Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నేను ప్రజల ఏజెంటును

-ఆర్థికవృద్ధి రేటులో దేశంలోనే నంబర్‌వన్
-తలసరి విద్యుత్ వినియోగంలోనూ మొదటిస్థానం
-నాలుగున్నరేండ్ల కఠోరశ్రమతో దీన్ని సాధించాం
-సర్వేలన్నీ టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని చెప్తున్నయి
-టీడీపీ గెలుపుతో తెలంగాణకు నష్టం
-ప్రజా ఆశీర్వాదసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
-ఉమ్మడి నల్లగొండలో ఉరిమిన కేసీఆర్
-పేగులు తెగేదాక పోరాడి రాష్ట్రం సాధించాం
-దాని అభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్నం
-ప్రధానమంత్రి సైతం పచ్చి అబద్ధాలు చెప్పడం బాధాకరం
-ఫెడరల్‌ఫ్రంట్ ప్రతిపాదించినందుకే ఆ రెండు పార్టీలకు వణుకు
-ఈ ఎన్నికల తర్వాత ఢిల్లీకి పోతే కాంగ్రెస్, బీజేపీని చీల్చిచెండాడుత
-58 ఏండ్లలో టీడీపీ, కాంగ్రెస్ ఏం చేశాయి?
-నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ పాలన ఎలా ఉన్నది?
-తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటేయాలి
-గింతమందా ఒక్క కేసీఆర్‌ను కొట్టడానికి?
-పజల ఆశీర్వాదం ఉందన్న ఈర్ష్యతోనే దాడి
-నన్ను కాపాడవలసింది ప్రజలే

తాను తెలంగాణ ప్రజల ఏజెంటునని, రైతులు, పేదల ఏజెంటునని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. తాను కాంగ్రెస్ ఏజెంటునని ప్రధాని మోదీ, తాను బీజేపీ ఏజెంటునని రాహుల్‌గాంధీ అంటున్నారన్న సీఎం.. ఎవరికో ఏజెంటుగా ఉండాల్సిన ఖర్మ తనకు పట్టలేదని చెప్పారు. పేగులు తెగేదాక పోరాడి రాష్ట్రం సాధించామని, దానిని అభివృద్ధి చేయటానికి కష్టపడుతున్నామని అన్నారు. ప్రజలకోసం పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. కులవృత్తులను ఆదుకుంటున్నామని చెప్పారు. అమెరికావంటి దేశాలతో పోటీపడే బలమైన జనరేషన్‌ను తయారుచేస్తున్నామని చెప్పారు. అందుకే అన్ని వర్గాలవారికి రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి, అక్కడ చదివే ఒక్కో విద్యార్థిపై ఏటా 1.20 లక్షలు ఖర్చు పెడుతున్నామని వివరించారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మంచి జనరేషన్.. బలమైన జనరేషన్ రావాలి. అది రాష్ట్రానికి మంచిది. ఫ్యూచర్ తెలంగాణ జనరేషన్‌ను అభివృద్ధి చేస్తున్నం అని సీఎం తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలుచేసిన పథకాలు ప్రజల కండ్లముందే ఉన్నాయన్నారు. 58 ఏండ్లు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ హయాంలో కరంటు పరిస్థితి ఎలా ఉందో.. నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో ఎలా ఉన్నదో ఆలోచించాలని ప్రజలను కోరారు. గొప్ప రాష్ర్టాలుగా చెప్పుకొనే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ర్టాల ఆర్థిక వృద్ధిరేటు రెండంకెలు దాటలేదన్న సీఎం.. సొంత ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు ఆర్థిక వృద్ధిరేటులో 17.17% తో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా ఉన్నదని చెప్పారు.తలసరి విద్యుత్ వినియోగంలోనూ దేశంలో మనదే మొదటిస్థానమన్నారు. ఇదంతా సాధించడానికి నాలుగేండ్లు కఠోర శ్రమతో పనిచేశానని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు అన్నీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. ప్రజాస్వామ్యంలో నిజమైన పరిణతి ఉంటే.. ఎన్నికల్లో గెలువాల్సింది పార్టీలు, అభ్యర్థులు కాదని, ప్రజలు, ప్రజల అభీష్టం గెలువాలని అన్నారు. అప్పుడే తదుపరి ఐదేండ్లు ప్రజాకార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని చెప్తున్నాయన్న సీఎం.. జనమా.. ప్రభంజనమా అన్నట్టు సాగుతున్న ప్రజా ఆశీర్వాదసభలను చూస్తుంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని తెలిసిపోతున్నదన్నారు. సోమవారం సత్తుపల్లి, మధిర, కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాదసభల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

