-దిక్సూచి తెలంగాణ
-కేంద్ర సర్కారుకు సైతం మనమే స్ఫూర్తి
-తెలంగాణ బిడ్డగా అందుకు గర్విస్తున్నా
-ఆహ్వానాలు ఉన్నవారే ప్లీనరీకి రావాలి
-విజయవంతానికి కమిటీల ఏర్పాటు
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-హెచ్‌ఐసీసీ ప్రాంగణం పరిశీలన ఘనంగా టీఆర్‌ఎస్ ద్విదశాబ్ది పండుగ
ఏడేండ్ల స్వల్ప కాలంలోనే రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచినందుకు తెలంగాణ బిడ్డగా గర్వపడుతున్నానని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ నెల 25న పార్టీ ప్లీనరీని నిర్వహించే మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణాన్ని మంత్రి కేటీఆర్ గురువారం పరిశీలించారు. ప్లీనరీ ఏర్పాట్లపై పోలీసు అధికారులు సహా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పారింగ్, సభాస్థలి ఏర్పాట్లు, ప్రతినిధులు, నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల ప్రవేశ ద్వారాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ రద్దీ వంటి అంశాలపై ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ఆవిర్భవించి 20 ఏండ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని పార్టీ ప్రస్థానం.. సాధించిన విజయాలను మననం చేసుకోవటానికి వచ్చే నెల 15న వరంగల్‌లో తెలంగాణ విజయగర్జన బహిరంగ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, పట్టణ, డివిజన్ సహా అన్ని కమిటీలు, అనుబంధ కమిటీల నిర్మాణం పూర్తిచేసుకున్నామని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా పార్టీ సర్వసభ్య సమావేశంతోపాటు ప్లీనరీని ఈ నెల 25న నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్లీనరీ విజయవంతానికి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్లీనరీ ఆహ్వాన కమిటీ, పార్కింగ్ కమిటీ, నగర అలంకరణ కమిటీ, సభా నిర్వహణ సహా పలు కమిటీలతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు.
దేశానికే ఆదర్శంగా..
కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ అనేక సవాళ్లను ఎదురొని, ఉద్యమాన్ని నడిపి, రాజ్యాంగ నిర్మాత అంబేదర్ రూపొందించిన రాజ్యాంగం ఆధారంగా ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని కేటీఆర్ చెప్పారు. రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం ఉండాలని భావించి ప్రజలు ఆశ్వీరించారని, ఫలితంగా 2014, 2018లో రెండుసార్లు టీఆర్‌ఎస్ అధికారాన్ని చేపట్టిందని అన్నారు. ఏడేండ్లలో కేసీఆర్ తన అపూర్వ ఆలోచనా విధానంతో అనేక విజయవంతమైన పథకాలు తెచ్చారని కేటీఆర్ చెప్పారు. ‘నేటి బెంగాల్ ఆలోచనే రేపటి భారత ఆచరణ’ అన్న ఒకప్పటి నానుడిని తెలంగాణ మార్చివేసిందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్నదని, కేసీఆర్ కార్యదక్షత అనేక రాష్ర్టాలకు స్ఫూర్తినిస్తున్నదని చెప్పారు. రైతుబంధు పథకం.. దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అనివార్యతను సృష్టించిందని, ఈ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం తెస్తే కేంద్రం ‘హర్ ఘర్ జల్’ను ప్రవేశపెట్టిందని, టీఎస్‌ఐపాస్ పేరిట దేశంలోనే అత్యద్భుతమైన పారిశ్రామిక పాలసీని తెలంగాణ తెస్తే.. కేంద్రం ‘ఇన్వెస్ట్ ఇండియా పోర్టల్’ను తెచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో అర్బన్ ఫారెస్ట్ గణనీయంగా పెరగటాన్ని గమనించిన కేంద్ర బృందం.. దేశమంతా ఈ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనతో రాష్ర్టాన్ని మోడల్‌గా స్వీకరించి ‘నగర్‌వన్’కు రూపకల్పన చేసిందని చెప్పారు. రాష్ర్టాన్ని సాధించిన ఏండేండ్ల స్వల్పకాలంలోనే దేశానికే మార్గదర్శనం చేసే స్థాయికి ఎదిగామని, అందుకు ఒక తెలంగాణ బిడ్డగా తనకు గర్వంగా ఉన్నదన్నారు.
పటిష్టమైన ఏర్పాట్లు
25న హైటెక్స్‌లో పార్టీ సర్వసభ్య సమావేశం, పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక అనంతరం 14వేల మందితో జరిగే ప్రతినిధుల సభ (ప్లీనరీ)కు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. హైటెక్స్ ప్రాంగణాన్ని పరిశీలించి సభ నిర్వహణపై చర్చించినట్టు చెప్పారు. 60 లక్షల సభ్యులున్న అతి పెద్ద పార్టీ టీఆర్‌ఎస్ అన్న కేటీఆర్.. ప్లీనరీకి పార్టీ సంస్థాగత సభ్యులు, ఆహ్వానితులు మాత్రమే హాజరవుతారని చెప్పారు. సభకు హాజరయ్యేవారికి ఎస్సెమ్మెస్‌లు, ఇతర పద్ధతుల ద్వారా తెలంగాణ భవన్ నుంచి సమాచారం అందిస్తామని తెలిపారు. సభా ప్రాంగణంలో పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా ప్రతినిధులకు సీటింగ్ ఉంటుందన్నారు. ప్రతినిధుల నమోదు బాధ్యతను వలంటీర్ కమిటీ చూ సుకుంటుందని తెలిపారు. ప్లీనరీని పురస్కరించుకుని.. టీఆర్‌ఎస్ ప్రస్థానం, సాధించిన విజయాలపై హైదరాబాద్ నలుదిక్కులా భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయనున్నట్టు కేటీఆర్ చెప్పారు. నలుగురు మంత్రుల సారథ్యంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరుల నేతృత్వంలో నగర అలంకరణ కమిటీ ఉంటుందన్నారు. ప్రతినిధుల సభను విజయవంతంగా నిర్వహించేందుకు ఆహ్వాన కమిటీ సహా వివిధ కమిటీలను కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూ డి గాంధీ, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ప్లీనరీ విజయవంతానికి కమిటీలివే..
ఆహ్వాన కమిటీ చైర్మన్‌గా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సభ్యులుగా ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి.
నగర అలంకరణ కమిటీ: మంత్రులు తలసాని, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ సారథ్యంలో మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు .
సభాప్రాంగణ అలంకరణ: గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్.
ప్రతినిధుల నమోదు, వలంటీర్ల కమిటీ: శంభీపూర్ రాజు, ఇతర యువజన నాయకులు.
పార్కింగ్ కమిటీ: ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ నేతృత్వంలో ఇతర సభ్యులు.
భోజనాల కమిటీ: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఇతర సభ్యులు.
మీడియా కమిటీ: ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.
ప్లీనరీ తీర్మానాల కమిటీ: చైర్మన్‌గా మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పార్టీ సీనియర్ నేత పర్యాద కృష్ణమూర్తి, ఇతర సభ్యులు.
‘నేటి బెంగాల్ ఆలోచనే రేపటి భారత్ ఆచరణ’ అన్న ఒకప్పటి నానుడిని తెలంగాణ మార్చివేసింది. రైతుబంధు పథకం.. దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అనివార్యతను సృష్టించింది. మనం మిషన్ భగీరథ తెస్తే కేంద్రం ‘హర్ ఘర్ జల్’ను ప్రవేశపెట్టింది. టీఎస్‌ఐపాస్ పేరిట దేశంలోనే అత్యద్భుతమైన పారిశ్రామిక పాలసీని తెలంగాణ తెస్తే.. కేంద్రం ‘ఇన్వెస్ట్ ఇండియా పోర్టల్’ను తెచ్చింది.
-మంత్రి కే తారకరామారావు