Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నీటితీరువా బకాయిలు రద్దు

-రైతులకు కేసీఆర్ తీపి కబురు -ఇప్పటికే ఉన్న 800 కోట్లు మాఫీ.. భవిష్యత్తులోనూ వసూళ్లు ఉండవు -ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ ప్రభుత్వానిదే.. -మెదక్ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంచలన ప్రకటన -రైతులకు పంట సాయానికి తోడు మరో వరం -జూన్ 2 నుంచి నూతన రిజిస్ట్రేషన్ విధానం అమలు -సమైక్య రాష్ట్ర జీవన విధ్వంసానికి ఘనపురం ఆనకట్టే నిదర్శనం -వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 85 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు -ఈ ఏడాది చివరి నాటికి మెదక్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు -మంజీరా నదిపై 14 చెక్‌డ్యాముల నిర్మాణానికి మంజూరు -కాంగ్రెస్, బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యం -దేశానికి మార్గం చూపించడానికే జాతీయ రాజకీయాల్లోకి -తన ప్రయత్నాలకు ఆమోదం తెలుపాలని కోరిన సీఎం -చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తంచేసిన ప్రజలు

రాష్ట్రంలోని రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించనున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు.. వారికి మరో తీపికబురు చెప్పారు. తెలంగాణలో ఇకపై నీటితీరువాను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. సుమారు 800 కోట్ల వరకు ఉన్న బకాయిలను కూడా మాఫీ చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత ఇక ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రకటించారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా తెలంగాణలో ప్రాజెక్టులు, కాల్వలను ప్రభుత్వమే నిర్వహిస్తూ, రైతులకు సాగునీరందిస్తుందని చెప్పారు. మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సూచనతో ఈ ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. రైతు సమస్యల పరిష్కారంపై ఉన్న అవగాహన, చొరవతో ఆయన తనతో నీటితీరువా రద్దు చేయాలని కోరారని, అంతకుముందే మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కూడా ఈ విషయాన్ని తన వద్ద ప్రస్తావించారని వెల్లడించారు. బాగా పనిచేసే అధికారులు ఉండటంవల్లే అద్భుత ఫలితాలు వస్తున్నాయన్న సీఎం.. ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు చేస్తున్నాం దేశంలోనే ఎక్కడాలేని కార్యక్రమాలు రాష్ట్రంలో చేపడుతున్నట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నదని అన్నారు. అద్భుత పథకాల అమలు తెలంగాణ ప్రభుత్వానికి ఎలా సాధ్యమవుతున్నదంటూ దేశమే ముక్కున వేలేసుకుంటున్నదని చెప్పారు. జీవితంలోనే ఎవరూ ఊహించని విధంగా వందరోజుల్లో ఇంటింటికీ వెళ్లి, అక్కడే ఫాం-బీలు ఇచ్చి, భూరికార్డుల ప్రక్షాళన చేయడం చారిత్రాత్మకమని అభివర్ణించారు. ఈ క్రమంలోనే గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త పాస్‌పుస్తకాలు పంపిణీ చేసుకోబోతున్నామన్నారు. ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో రికార్డుల ప్రక్షాళన తొమ్మిదేండ్లక్రితం మొదలుపెడితే ఇంకా పూర్తికాలేదని గుర్తుచేశారు. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర బృందాలు మహబూబాబాద్ జిల్లాలో రికార్డుల ప్రక్షాళనను పరిశీలించాయి. మా రాష్ర్టాల్లో ఈ కార్యక్రమం చేపడితే ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పాయి అని సీఎం వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ కూడా భూరికార్డుల ప్రక్షాళన తాము చేయలేమని, తమకు సాధ్యంకాదని చెప్పారని తెలిపారు. దేశంలో రికార్డుల ప్రక్షాళన చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని కేసీఆర్ చెప్పారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కమిట్‌మెంట్‌తో పనిచేయడంతోనే ఇది సాధ్యమైందని చెప్తూ.. వారందరినీ సీఎం అభినందించారు.

మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ తెలంగాణకోసం బయలుదేరిన రోజుల్లో తనను ఎంతో అవమానపరిచారని, అవహేళన చేశారని సీఎం గుర్తుచేసుకున్నారు. 14 ఏండ్లు ప్రజల దీవెనలతో ఉద్యమించి, తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వస్తే కరంటు రాదని, పరిశ్రమలు తరలిపోతాయని, అంధకారంలో మునిగిపోతారని ప్రజలను గందరగోళానికి గురిచేశారు. ఆ మాటలను తారుమారు చేసి, కరంటు సమస్యను పరిష్కరించుకున్నాం. 2014కు ముందు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరంటు పోతే వార్త అని సీఎం చెప్పారు. రూ.92 వేల కోట్ల నిధులు సమీకరించి కరంటు సమస్యను పరిష్కరించుకున్నామని, 15వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించుకున్నామని, కొద్ది రోజుల్లోనే 28వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తిని సాధించుకుంటామని వివరించారు. దేశంలో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదుగుతుందని, రాష్ట్రంలో ఇక కరంటు సమస్య ఉండబోదని సీఎం స్పష్టంచేశారు.

నాటి జీవన విధ్వంసానికి ఘనపురం ఆనకట్ట నిదర్శనం ఉమ్మడి రాష్ట్రంలో జీవన విధ్వంసానికి ఘనపురం ఆనకట్ట నిదర్శనమని సీఎం చెప్పారు. నేను రవాణాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ సమీపంలోని దేవునికూచన్‌పల్లి గ్రామంలో దుర్గయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వెళ్ళాను. ఆ సమయంలో ఘనపురం కాల్వ దారుణంగా ఉన్నది. చెట్లు పెరిగి, కాల్వలు ధ్వంసం అయ్యాయి. కాల్వ నిశాని లేకుండా పోయింది. 1905లో నిజాం ప్రభువులు మంజీరా నదిపై 23 వేల ఎకరాలకు నీరందించే ఘనపురం ప్రాజెక్టు నిర్మిస్తే సమైక్య పాలకులు నాశనం చేశారు అని సీఎం అన్నారు. వాస్తవానికి ఆ ప్రాజెక్టుతోనే మెదక్‌కు మెతుకుసీమ పేరొచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తరువాత రూ.100 కోట్లతో ఆనకట్టను బాగుచేసుకుంటున్నామని, మెదక్ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నాలు చేయకుండా, ఎవరి కాళ్లు, కడుపులు పట్టుకోకుండా రైతులు ఘనపురం ఆనకట్ట కింద ఐదోసారి పంటలు పండించుకున్నారని అన్నారు. ఆనకట్ట ఎత్తు పనులను కొద్దిరోజుల్లో పూర్తిచేసుకుంటామని చెప్పారు.

జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్‌లకు కాళేశ్వరం నీళ్లు ఈ ఏడాది చివరినాటికి మెదక్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని సీఎం చెప్పారు. ఒకసారి నీళ్లు వస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు కూడా నింపుకొంటాం. హల్దివాగు ఇక ఎండిపోవడం జీవితంలో చూడం. పశ్చిమ మెదక్ జిల్లాలో సింగూరు నీటిని పంటలకు వాడుకోవచ్చు. సింగూరు ఒక నీటి వనరుగా ఉపయోగపడుతుంది అని సీఎం వివరించారు. నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు కూడా సింగూరు ప్రాజెక్టు నుంచి లిప్టులు పెట్టి లక్ష ఎకరాల చొప్పున సాగునీరందిస్తామని, ఇందుకు ఎన్ని వేల కోట్ల్లు అయినా వెనుకాడబోమని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సింగూరు నుంచి ఘనపురం వరకు మంజీరానదిపై 14 చెక్‌డ్యాములను ఆయన మంజూరు చేశారు. వీటి నిర్మాణంతో వచ్చే జూన్ తరువాత జీవధారలాగా నీళ్లు ఉంటాయని చెప్పారు.