నేను తెలంగాణ ప్రజల ఏజెంటును
కేసీఆర్ కాంగ్రెస్ ఏజెంట్.. వాళ్లిద్దరూ ఒక్కటే అని ప్రధానమంత్రి అంటడు. కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చి కేసీఆర్ నరేంద్రమోదీ ఏజెంట్ అంటడు. మరి నేను ఎవరి ఏజెంట్ అన్నట్టు? నాకెవ్వని ఏజెంటుగా ఉండే కర్మ లేదురాబై.. నేను బాజాప్తాగా మా తెలంగాణ ప్రజల ఏజెంట్‌ను తప్ప ఎవ్వరీ ఏజెంటును కాదు అని చెప్పిన. మరి కేసీఆర్‌ను చూస్తే ఈ రెండు పార్టీలకు వణుకు ఎందుకు? ఎందుకంటే.. కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి రావాలని కేసీఆర్ ప్రతిపాదిస్తున్నడు. నాకు హిందీ బాగా వస్తది. ఈ ఎన్నికల తర్వాత నేను ఢిల్లీకి పోతే ఇద్దర్నీ చీల్చిచెండాడుత. దానికోసమని వాళ్లు కేసీఆర్‌ను ఇక్కడికే పరిమితం చేయాలన్న దుర్మార్గమైన ఆలోచనతో ఈ ఆరోపణలు చేస్తున్నరు. అలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఎన్నిరోజులు చేస్తారు? ఇంకా ఎంతకాలం ఈ లంగా రాజకీయాలు నడుస్తయి ఈ దేశంలో? 70ఏండ్లు కాంగ్రెస్, బీజేపీలు ఏం వెలగబెట్టినయి?వీడు వాడిమీద, వాడు వీడిమీద ఎన్నాళ్లు ఆరోపణలు చేసుకుంటరు? దేశంలో సమస్యలు తీరవు.. దళితులు బాగుపడరు.. దరిద్రం పోదు.. గిరిజనులు బాగుపడరు.. బీసీలు పైకిరారు.. రైతులు చాలా దారుణమైన బాధలు ఎదుర్కొంటుంటారు! దేశానికి భగవంతుడు 70వేల టీఎంసీల నీళ్లు ఇచ్చాడు. అనేక జీవనదులున్నయి. కానీ ప్రజలకు మంచినీళ్లు లేవు, రైతులకు సాగునీళ్లు లేవు. 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉంటే మనం వాడుకుంటున్నది 30వేల టీఎంసీలు మాత్రమే. ఉన్న వనరులను వాడుకునే తెలివిలేదు. రైతులకు నీళ్లు ఇచ్చే తెలివిలేదు. దీర్ఘకాలిక దృష్టిలేదు. దేశంలో కోట్ల ఎకరాల బంజరుభూములున్నయి. దిక్కులేక, గతిలేక ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. దేశంలో 70ఏండ్లు పాలించిన

కాంగ్రెస్, బీజేపీ ఒకడిమీద మరొకడు ఆరోపణలు చేసుకుంటూ తమాషా చేసి దేశ ప్రజలను ఏమార్చుతున్నరు. మోసంచేస్తున్నరు. మనకు హిమాలయాల అవతల చైనా దేశం ఉంది. 25ఏండ్ల కింద వాళ్లు మనకంటే దరిద్రులు. ఈరోజు అమెరికా తర్వాత ప్రపంచాన్ని శాసించే రెండో ఆర్థికశక్తిగా, బలమైన దేశంగా చైనా ఎదిగింది. మరి వాళ్లు ఎట్లా బాగుపడ్డరు? అందుకే ఈ రాహుల్‌గాంధీ.. తోకగాంధీలు కాదు.. ఈ నరేంద్రమోదీ, అమిత్‌షాలు కాదు మన దేశానికి కావాల్సింది. అందరి గురించి ఆలోచించే ప్రభుత్వం రావాలి.

ఒక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింతమందా!
ఒక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఎంతమందండీ? నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, సీపీఐ, సీపీఎం, వీళ్లమీద పెచ్చుకు చంద్రబాబు! గింతమందా ఒక్క కేసీఆర్‌ను కొట్టడానికి? తెలంగాణ ప్రజల ఆశీర్వాదం నాకు ఉందన్న ఈర్ష్యతోని ఇంత మంది దాడి చేస్తావున్నరు. నన్ను కాపాడవలసింది మీరే.

అగ్రకుల పేదపిల్లలకూ రెసిడెన్షియల్ స్కూళ్లు
రెసిడెన్షియల్ స్కూళ్లలో మైనార్టీ పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నరు! లంబాడా, బీసీలు, దళితుల పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నరు! నా మీద పంచాయితీ ఇప్పుడు! రెడ్లు, వైశ్యులు.. మాకు గురుకులాలు పెట్టవా? మాలో పేదలు లేరా? అంటున్నరు. పేదరికం ఏ కులానికైనా ఒక్కటే. అందరినీ దహించివేస్తుంది. వెలమలు, రెడ్లు, వైశ్యులు, బ్రాహ్మణులు.. ఇలా పేదలు ఎవరైనా తప్పకుండా రెసిడెన్షియల్ స్కూళ్లు పెడతాం.

