-జాతీయ తాగునీటి పథకం,ఐటీ శాఖలపై కేంద్రం సమీక్ష జాతీయ గ్రామీణ తాగునీటి పథకం, నిర్మల్ భారత్ అభియాన్, ఐటీ ప్రాజెక్టుల నిర్వహణపై ఢిల్లీలో వివిధ రాష్ర్టాల మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం నుంచి రెండురోజులపాటు కేంద్రం సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నది. ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు హాజరవుతారు.

ఆయనతోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి జే రేమండ్ పీటర్, గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ విభాగం చీఫ్ ఇంజనీర్ సురేందర్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఈ సమావేశంలో కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధులతోపాటు రాష్ట్రంలో అమలులో ఉన్న తాగునీరు, పారిశుధ్య నిర్వహణ ప్రాజెక్టుల ప్రగతి, నిధుల వినియోగం తీరును మంత్రి కేటీఆర్ వివరిస్తారు. రాష్ట్రంలో రూ.200 కోట్లతో తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు సమాచారం. మంగళవారం జరిగే అన్ని రాష్ర్టాల ఐటీ శాఖా మంత్రుల సమావేశంలో కూడా కేటీఆర్ పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీరంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేటీఆర్ వివరిస్తారు.