Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నేడు బంద్

-టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు -రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో సమావేశం -ముంపు ప్రజలకు జరిగే అన్యాయంపై ఆవేదన -ఆంధ్రా నేతలకు తలొగ్గి.. తెలంగాణకు తీరని ద్రోహం తలపెట్టిన కేంద్రం -ఆ ఆర్డినెన్స్ అప్రజాస్వామికం -బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు

మంగళవారమే ఆర్డినెన్స్‌కు ఆమోదం -ఖమ్మం జిల్లాలోని ఏడు ఆదివాసీ మండలాలు సీమాంధ్రకు ధారాదత్తం -మోడీ తొలి క్యాబినెట్ భేటీలోనే రహస్యాలు -అధికారికంగా ప్రకటించకుండా చీకటి కుట్రలు -హోంశాఖకు చేరిన ఆర్డినెన్స్.. త్వరలోనే రాష్ట్రపతికి -హడావిడిగా ఆమోదం వద్దు: టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్

KCR01

ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురువుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయటాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం ఆదివాసీల జీవనాధారమైన ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపటానికి సిద్ధపడిందని విమర్శించారు. అప్రజాస్వామిక ఆర్డినెన్స్‌తో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు. ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి బుధవారం విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదిలి బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్డినెన్స్ నేపథ్యంలో ఆయన రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను బుధవారం కలిసి గంటపాటు చర్చలు జరిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రజలకు జరుగనున్న అన్యాయంపై గవర్నర్‌కు కేసీఆర్ వివరించినట్లు తెలిసింది.

ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం: తెలంగాణలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ జారీచేసిన ఆర్డినెన్సుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం రాత్రి జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఆ కాపీని కేంద్ర హోం శాఖకు పంపింది. డ్రాఫ్టింగ్ ప్రక్రియ పూర్తికాకపోవటంతో బుధవారం రాత్రివరకూ అది రాష్ట్రపతి కార్యాలయానికి చేరలేదు. బుధవారం రాత్రి వరకూ ఈ ఆర్డినెన్సుకు సంబంధించిన డ్రాఫ్టింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. లీగల్ విభాగం సూచనలు, మార్పులు చేర్పులతో ఏ సమయంలోనైనా రాష్ట్రపతి కార్యాలయానికి చేరే అవకాశం ఉంది.

కేంద్ర హోంశాఖ వర్గాలు అందించిన సమాచారం మేరకు డ్రాఫ్టింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అది రాష్ట్రపతి కార్యాలయానికి చేరనుంది. ఈ ఆర్డినెన్సుకు సంబంధించి బుధవారం వరకూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయకపోవటం గమనార్హం. అయితే, రాష్ట్రపతి ఈ ఆర్డినెన్సు మీద సంతకం చేస్తారా లేదా అన్నది అనుమానంగానే ఉంది. మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన ఆర్డినెన్సునే మోడీ ప్రభుత్వం అధ్యయనం చేసి ఆమోదం తెలిపినట్లు సమాచారం. యూపీఏ ప్రభుత్వం ఈ ఆర్డినెన్సును ఆమోదించి రాష్ట్రపతికి పంపినప్పటికీ కొత్త ప్రభుత్వం ఎలాగూ ఏర్పడుతుంది కాబట్టి అప్పటివరకూ దీన్ని పెండింగ్‌లో ఉంచాలని భావించిన రాష్ట్రపతి, దానికి ఆమోదముద్ర వేయలేదు. ప్రభుత్వం మారిపోవటంతో మళ్ళీ ఆర్డినెన్సుకు కదలిక వచ్చింది.

పార్లమెంటు సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదిస్తారా లేక పెండింగ్‌లోనే ఉంచుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. న్యాయనిపుణులు మాత్రం ఆర్డినెన్సును రాష్ట్రపతి ఆమోదించకపోవచ్చని అంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నది కాబట్టి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముంపు గ్రామాలను కొత్తగా చేరుస్తూ ఆర్డినెన్స్ చేయాలంటే మళ్ళీ పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగి మళ్ళీ ఆర్టికల్-3 ప్రకారమే జరగాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

తొలి క్యాబినెట్ భేటీలోనే రహస్యం నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలోనే రహస్యాలకు తెరతీసింది. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఇచ్చిన ఆర్డినెన్స్‌కు మంగళవారం నాటి క్యాబినెట్ భేటీలోనే ఆమోదం తెలిపినప్పటికీ ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచింది. క్యాబినెట్ సమావేశం అనంతరం న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ పోలవరంపై ఎలాంటి చర్చ జరుగలేదని స్పష్టం చేశారు. ఆ మరుసటిరోజే కేంద్రం కుట్ర బట్టబయలైంది.

బుధవారం ఉదయమే ఆర్డినెన్స్ కాపీ తమకు అందిందని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అంటే క్యాబినెట్ భేటీలో చర్చ జరిపి గోప్యంగా ఉంచారా? లేక చర్చించకుండానే ఆమోదించారా అన్నది అనుమానంగా మారింది. క్యాబినెట్ తొలి సమావేశం కాబట్టి అందులో చర్చించిన అన్ని అంశాలను మీడియాకు చెప్పటం సాధ్యం కాదని రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. పోలవరం గురించి మీడియా ప్రతినిధులు పదేపదే అడిగినా ప్రత్యేకంగా చర్చ జరగలేదు అని మాత్రమే సమాధానం చెప్పారు. దీన్ని బట్టి ఉద్దేశపూర్వకంగానే పోలవరం అంశాన్ని ఆయన గోప్యంగా ఉంచినట్లు అర్థమవుతున్నది.

ఆర్డినెన్స్‌పై ఇంత హడావిడేంది?: టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను మంగళవారం రాత్రి జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే ఆమోదించినట్లు తమవద్ద సమాచారం ఉందని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం చేయొద్దని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంటు సమావేశాల తర్వాతనే ఆమోదం తెలుపాలని కోరారు.

పార్లమెంటు సమావేశాలు జరగలేని ప్రత్యేక పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఆర్డినెన్స్ ద్వారా చట్టంలో మార్పులు చేర్పులు చేయటానికి వీలుంటుందని చెప్పారు. ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి తొందరపడి సంతకం చేయరనే తాము భావిస్తున్నామని తెలిపారు. జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు విడివిడిగా పని చేయడం ప్రారంభిస్తాయి కాబట్టి ఈ రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయడం, రెండు రాష్ర్టాల శాసనసభల సమావేశాల్లో చర్చించడం తదితరాలన్నీ జరిగిన పిదపనే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామిక పద్ధతులను పాటించినట్లవుతుందని అన్నారు. ఈ ఆర్డినెన్సుకు సంబంధించి కేంద్ర హోంశాఖ వర్గాలతో తాము సంప్రదింపులు జరిపామని, ఆర్డినెన్సుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు వచ్చిన వార్తలన్నీ నిజమేనని తెలిపారు.

ఆర్డినెన్స్‌పై వేడి రాజుకొంటున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం హడావుడిగా ఢిల్లీ బాటపట్టడం పలు అనుమానాలకు తావిస్తున్నది. తెలంగాణను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం మనసు మార్చుకోకుండా ఒత్తిడి తెచ్చేందుకే ఆయన హస్తిన ఆగమేఘాలమీద హస్తిన చేరుకొంటున్నట్లు సమాచారం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.