మన లారీల పర్మిట్ ఒప్పుకోకపోతే ఆంధ్రా లారీలను రానియ్యం
మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడలో సిమెంట్ పరిశ్రమలు, రైస్‌మిల్లులు ఉండటంవల్ల లారీ సింగిల్ పర్మిట్లు కావాలని ఇబ్బంది పెడ్తున్నరని చెప్పిండ్లు. ఆంధ్రాకుపోతే వాళ్లు సతాయిస్తున్నరని చెప్పిండ్లు. ఒక్కటే నెలలోపట మీ సమస్య పరిష్కరిస్త. మంచి మాటతోని ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్త. మీ బండి మాకు రావాలన్నా.. మా బండి మీకు రావాలన్నా మర్యాదగా ఉండాలని చెప్తం. పర్మిట్‌కు ఒప్పుకుంటే మంచిమాట.. లేకపోతే ఆంధ్రా లారీలు ఐదడుగులు కూడా రానియ్యం. మనది పోనిది.. వాళ్లది ఎట్లా రానిస్తం? ఇచ్చి పుచ్చుకోవాలె కదా! అవసరమైతే నేనే స్వయంగా ఏపీ సీఎంతోని, సీఎస్‌తోని మాట్లాడి లారీల పర్మిట్లు ఇప్పిస్త.

సర్వేలన్నీ టీఆర్‌ఎస్ వైపే
నిన్నటివరకు సుమారు నూరు నియోజకవర్గాలు తిరిగిన. ఏ సభలో చూసినా.. తండోపతండాలుగా ప్రజ లు వస్తున్నరు. నాలుగు సీట్లు ఎక్కువగనో తక్కువగనో ఎట్టిపరిస్థితుల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే గ్యారంటీగా వస్తదని ఇండియాటుడే, సీఎన్‌ఎన్ ఐబీఎన్ ఇట్లా.. ఆలిండియాస్థాయి పన్నెడు సంస్థలు సర్వేలు ప్రచురించినయి. మీరు అవన్నీ టీవీల్లో చూసిండ్రు.. నేను డబ్బా కొట్టుకోవడం కాదు. వందశాతం టీఆర్‌ఎస్ గెలుస్తుంది. అందులో అనుమానం లేదు.

టీడీపీ గెలుపుతో తెలంగాణకు నష్టం
ఈ ఎన్నికల్లో తప్పకుండా టీఆర్‌ఎస్ గెలువాల్సిన అవసరం ఉంది. టీడీపీ.. ఆంధ్ర రాష్ట్రంలోని పార్టీ. టీడీపీ గెలిస్తే మనకు నష్టం. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నరు. టీడీపీ వాళ్లు గెలిస్తే వాళ్లను అడ్డుపెట్టుకొని తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటాడు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి. మన బతుకు మనకు ముఖ్యం. వాళ్లను (టీడీపీ) గెలిపిస్తే మనది తెలివితక్కువతనం అవుతది. మన ప్రయోజనాలను దెబ్బకొట్టేవారిని గెలిపిస్తే మన కంటిని మన మే పొడుచుకున్నోళ్లం అవుతం. వివేచన, విజ్ఞతతో ఓటేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి. అందరం కలిసి అద్భుతంగా పనిచేసుకొని ముందుకుపోవాలి.

ప్రధాని అబద్ధాలు
డ్బ్భై ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో కూడా ప్రధానమంత్రులు సైతం పచ్చి అబద్ధాలు చెప్పడం బాధాకరం. నిజామాబాద్ సభలో మాట్లాడిన మోదీ.. తెలంగాణలో కరంటు సరిగా లేదన్నరు. తెలంగాణలో కరంటు ఎట్లుం ది? బాగుందా? (దీనికి ప్రజలు బాగుంది.. బాగుంది.. అంటూ ముక్తకంఠంతో నినదించారు) మరి మీరు బాగుందంటుంటే.. ఆయన లేదంటడు! ఎన్నికలు కాబ ట్టి ఎంత పచ్చి అబద్ధమైనా చెప్పవచ్చన్న ధోరణి.. చాలా దురదృష్టం. తెలంగాణలో అమలయ్యే అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలతో పోల్చితే బీజేపీ పాలించే 19 రాష్ర్టాల్లో పదిశాతం కూడా అమలుకావటం లేదు. పక్క రాష్ట్రం.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఉన్న మహారాష్ట్రలోని మన బార్డర్ జిల్లా నాందేడ్‌లోని ధర్మాబాద్ తాలూకాకు చెందిన 64 గ్రామాల సర్పంచ్‌లు మహారాష్ట్ర దరిద్రంగా ఉంది.. తెలంగాణలో బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నయి.. కాబట్టి మ మ్ముల్ని తెలంగాణలో కలుపండి అని డిమాండ్ చేశారు. అంటే ఏమి జరిగిందన్నట్లు? ఏది వాస్తవమన్నట్లు? నరేంద్రమోదీ మాట్లాడితే ఏది కరెక్టు అనుకోవాలె? మీరు పరిపాలించే రాష్ర్టాల్లో అలా ఉంటే, అం దుకు ఎన్నో రెట్లు అద్భుతంగా ఉన్న తెలంగాణకు వచ్చి అవాకులు, చెవాకులు పేలే పరిస్థితి. ఇదీ.. ఈ దేశంలో రాజకీయం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.