Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నిధులు పెంచండి..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆరునెలల అనంతరం దేశ రాజధానికి వెళ్తున్న సీఎం రెండురోజులపాటు అక్కడ ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ర్టాల్లో అమలుచేసే పథకాలపై సబ్‌గ్రూపు రూపొందించే తుది నివేదికను ప్రధాని నరేంద్రమోదీకి అందచేస్తారు. కేంద్ర ఆర్థికమంత్రి ఆరుణ్ జైట్లీని కూడా కలిసే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ర్టానికి నిధుల పెంపు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుపై ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చర్చించే అవకాశముంది. ఢిల్లీ పర్యటనకు సన్నాహకంగా ఆదివారం మధ్యాహ్నం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో కేసీఆర్ సమావేశమై గంటకు పైగా వివిధ అంశాలపై చర్చించారు.

KCR -కేంద్రాన్ని కోరనున్న సీఎం కేసీఆర్ -రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఢిల్లీకి సీఎం -నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశానికి హాజరు -ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిపై పనగరియాకు వివరణ -ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రిని కలిసే అవకాశం -నవంబర్ 3,4 తేదీలలో మరోసారి ఢిల్లీకి! -గవర్నర్ నరసింహన్‌తో సీఎం భేటీ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుపై… నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం ఢిల్లీకి విమానంలో వెళతారు. మంగళవారం నాడు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్(సీఎస్‌ఎస్) సబ్‌గ్రూప్ సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో సీఎం ప్రధానంగా కేంద్ర పథకాలలో కోత, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితిని 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని కోరనున్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం గతంలో కేంద్రంలో రాష్ర్టాల పన్నుల వాటా 32 శాతం ఉన్నప్పుడు ఎక్కువ నిధులు వచ్చాయి. ఇప్పుడీ వాటాను 42శాతానికి పెంచినా గతంలో వచ్చిన ఆదాయం కూడా రావడం లేదు.

ఎందుకంటే గతంలో కేంద్రం నుంచి ఉమ్మడి రాష్ర్టానికి పన్నుల ఆదాయం 2.89 శాతం ఉండగా ఇప్పుడు అది 2.43 శాతానికి తగ్గింది. దీంతో దాదాపు రూ.2.300 కోట్ల ఆదాయాన్ని తెలంగాణ కోల్పోతున్నది. ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి 29 రాష్ర్టాల నుంచి తీసుకున్న సర్వే లెక్కల్లో ఇది వెలుగు చూసింది. తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని భావించిన సర్కారు మిగులు బడ్జెట్ ఆధారంగా ఎఫ్‌ఆర్‌బీఎంను 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని కోరుతున్నది. ఈ మేరకు సీఎం కేసీఆర్ వాస్తవ పరిస్థితిని నీతి అయోగ్ సబ్‌గ్రూప్‌లో చర్చించనున్నారు. ఈ అంశంపై నీతిఅయోగ్ వైఎస్ చైర్మన్ అరవింద్ పనగరియాకు కూడా వివరించనున్నారు.

సబ్‌గ్రూప్ ద్వారా ఈ మేరకు నీతి ఆయోగ్ చైర్మన్ ఒక రికమండేషన్‌ను ప్రధాని నరేంద్రమోదీకి అందజేస్తారు. ఈ అంశాన్ని అంగీకరించాలని ప్రధానిని కోరనున్నట్లు సమాచారం. అలాగే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా సీఎం ప్రత్యేకంగా కలిసే అవకాశం ఉందని తెలిసింది. ఈ మేరకు సీఎంఓ కార్యాలయ అధికారులు ఆర్థికమంత్రి ఆరుణ్‌జైట్లీ అపాయింట్‌మెంట్ అడిగినట్లు తెలిసింది. బుధవారం ఆయనను కలిసిన తరువాత సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలిసింది.

