-తొలి సభ్యత్వం స్వీకరించనున్న పార్టీ అధినేత కేసీఆర్ -తెలంగాణభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం -పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి చైర్మన్లకు ఆహ్వానం
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభంకానున్నది. తెలంగాణభవన్‌లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తొలి సభ్యత్వం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ తరపున ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లను కూడా ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రధానంగా సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సభ్యత్వ నమోదును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పర్యవేక్షించనున్నారు.
సమావేశానికి వచ్చిన ముఖ్యులందరూ సభ్యత్వాలను స్వీకరించడానికి తెలంగాణభవన్‌లో 11 కౌంటర్లు ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. సాధారణ సభ్యత్వానికి రూ.30, క్రియాశీల సభ్యత్వానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. సభ్యత్వం తీసుకున్నవారికి రెండు లక్షల ప్రమాదబీమా ఉంటుంది. ఈసారి మరింత పకడ్బందీగా పార్టీ సభ్యత్వ నమోదు నిర్వహించనున్నారు. సభ్యత్వం తీసుకున్నవారి వివరాలను కంప్యూటరీకరిస్తారు. సభ్యుల ఆధార్, ఫోన్ నంబర్ సేకరిస్తున్నారు. వాటన్నింటినీ కంప్యూటర్‌లో భద్రపర్చటంద్వారా భవిష్యత్తులో వారితో నేరుగా ఫోన్‌లో మాట్లాడటం, టెలికాన్ఫరెన్సుల్లో భాగస్వాములను చేయటం తదితరాలకు వినియోగిస్తారు. జూలై నెలాఖరుకల్లా గ్రామ కమిటీలను ఎన్నుకోనున్నారు. గతానికి భిన్నంగా ఈసారి గ్రామస్థాయిలో కూడా సామాజికవర్గాలవారీగా కమిటీలను నియమించాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు.
పార్టీ గ్రామ, మండల కమిటీల ఎన్నికల పరిశీలకులుగా ఒకటి లేదా రెండు నియోజకవర్గాలకు ఒకరి చొప్పున నియమించనున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఇప్పటికే ప్రతి జిల్లాలో శాశ్వత కార్యాలయాలకు శంకుస్థాపన పూర్తిచేశారు. దసరానాటికి కార్యాలయాల నిర్మాణం పూర్తికావాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులను కూడా కేటాయించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు ఆదరించారు. ఈ నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోనున్నారు. గతంకంటే ఎక్కువగా సభ్యత్వం నమోదు అవుతుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సభ్యత్వ నమోదు పుస్తకాల ముద్రణ పూర్తి అయింది.