రెవెన్యూ సమస్యలతో విసిగి వేసారిన రైతన్న మోము వికసించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ధరణీ’శకానికి నాంది పలికారు. ఏండ్ల తరబడి సాగుతున్న అక్రమాలు, అవకతవకలకు చరమ గీతం పాడారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో గురువారం ధరణి పోర్టల్‌ను పండుగ వాతావరణంలో ప్రారంభించారు. సీఎం కేసీఆర్ నోట ‘ధరణి’ సందేశం వినేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. అభిమాన నేతతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మోసాలకు ఆస్కారం లేని, పైరవీలతో పని లేని వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ భూమికి భద్రత కల్పించేందుకు కంకణబద్ధుడైన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

గిట్లాంటి రోజు వస్తదనుకోలే పట్వారీకి పైసలియ్యకుండ పట్టా తీసుకునే రోజు వస్తదనుకోలే. భూమి అమ్మేటాయన, కొనేటాయన, ఇద్దరు సాక్షులతో కలిసి పత్రాలు తీస్కపోతే నిమిషాల్లో పాసుబుక్కు చేతిల పెట్టుడంటే మాటలు కాదు. రైతులకు మేలు జరిగేదైతేనే కేసీఆర్ సర్ చేస్తడు. కేంద్రం పంట కొనం అంటే నేను కొంట అన్నడు. రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నడు. ఎవుసం మీద బతికే నాలాంటోడికి ఇంతకంటే ఏంజెయ్యాలి చెప్పు. జమాన్ల ఎప్పుడన్న గిట్లుండెనా? భూమి కొనాలన్నా, అమ్మాలన్నా మ్యుటేషన్‌కు దరఖాస్తు పెట్టుకుంటే ఫస్ట్ పట్వారీని కలవాలె. తర్వాత గిర్దావర్ చుట్టూ కాళ్లరిగేలా తిరగాలె. నాయబ్ తహసీల్దార్, తహసీల్దార్ కనికరిస్తే గానీ పట్టా చేతికొచ్చేది కాదు. అడిగినంత ఇయ్యకుంటే పని కాదు, పట్టా రాదు. ఏదో కిరికిరి పెట్టేటోళ్లు. ఇయ్యాల కేసీఆర్ సార్ చెప్పిండు. ఇంక పట్టాల కోసం ఎవ్వళ్లకీ పైసా ఇయ్యాల్సిన పని లేదు. సార్ రైతులకే కాదు, తెలంగాణ జనమంతటికీ మంచి చేస్తున్నడు. ఆయన సల్లంగుండాలె.
తెలంగాణ రెవెన్యూ చరిత్రలో గురువారం విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భూ క్రయవిక్రయాల్లో పారదర్శకత కోసం ఐటీ తోడైంది. చరిత్ర పేజీల్లో సువర్ణాక్షరాలతో లిఖించే రోజుకు మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి వేదికైంది. నవ శకానికి పునాది పడింది. భూ వివాదాలకు ఆస్కారం లేకుండా.. అత్యున్నత లక్ష్యానికి అనుగుణంగా రూపుదిద్దుకున్న ‘ధరణి’ ప్రారంభోత్సవం కనులపండువగా జరిగింది. గురువారం మధ్యాహ్నం 12.56 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోర్టల్‌ను ప్రారంభించారు. రైతులకు, ప్రజలకు విజయచిహ్నం చూపించి.. శుభాకాంక్షలు తెలిపారు.
మూడు చింతలపల్లికి ప్రత్యేక గౌరవం దక్కింది. యావత్ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ధరణి’ అంకుర్పాణకు వేదికైంది. మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. 12.36 గంటల సమయంలో మండల కేంద్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్ గ్రామ కూడలిలో తొలిదశ తెలంగాణ ఉద్యమ వీరుడు వీరారెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం 12.46 గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పూలబోకే అందించి స్వాగతం పలికారు. 12.51 గంటల నుంచి 12.54 గంటల వరకు మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, కలెక్టర్, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి లక్ష్మీపూజ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన వేదికపై 12.56 గంటలకు ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ప్రజలకు, రైతులకు అభివాదం చేస్తూ ..శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లింగాపూర్ తండా సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు.
