక్టులు కట్టాలి. పక్క రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టి, మన రాష్ట్రంలోకి నీరు పారాలంటే అంతకన్నా అవివేకం మరోటి లేదు. సముద్ర మట్టం నుంచి ఎత్తయిన ప్రదేశం ద్వారా ఆ ప్రాజెక్టు నుంచి వెలువడే కాల్వలు గ్రావిటీ సహాయంతో సాగయ్యే అవకాశం ఉన్నది. అందుకే ఇక్కడ అత్యల్పంగా ముంపుకు గురై అత్యధికంగా సాగయ్యే అవకాశం ఉండటంతో కేసీఆర్ గారు ఆ ప్రదేశాన్ని ఎంచుకోవడం జరిగింది.
3. ముంపెంత.. సాగెంత..? మల్లన్న సాగర్ సామర్థ్యం 50 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల 23 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 7 గ్రామాల్లో 19,395 ఎకరాల భూమి ముంపుకు గురవుతుంది. ఇందులో ప్రభుత్వ భూమి 3 వేల ఎకరాలు పోగా కేవలం పదహారు వేల ఎకరాల పట్టాభూమి ముంపుకు గురవుతుంది. అంటే ఒక ఎకరా ముంపుకు 64 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీనిద్వారా నిర్వాసితులవుతున్న వారి సంఖ్య 5,434 కుటుంబాలు. ఒకసారి ఇతర ప్రాజెక్టులను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి తాగునీరందించే పులిచింతల ప్రాజెక్టు వల్ల తెలంగాణ హుజూర్‌నగర్‌లోని 13 గ్రామా లు పూర్తిగా, 4 గ్రామాలు పాక్షికంగా మొత్తం13 వేల 966 ఎకరాలు ముంపుకు గురవుతాయి. దీనివల్ల 7,106 కుటుంబాలు నిర్వాసితులైతే, ఒక్క ఎకరాకు కూడా నీరు అందడం లేదు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన కడెం ప్రాజెక్టు వల్ల పూర్తిగా 7 గ్రామాలు మునిగితే 6,236 ఎకరాల భూమి ముంపుకు గురవుతుంది. దీనివల్ల 5,484 కుటుంబాలు నిర్వాసితులైతే, కేవలం 30 వేల ఎకరాలకే సాగునీరు అందుతుంది. అంటే ఒక ఎకరా ముంపుకు గురైతే 4.8 ఎకరాలకు సాగునీరు అందుతుంది. మిడ్‌మానేరు ప్రాజెక్టును చూస్తే 11గ్రామాలు పూర్తిగా, 7 గ్రామాలు పాక్షికంగా మునుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల 16,016 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. 11,123 కుటుంబాలు నిర్వాసితులవుతున్నారు. ఈ ప్రాజెక్టుద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. అంటే ఒక ఎకరా ముంపుకు 12 ఎకరాలు సాగవుతుంది. గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వల్ల 85 వేల ఎకరాలు ముంపుకు గురైతే దాదాపు 45వేల మంది ఆదివాసీలు నిర్వాసితులయ్యారు. ఈ ప్రాజెక్టు వల్ల ఒక ఎకరా ముంపుకు కేవలం 21 ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల ఆ రాష్ట్రంలోని 4జిల్లాలకు దాదాపుగా 9.6 లక్షల ఎకరాలకు నీటి లభ్యత, కృష్ణానది ఆయకట్టుకు స్థిరీకరణ జరిగింది. ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలలోని ఆదివాసులు ముంపుకు గురవుతున్నారు. అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ముంపుకు గురవుతున్నాయి. వారిని బలవంతంగా నోరు నొక్కేయడానికి తెలంగాణ నుంచి ఆంధ్రాకు మండలాలను బదలాయించారు. 2 లక్షల మంది ఆదివాసీలు నిర్వాసితులవుతుంటే ఇక్కడి ప్రతిపక్ష నాయకులు గాని, ఏపీ ప్రతిపక్ష నాయకులుగాని వారి పక్షాన నిలిచారా? దీన్నిబట్టి ఒకటి మాత్రం తేటతెల్లమవుతున్నది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం, ప్రతిపక్షాలైనా వారి రాష్ట్ర ప్రయోజనాల అంశం ముందుకొచ్చినప్పుడు వైరుధ్యాలు మరిచి, ఏకతాటిపై ఉంటున్నారు. కాని మన తెలంగాణ రాజకీయ పక్షాలకు అలాంటి అవగాహన ఉండటం లేదు.