తెలంగాణ 100 శాతం ధనిక రాష్ట్రమే తెలంగాణ ఏర్పడితే ధనిక రాష్ట్రం అవుతుందని చెప్పాం. అనుకున్నట్టుగానే తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యింది. దేవుడి దయ, ప్రజల సహకారం, రాత్రింబవళ్లు పనిచేసే అధికారుల కృషితో ఇది సాధ్యమైంది అని సీఎం కేసీఆర్ చెప్పారు. గత రెండేండ్లుగా తెలంగాణ ఆదాయం 20% పెరిగిందని, ఈ ఏడాది 16.8% పెరుగుదల ఉందని వెల్లడించారు. రాష్ట్ర సొంత ఆదాయం 20% పెరిగిన రాష్ట్రం దేశంలోనే ఒక్క తెలంగాణేనని చెప్పారు. డల్‌గా ఉండే ఏప్రిల్‌లో కూడా పెరుగుదల ఉండటం శుభపరిణామమన్నారు.

రిజిస్ట్రేషన్లు మరింత సులభతరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధరణి వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఎలాంటి ఖర్చులేకుండా ఉచిత రిజిస్ట్రేషన్లు చేస్తారని తెలిపారు. భూమి అమ్మినవారు, కొన్నవారు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు ఒక్కసారి వెళితే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తికావడంతోపాటు పాస్‌పుస్తకాలు ఇంటికి కొరియర్‌లో వస్తాయని చెప్పారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో పంట పెట్టుబడి సాయం కింద 57 లక్షలమంది రైతులకు చెక్కులు పంపిణీచేస్తున్నట్టు సీఎం చెప్పారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

85 స్థానాల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతు… గతంలో రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఏం చేశాయని ఇప్పుడు మాట్లాడుతున్నాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆ పార్టీల సాక్షిగానే ఘనపురం ఆనకట్ట నాశనమైంది వాస్తవం కాదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆనకట్ట బాగుచేయడంకోసం ఆ పార్టీల నాయకులు ఎందుకు పోరాటం చేయలేదని నిలదీశారు. నీళ్లు లేక, కరంటు సరిగారాక ఎన్నో మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయని సీఎం గుర్తుచేశారు. మంచినీళ్లు, కరంటు వస్తే, కాళేశ్వరం పూర్తయితే కాంగ్రెస్‌కు ఎవరూ ఓటేయరన్న అక్కసుతోనే ఆ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకున్న సమాచారం మేరకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 85 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కానున్నాయని సీఎం పేర్కొన్నారు.

మెదక్ జిల్లా కల నేరవేరింది మెదక్ కేంద్రంగా జిల్లా ఏర్పడటం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. కలలో కూడా ఊహించని పని జరిగింది. ఈ జిల్లాలో పుట్టి పెరిగిన నేను తెలంగాణ సాధించి, ఇప్పుడు ఎన్నో ఏండ్ల కల అయిన మెదక్ జిల్లాను ఏర్పాటుచేసి, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం ఆదృష్టంగా భావిస్తున్నా అని సీఎం చెప్పారు. 2014లో ఎన్నికలకు ముందు ఇక్కడ జరిగిన బహిరంగసభలో పద్మను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మెదక్ జిల్లాను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చిన. పద్మ పెద్ద పదవిలో ఉంటారని చెప్పిన. పద్మను గెలిపించారు. ఆమె డిప్యూటీ స్పీకర్‌గా సేవలందిస్తున్నారు. మెదక్‌ను జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం అని సీఎం చెప్పారు.

కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఎక్కువయ్యారు: మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు తక్కువ, సీఎం అభ్యర్థులు ఎక్కువయ్యారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. 70ఏండ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణలో ప్రకృతి వనరులు అన్నీ ధ్వంసం అయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉండటం వల్లే మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఏర్పాడ్డాయని, 70 సంవత్సరాల మెదక్ ప్రాంత ప్రజల కల నెరవేరిందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో కాంగ్రెస్ నాయకులకు నిద్రపట్టడం లేదని హరీశ్ ఎద్దేవాచేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్, పంజాబ్ మంత్రి సిద్ధు, కర్ణాటక కాంగ్రెస్ మంత్రి రేవణ్ణ, సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్‌హుస్సేన్‌లు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులను అభినందిస్తుంటే కాంగ్రెస్ వారికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్‌గా గుర్తింపు తెచ్చుకుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణవ్యాప్తంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారని చెప్పారు. మెదక్ జిల్లాలో 70 ఏండ్లలో జరుగని అభివృద్ధి జరిగిందన్నారు. మెదక్ జిల్లా కేంద్రం కావాలన్న 70 ఏండ్ల కలను నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, భూపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, రామలింగారెడ్డి, బాబూమోహన్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫరీదుద్దీన్, ఫారూక్‌హుస్సేన్, రాములునాయక్, కార్పొరేషన్ చైర్మన్లు శేరి సుభాష్‌రెడ్డి, దేవీప్రసాద్, ఎలక్షన్‌రెడ్డి, నర్సారెడ్డి, భూంరెడ్డి, దామోదర్, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని కేసీఆర్ చెప్పారు. పాత మెదక్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సెప్టెంబర్ చివరి నాటికి ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తాం. ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమం లేదు. సమైక్య రాష్ట్రంలో 265 టీఎంసీల సామర్థ్యం ఉన్న చెరువులను ధ్వంసంచేశారు. తెలంగాణలో మిషన్ కాకతీయ పేరుతో 46వేల చెరువులను పునరుద్ధరించుకుంటున్నాం. రహదారులు నిర్మించుకుంటున్నాం. కొత్త జిల్లాలను ఏర్పాటుచేసుకున్నాం. పెన్షన్లు పెంచుకున్నాం. ఒంటరిమహిళ, వితంతువులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏం చేస్తున్నదో వారిని అడిగితే తెలుస్తుంది. 50% సబ్సిడీపై చేనేత కార్మికులకు రంగులు అందిస్తూ వారు తయారుచేసిన వస్ర్తాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి పథకాలు తీసుకొచ్చాం. అన్ని వర్గాల పిల్లలకు 119 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేశాం. సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉంటున్నాం. ఇదంతా ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతోనే సాధ్యమవుతున్నది. వైద్యులు బాగా పనిచేయడంతోనే ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి అని సీఎం చెప్పారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. 70 ఏండ్లనుంచి దేశంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు అట్టర్‌ఫ్లాప్ అయ్యాయని, ఆ పార్టీల హయాంలో ప్రజలకు జరిగింది శూన్యమని చెప్పారు. అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నదని, ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 40 కోట్ల ఎకరాల పంటలు పండే భూమి ఉన్నది. ప్రతి ఎకరానికి నీళ్లందిస్తే 40వేల టీఎంసీలు సరిపోతాయి. దేశం మొత్తంలో పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 5వేల టీఎంసీలు వాడుకున్నా ఇంకా 25వేల టీఎంసీలు మిగులుతున్నాయి. 70 ఏండ్లుగా దేశాన్ని పాలించిన ఈ రెండు పార్టీల ఏం చేశాయి? దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లుంటే తాగడానికి, సాగుకు నీళ్లు రాకపోవడం ఎంతటి దుస్థితి? ఇందుకు కారణం ఆ రెండు పార్టీలు కావా? అని సీఎం ప్రశ్నలు కురిపించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించి, దేశానికి మార్గం చూపించడానికే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇతర దేశాల్లో జాతీయ రహదారులపై లారీలు 85 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటే మన ఇండియాలో 35 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాయని, గూడ్స్ రైళ్లు ఇతర దేశాల్లో 80 కిలోమీటర్ల వేగంతో వెళుతుంటే.. మన దగ్గర 24 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని తెలిపారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాల్సి ఉన్నదని, అందుకే నూతన ఆలోచనా విధానంతో అంతర్జాతీయ స్థాయిలో ముందుకు వెళ్లడానికే దేశరాజకీయాల్లోకి వెళుతున్నట్లు చెప్తూ.. తన ఈ ప్రయత్నాలకు ఆమోదం తెలుపాలని సీఎం కోరగా.. సభకు హాజరైవారంతా చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.