సభ అనంతరం సీఎం కేసీఆర్ రైతులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వేడుకలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, మూసీ పరిరక్షణ సమితి చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్, అరెకపూడి గాంధీ, బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బోడుప్పల్ మేయర్లు జక్కా వెంకట్‌రెడ్డి, కావ్య, బుచ్చిరెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మర్రి రాజశేఖర్‌రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి , మున్సిపల్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో తరతరాలుగా ఉన్న అనేక భూ సమస్యలకు సీఎం కేసీఆర్ చెక్ పెట్టారని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో గతంలోనే భూ రికార్డుల నవీకరణ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అత్యంత సులువుగా మారిందని, నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పట్టాదారు పాసుపుస్తకాల జారీ విధానం దేశంలో మరెక్కడా లేదన్నారు.
గర్వంగా ఉంది సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను మా మండలం శామీర్‌పేట్‌లో తొలుత ప్రారంభించడం గర్వంగా ఉంది. ఇది ఎంతో సంతోషకరమైన రోజు. ఒక్క క్లిక్‌తో భూమి వివరాలు తెలుసుకునేందుకు పోర్టల్ అందుబాటులోకి రావటం గొప్ప విషయం. ఎప్పటి నుంచో రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తెస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే ఇప్పుడు చేసి చూపెట్టారు. తెలంగాణ సమాజంతో పాటు, ఎన్నారైలందరం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. – నరేందర్ రెడ్డి, దక్షిణాఫ్రికా
ప్రత్యేక ధన్యవాదాలు ధరణిని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. కరీంనగర్‌లో నాకున్న ఆస్తులను ఇక్కడి నుంచే చూసుకునే భాగ్యం కల్పించడం ఆనందాన్ని కలిగిస్తున్నది. న్యూజిలాండ్ సిటిజన్స్‌గా ఉన్నందుకు మాకు ఆధార్ లేదు. పోర్టల్‌లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి, సీఎం కేసీఆర్ ఈ సమస్యకు మంచి పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నా.- జగన్‌రెడ్డి వొడ్నాల, న్యూజిలాండ్
దూరదృష్టికి అభినందనలు సీఎం కేసీఆర్ దూరదృష్టితో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఒక అద్భుతం. అన్ని భూ సమస్యలకు ఇది ఏకైక పరిష్కారంగా నిలుస్తుంది. పోర్టల్‌తో అక్రమాలకు చరమగీతం పాడినట్టే. – రాజేశ్ రాపోలు, సిడ్నీ, ఆస్ట్రేలియా
ఎన్నారైలకు వరం విప్లవాత్మకమైన ధరణి పోర్టల్ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. సామాన్యులతో పాటు ముఖ్యంగా ఎన్నారైలకు ధరణి వరంగా మారబోతున్నది. విదేశాల్లో ఉంటున్న వారికి రాష్ట్రంలో ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం ఇక మీదట ఉండదు. ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలో మొట్టమొదటి ఆన్‌లైన్ సర్వీసును అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. – సత్య, లండన్
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ధరణి పోర్టల్ ప్రారం భం గురించి చాలా రోజుల నుంచి ఎదు రు చూస్తున్నాం. పోర్టల్‌లో ఉన్న ఫీచర్స్ అద్భుతం. పారదర్శకత పెరిగి, అవినీతి, అక్రమాలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
భూ సమస్యలు తొలగిపోతాయి.. తెలంగాణ ఎన్నారై సమాజం తరఫున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నాం. టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ గొప్ప అభివృద్ధి చెందుతున్నది. తాజా నిర్ణయంతో ధరణి శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. తెలంగాణలో ఎన్నో సివిల్ పంచాయతీలు ఉండేవి. ఈ చట్టం రావడం వల్ల భూ సమస్యలు తొలగిపోనున్నాయి. – వెంకట్రావ్, దక్షిణాఫ్రికా
రెవెన్యూ చరిత్రలో కొత్త శకం ధరణి పోర్టల్ ప్రారంభంతో రాష్ట్ర రెవెన్యూ శాఖ చరిత్రలోనే కొత్త శకం మొదలైంది. రైతులు, ప్రజల కష్టాలకు తెరపడింది. భూ వివాదాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపించారు. భూ యజమానులకు భద్రత, భరోసా ధరణితో దొరుకుతుంది. – మర్రి రాజశేఖర్ రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు