-నాలుగేండ్లలో సంక్షేమానికి ఇదే నిదర్శనం -ఇవి నియోజకవర్గ సభలా? జిల్లా సభలా? -సముద్రాన్ని తలపిస్తున్న నకిరేకల్ సభ -తెలంగాణను అమరావతికి గులాములు చేసే కుట్ర -వలస ఆధిపత్యం నుంచి తెలంగాణను రక్షించాలి -నకిరేకల్‌లో ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ -మళ్లీ గెలిస్తే వీరేంశంకు పెద్ద పదవి వస్తుందని వెల్లడి
ముసలివాళ్లు ఎంతో ప్రేమతో తనను తమ పెద్దకొడుకని ప్రేమతో చెప్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తమ పరిపాలనలో సంక్షేమం ఎంత అద్భుతంగా ఉన్నదో దీనిని బట్టే తెలుస్తున్నదని పేర్కొన్నారు. దేశం మొత్తాన్ని ఒప్పించి తెలంగాణ తెస్తే.. తెలంగాణను అమరావతికి తొత్తులు, గులాములు చేసే కుట్ర జరుగుతున్నదని హెచ్చరించారు. అట్ల తొత్తులుగా ఉండి పోదామా? తెలంగాణ సిద్ధంగా ఉన్నదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ ప్రమాదం నుంచి తెలంగాణను కాపాడేలా కొట్లాడాలని, తెలంగాణను వలస ఆధిపత్యం నుంచి రక్షించాలని పిలుపునిచ్చారు. బుధవారం నకిరేకల్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రెండు నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొని వస్తున్నాను. వీటన్నింటినీ చూస్తుంటే ఇవి నియోజకవర్గ సభలా లేక జిల్లా సభలా? అని ఆశ్చర్యం కలుగుతున్నది. దేవరకొండ వంటి మారుమూల ప్రాంతాల్లో మీ అంత మంది హాజరయ్యారు. ఇక నకిరేకల్‌లో సభ సముద్రంలా ఉంది. వీరేశం లక్ష మెజార్టీతో గెలిచిండని అనుకోవచ్చు. జాగ లేక ఓ పదివేల మంది రోడ్డుమీద ఉన్నారని ఎంపీ చెప్తుండు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారో.. ఆయన మాటల్లోనే..
దేశంలో ఎక్కడా లేని సంక్షేమం తెలంగాణలో 14 ఏండ్ల కఠోరశ్రమతో తెలంగాణ సాధించుకున్నాం. ప్రభుత్వం ఉండాలని మీరే దీవించారు. వీరేశంను ఎమ్మెల్యేగా గెలిపించారు. నాలుగేండ్లలో ఏం జరిగిందో మీ కండ్ల ముందుందుది. ఎవరైనా టీవీలవాళ్లు పోతే బాగా చెప్తున్నరు. కేసీఆరే నా పెద్దకొడుకు అని ముసలోల్లు ప్రేమతో అంటుండ్రు. ఎక్కడలేని సంక్షేమం చేశాం. పండుగలకు కులం, మతం లేకుండా ముందుకు సాగుతున్నాం. రైతాంగానికి కాంగ్రెస్, టీడీపీ అనేక ఇబ్బందులు కలిగించారు. పంటలు ఎండబెట్టారు. 6-7 మాసాల్లోనే అది పరిష్కరించిన. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా కంపెనీలు, రైతులకు 24 గంటలు లోవోల్టేజీ లేని మంచి కరంటు ఇచ్చినం. గతంలో సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వస్తే చిమ్మచీకటి అయితదని కర్రతో చూపించారు. ఆ కర్ర ఆయనకే ఎదురు తిరిగింది. మనకుకాదు.. ఆంధ్రోళ్లకే తెలివిలేదు. దేశమే ఆశ్చర్యపడుతున్నది ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? కాంగ్రెస్ పదేండ్ల పాలనలో ఇసుక ఆదాయం రూ.10 కోట్లలోపు మాత్రమే.
నాలుగేండ్ల తెలంగాణ పాలనలో ఇసుక ఆదాయం రూ.2,057 కోట్లు. కేసీఆర్ ఎక్కడ నుంచి తెచ్చిస్తడు ఇన్ని ఫించన్లు అని మొదట్లో అందరూ ఆశ్చర్యపోయిండ్రు. అగో ఈడి నుంచి తెస్తుండు! నోరు, కడుపుకట్టుకొని, పైరవీలకు ఆస్కారంలేకుండా కుంభకోణాలకు పాల్పడకుండా సంపద పెంచాం.. పంచుతున్నం. వీరేశం పట్టుబట్టి అయిటిపాముల, ఇతరచోట్ల పనులు చేయిస్తున్నడు. కాళేశ్వరం నుంచి బస్వాపూర్‌కు నీళ్లు వస్తాయి. 1.5 లక్షల నుంచి రెండు లక్షల ఎకరాలకు నీళ్లు పారుతయి. పంట కాలనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో ధనవంతులైన రైతులు తెలంగాణలో ఉన్నారని పేరురావాలి. కొత్తగా ఏర్పడిన చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయాల్సి ఉంది.
వీరేశం గెలిస్తే.. పెద్ద పదవి ఈ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగిరిపోయింది. లక్షఓట్ల మెజార్టీతో వీరశంను గెలిపించాలి. ఈసారి వీరేశం గెలిస్తే పెద్ద పదవి వస్తుంది. ఉద్యమంలో పనిచేసిన, నిజాయతీ కల్గిన, పట్టుదల ఉన్న వ్యక్తి. యువకుడు. కార్యం సాధించాలనే దక్ష, దీక్ష కలిగి ఉన్న నాయకుడు. అనేక కార్యక్రమాలు జరిగినాయి. రెండులక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే మూసీ ఉంది. బ్రాహ్మణవెల్లంల కాల్వవంటివాటి ద్వారా నీళ్లు వచ్చే మార్గాలున్నాయి. అయిటిపాముల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేసి నకిరేకల్, కట్టంగూరు మండలాలకు సాగునీరందించే బాధ్యత నేను తీసుకుంట. పనులు సంవత్సరంలో ప్రారంభిస్తాం. సంవత్సరంలోపు డిగ్రీకాలేజీ మంజూరు చేసే బాధ్యత కేసీఆర్‌ది.