Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నేతన్నను నిట్టనిలువునా ముంచిందే మోదీ ప్రభుత్వం

-చేనేతపై పన్నులు వేసిన దుర్మార్గం బీజేపీ సర్కారుది
-నేతన్నలను ఆదుకొంటున్నది తెలంగాణ ప్రభుత్వమే
-నేత కార్మికులకు మీరు బీమా ఎత్తేస్తే, మేం ఇచ్చాం
-కండ్లున్నా చూడలేని మూర్ఖుడు బండి సంజయ్‌
-కేటీఆర్‌ ధ్వజం.. బీజేపీ అధ్యక్షుడికి బహిరంగ లేఖ

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్‌ ఏనాడైనా తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం పార్లమెంటులో ఒక్క మాటైనా మాట్లాడారా? కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్‌ కోసం ఏనాడైనా నోరు విప్పారా? మా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో వ్యవసాయ రంగంతోపాటు టెక్స్‌టైల్‌ రంగంలోనూ రివర్స్‌ మైగ్రేషన్‌ మొదలైంది. ఈ విషయం కండ్లకు కనిపించకపోవడం సంజయ్‌ గుడ్డితనానికి నిదర్శనం.

చేనేత కార్మికుల సంక్షేమంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి, మూర్ఖత్వానికి నిదర్శనమని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. నేతన్నల సంక్షేమం కోసం ఏ రాష్ట్రం చేపట్టని స్థాయిలో విప్లవాత్మక కార్యక్రమాలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. బండి సంజయ్‌ పాదయాత్ర పేరుతో ప్రజలపై అబద్ధాల దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్‌ శనివారం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నేత కార్మికులకు ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొంటున్నదని ఆరోపించారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాలుగా నిరాదరణ, నిర్లక్ష్యానికి గురైన నేత కార్మికులను ఆదుకొన్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని తెలిపారు. ఒకేసారి వందల కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయించి నేత కార్మికుల సంక్షేమానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చామని చెప్పారు. రుణాలు మాఫీ చేసి, వారిని అప్పుల ఊబినుంచి కాపాడింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు.

చేనేత కార్మికులకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్న చేనేత మిత్ర పథకం ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్నదని గుర్తుచేశారు. నేతన్నకు చేయూత పేరుతో తమ ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకం కొవిడ్‌ సంక్షోభ కాలంలో వారికి ఆపన్నహస్తంగా మారిందని గుర్తుచేశారు. మగ్గాల ఆధునీకరణ నుంచి వరర్‌ టు ఓనర్‌ పథకం వరకు తమ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల నేడు రాష్ట్రంలోని నేత కార్మికుల ఆదాయం రెట్టింపై గౌరవంగా బతుకుతున్నారని పేర్కొన్నారు. నేత కార్మికులనే కాకుండా స్థూలంగా టెక్స్‌టైల్‌ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్‌టైల్‌ పారు ఏర్పాటుతోపాటు అనేక మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పవర్‌లూం కార్మికులకు సైతం పెద్ద ఎత్తున సహాయం అందించామని చెప్పారు. నేత కార్మికులు నేడు సుఖశాంతులతో జీవిస్తున్నారని, మళ్లీ వారికి పాతరోజులు రావాలని కోరుకొంటున్నారా? అని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. కల్లబొల్లి కబుర్లతో కార్మికులను మోసం చేయొద్దని హెచ్చరించారు.

కేంద్రం సంపూర్ణ సహాయ నిరాకరణ
నేతన్నల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ నిరాకరణ చేస్తున్నదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఇప్పటికే అనేకసార్లు కేంద్ర మంత్రులతోపాటు ప్రధానమంత్రిని కలిసి కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పారుకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని, రాష్ట్రంలో నేషనల్‌ టెక్స్‌టైల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ హ్యాండ్‌లూం టెక్నాలజీ, మెగా పవర్‌లూం క్లస్టర్‌ ఏర్పాటుచేయాలని అనేక విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నేతన్నల కోసం అనేక కార్యక్రమాలు చేపడతామంటున్న బండి సంజయ్‌, కేంద్రంలో వారి పార్టీయే అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు.

రివర్స్‌ మైగ్రేషన్‌ కనిపిస్తలేదా?
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న బండి సంజయ్‌ ఏనాడైనా తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం పార్లమెంటులో ఒక్క మాటైనా మాట్లాడారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్‌ కోసం ఏనాడైనా నోరు విప్పారా? అని నిలదీశారు. తమ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో వ్యవసాయ రంగంతోపాటు టెక్స్‌టైల్‌ రంగంలోనూ రివర్స్‌ మైగ్రేషన్‌ మొదలైందని, ఈ విషయం బండి సంజయ్‌ కండ్లకు కనిపించకపోవడం ఆయన గుడ్డితనానికి నిదర్శనమని విమర్శించారు. ముంబై, భివండీ, సూరత్‌ వంటి ప్రాంతాల నుంచి వేల మంది తెలంగాణకు తిరిగివచ్చి తమ వృత్తిలో నిమగ్నమవుతుంటే బండి సంజయ్‌కి కనిపిస్తలేదా? అని నిలదీశారు. నేత కార్మికులకు ఉన్న అన్ని బీమా పథకాలను కేంద్రప్రభుత్వం రద్దు చేస్తే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారికి బీమా కల్పిస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. నేత కార్మికుల కండ్లల్లో కారం కొట్టి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారా? అని మండిపడ్డారు. ఇన్నాళ్లు బీజేపీకి, ఆ పార్టీ నేతలకు ముందుచూపే లేదనుకొన్నామని, వారికి అసలు చూపే లేదని ఇప్పుడు అర్థమైందని ఎద్దేవా చేశారు.

ప్రధానిని నిలదీయ్‌..
ఒకవైపు దేశంలోని నేత కార్మికుల ఉసురు తీస్తూ మరోవైపు పరిశ్రమను ఆదుకొనేందుకు ప్రయత్నిస్తున్న తమను విమర్శించే బీజేపీ వైఖరిని చూసి ఊసరవెల్లులు సైతం సిగ్గు పడుతున్నాయని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రిని నిలదీసి, రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక టెక్స్‌టైల్‌ పారును తీసుకొచ్చే దమ్ము, ధైర్యం బండి సంజయ్‌కి ఉన్నదా? అని ప్రశ్నించారు. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలోని అంశాలపైన అబద్ధాలు మాట్లాడటం మీడియా కవరేజ్‌ కోసం బండి సంజయ్‌ చేస్తున్న చిల్లర చేష్టలేనని విమర్శించారు. అసత్యాలతో మోసం చేయాలని చూస్తే రాష్ట్రంలోని నేతన్నలు బీజేపీ నేతలకు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

పన్నులేసిన పాపం బీజేపీదే
ప్రపంచంలోనే అత్యధికంగా పత్తి పండించే దేశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్లనే టెక్స్‌టైల్‌ రంగంలో బంగ్లాదేశ్‌, శ్రీలంక లాంటి చిన్న దేశాలకంటే మనం వెనుకబడ్డామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టెక్స్‌టైల్‌ ఉత్పత్తులపై భారీగా జీఎస్టీ పన్ను వేసి పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీది కాదా? అని ప్రశ్నించారు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారి చేనేత రంగంపై పన్నులు మోపిన పాపపు ప్రభుత్వం బీజేపీదేనని విమర్శించారు. చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని ఎన్ని లేఖలు రాసినా స్పందించని కేంద్ర ప్రభుత్వం మీదే కదా? అని బండి సంజయ్‌కి చురకలంటించారు. పన్నులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్‌ పారిశ్రామిక వర్గాలు ధర్నాలు, బంద్‌లు నిర్వహించినా కనికరం చూపని ప్రభుత్వం మీది కాదా? అని నిలదీశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.