4. 2013 చట్టమా -జీవో నెం. 123నా? ఏది లాభం.. ఏది నష్టం..?
ప్రతిపక్ష పార్టీలు రాజకీయ సంకుచిత స్వభావం తో కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి లంకె పెడుతూ తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయి. గజ్వేల్‌లో కడుతున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న రైతు కుటుంబాలకు పూర్తి సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. 2013 చట్టం ప్రకారం ఏటిగడ్డకిష్టాపూర్‌లో ఎకరాకు 60 వేలు రిజిస్ట్రేషన్ విలువ ఉంటే దానికి మూడింతలు కలిపి ఎకరానికి 1,80 వేల పరిహారం అందుతుంది. ఇంటిని కోల్పోయిన వారికి ఇందిరా ఆవాస్ యోజన కింద 70 వేల రూపాయలు ఇళ్ల నిర్మాణానికి ఇస్తారు. అదే జీవో-123 ప్రకారం ఎకరానికి దాదాపు 6 లక్షల రూపాయల పరిహారం ఇవ్వడమే కాకుండా, ఇళ్లు కోల్పోయిన వారికి 5 లక్షలు, ఏడాదిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకించి ఆయా కుటుంబాల్లో అర్హత కలిగినవాళ్లుంటే వారికి ఏదో రకంగా ఉపాధి హామీ కలిగించడానికి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు కట్టిన ప్రాజెక్టులన్నింటిలో పరిహారం చెల్లించడానికి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిహారాన్ని వెంటనే బ్యాంకుల్లో జమ చేయడం జరుగుతుంది.
ఉదాహరణకు యాదాద్రి నుంచి వరంగల్‌కు నిర్మించే 4 లైన్ రోడ్డు మార్గంలో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ విలువ మీద మూడింతలు చెల్లించి జూన్ 1 నుంచి మొదలుపెట్టింది. నిర్వాసితులు పరిహారం తక్కువని వాపోతున్నప్పటికీ ఆ సొమ్మును డిపాజిట్ చేసి, పనులు మొదలుపెట్టింది. నిజానికి యాదాద్రి పనులు మొదలుపెట్టిన తరువాత భూముల విలువ పెరిగి, ఎకరాకు 40-60 లక్షలు పలుకుతున్న సమయంలో కేవలం వాల్యూ మీద నిర్ణయం తీసుకున్న సంగతి కళ్ల ముందే కనిపిస్తున్నది. ప్రతిపక్ష పార్టీలు నిర్వాసిత గ్రామాలకు వెళ్లి, ఒక పార్టీ మొదట ఎకరాకు 10 లక్షలు డిమాండ్ చేస్తే, రెండోరోజు 20 లక్షలు, మూడోరోజు 30 లక్షలు, నాల్గోరోజు 40 లక్షలు డిమాండ్ చేశాయి. అదృష్టవశాత్తు తెలంగాణలో మూడు పార్టీలు మాత్రమే ఉన్నా యి. ఇవే పార్టీలు పులిచింతల నిర్వాసితులకు 60 వేల నుంచి లక్ష ఇచ్చి చేతులు దులుపుకున్న సంగతి మర్చిపోయాయి.
5. సోషల్ ఇంపాక్ట్‌నా లేదా పొలిటికల్ ఇంపాక్ట్‌లనా? ఏది నిజం.. ఏది అబద్ధం? ప్రభుత్వం కడుతున్న భారీ నీటి ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల 20 వేల ఎకరాల సాగునీరు వస్తే ఈ జలసిరులు సన్న, చిన్నకారు రైతుల కుటుంబాల్లో ఆర్థిక సిరులు నిండుతాయి. ఇప్పటికే దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గోదావరి నీళ్లపై మన హక్కును వినియోగించుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న ది. ఇలాంటి సమయంలో తెలంగాణ గడ్డ మీద పుట్టి న వివిధ పక్షాల నాయకులు విజ్ఞతతో సహకరించా లి. ప్రతిపక్షాలకు కేసీఆర్ మీదనో, టీఆర్‌ఎస్ మీదనో అక్కసు ఉంటే వాటిని తీర్చడానికి అనేక రాజకీయ అంశాలున్నాయి. కాని రైతులను బలిపశువులను చేయకండి. తోయం!జీవం! మూలం! అంటే జలం జీవనానికి మూలం అనే ఈ సూక్తిని మరువకండి.