నవంబర్ 3,4 తేదీలలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి నవంబర్ 3,4 తేదీలలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నది. 3వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ఆయా ప్రభావిత రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, హోంశాఖ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పాల్గొనాలనుకుంటే నవంబర్ 3నే ఢిల్లీకి వెళ్లాల్సిఉంది. అయితే నవంబర్ 3వ తేదీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని సమాచారం. ఇక నవంబర్ 4న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధులు ఢిల్లీకి వస్తున్నారు. ఫోరమ్ డెలిగేట్స్‌తో సీఎం కేసీఆర్ స్వయంగా సమావేశమవుతారని తెలిసింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం గురించి వివరించే అవకాశాలున్నాయని విశ్వసనీయంగా తెలిసింది.

గవర్నర్‌తో సీఎం భేటీ.. ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఢిల్లీలో తన పర్యటనకు సంబంధించిన వివరాలతో పాటు అనేక విషయాలు చర్చించినట్టు తెలిసింది. నూతన జలవిధానంపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు అంశంపై గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. గోదావరి నదిపై లైడార్ సర్వే పూర్తయిన క్రమంలో నూతన జలవిధానం పై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారని తెలిసింది. లైడార్ సర్వేపై మొదటి దశ నివేదికలు ఒకటి రెండు రోజుల్లో అందనున్నాయి.

గోదావరిపై మేడిగడ్డ వద్ద ఒక భారీ బ్యారేజీని నిర్మిస్తున్నట్లు అదే విధంగా తుపాకుల గూడెం దగ్గర మరో బ్యారేజీ నిర్మిస్తున్నట్లు గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు మహారాష్ట్రతో ప్రారంభించనున్న సంప్రదింపులపై వివరించినట్టు తెలిసింది. తాను త్వరలో నిర్వహించాలనుకుంటున్న ఆయత మహాచండీయాగం గురించి కూడా చర్చించినట్లు సమాచారం.

సీఎస్‌ఎస్ సబ్‌గ్రూప్ సమావేశం.. మంగళవారం నాడు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్(సీఎస్‌ఎస్) సబ్‌గ్రూప్ సమావేశం నీతి ఆయోగ్ వైఎస్ చైర్మన్ అరవింద్ పనగరియా అధ్యక్ష తన జరుగుతుంది. ఈ సబ్ గ్రూప్‌కు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ అధ్యక్షులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలమీద ఈ సబ్‌గ్రూప్ ఇప్పటికే పలుమార్లు చర్చించి జూలై 5వ తేదీన ఒక డ్రాప్ట్ రిపోర్ట్‌ను ప్రధాని నరేంద్రమోదీకి అందించగా ఆయన ఆ నివేదికలో మార్పులు చేర్పులు సూచించారు. ఆ తరువాత నీతి ఆయోగ్ కూడాసమావేశమై పలు సూచనలు చేసింది. ఈ సూచనల క్రోడీకరణలతో రూపొందిన తుదినివేదికను ప్రధానికి అందజేయడానికి మంగళవారం ఈ సబ్‌గ్రూప్ సమావేశమవుతున్నది. ఇందులో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటున్నారు. సమావేశంలో తుది నివేదికపై చర్చించిన అనంతరం సాయంత్రం ప్రధానిని ఈ గ్రూప్ కలువనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇవీ సిఫారసులు… యుపీఏ-1 హయాంలో కేంద్రం167 పథకాలను ప్రవేశ పెట్టింది. యుపీఏ-2 వాటిని 72కు తగ్గించింది. అయితే ఈ పథకాల అమలు కూడా సరిగ్గా లేదని నీతి ఆయోగ్ భావించింది. వీటిని 30 పథకాలకు తగ్గించాలని డ్రాప్ట్ నివేదికలో సిపారసు చేసింది. అలాగే కేంద్రం అమలు చేసే పథకాలపై అదనంగా 10 శాతం నిధులు పెంచాలని కూడా సూచించింది. సబ్ గ్రూప్ తన ముసాయిదాలో గ్రామీణ ఉపాధి హామీ, స్వచ్ఛభారత్ మిషన్, మధ్యాహ్న భోజన పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, రెండవ ప్రాధాన్యంగా సామాజిక భద్రత అంశాలను చూడాలని పేర్కొన్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.