– పాఠశాలల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు – విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి – విద్యాశాఖ అధికారుల సమావేశంలో నిర్ణయాలు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థుల అభ్యసనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించనున్నామని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు. అందుకోసం ప్రతి జిల్లాకు ఇద్దరు రాష్ట్రస్థాయి అధికారులతో కమిటీలను నియమించామని చెప్పారు. ఈ కమిటీల్లో పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల పెంపుపై బుధవారం ఆయన తన కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. సమావేశం తర్వాత మంత్రి విలేకరులతో మాట్లాడుతూ నిరంతర పర్యవేక్షణ విధానం ఉపాధ్యాయులకు శిక్షణలో కూడా ఎస్‌సీఈఆర్‌టీకి ఉపయోగపడుతుందన్నారు. ఉపాధ్యాయుడు బోధించి పాఠాలు విద్యార్థులకు ఏ మేరకు అర్థమవుతున్నాయన్న అంశాన్ని పర్యవేక్షణ కమిటి పరిశీలిస్తుందని తెలిపారు. పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పలేని టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యార్థుల మానసిక, శారీరక ఎదుగుదలకు వ్యాయామ విద్య ఎంతో ముఖ్యమైనందున, పాఠశాలల్లో వ్యాయామ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని చెప్పారు. పీఈటీలకు శిక్షణ ఇవ్వటంతో పాటు వ్యాయామ విద్య పోస్టులకు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. – విద్యాశాఖ అదనపు డైరెక్టర్లు, సీనియర్ అధికారుల నేతృత్వంలో ఏర్పాటయ్యే పర్యవేక్షణ కమిటీలు నెలలో మూడునాలుగు రోజులు పాఠశాలలను సందర్శించాలి. ఉపాధ్యాయుల బోధనా విధానం, విద్యార్థుల అభ్యసనా స్థాయిలను అధ్యయనం చేయాలి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు నెలవారీ నివేదికలు సమర్పించాలి.
– వ్యాయామ, గేమ్స్, స్పోర్ట్స్ వంటిపైనా దృష్టి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తక్షణమే వ్యాయామ విద్య అందుబాటులోకి తెచ్చేలా అధికారులు కృషి చేయాలి.
– ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. దసరా సెలవుల తర్వాత ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. పాఠ్యపుస్తకాలలో మార్పులకు సంబంధించిన హ్యాండ్‌బుక్‌ను త్వరగా తయారుచేసి అన్ని పాఠశాలలకు సరఫరా చేయాలి. సమగ్ర విద్యా కేలండర్‌ను రూపొందించాలి.
– విద్యార్థుల సామర్థ్యం, పాఠశాలల పురోగతిపైనా పర్యవేక్షణ కమిటీ దృష్టి సారించాలి. అలాగే ప్రతి టీచర్, స్కూల్ సమర్ధ్యాన్ని కూడా అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయాలి. ప్రైవేటు స్కూళ్లలో విద్యా విధానాన్ని కూడా అధ్యయనం చేయాలి. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల విధానం ప్రకటించి వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.
– 2014-2015 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల గుర్తింపు ప్రక్రియను ఈ నెల 20లోగా పూర్తి చేయాలి.
– ఎస్‌సీఈఆర్‌టీ, డైట్, సీటీఈ అండ్ ఐఏఎస్‌ఈలను త్వరలో బలోపేతం కోసం అవసరమైన పోస్టులు భర్తీ .
– సర్వశిక్షా అభియాన్ పరిధిలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాలను (కేజీబీవీ) గురుకుల విద్యాలయాల పరిధిలోకి తెచ్చేందుకు తక్షణమే చర్యలు.
ప్రభుత్వ స్కూళ్ళతో అంగన్‌వాడీల అనుసంధానం కేజీ టు పీజీ ఉచిత విద్యను అందచేయడంలో భాగంగా అంగన్‌వాడి పాఠశాలలను ప్రభుత్వ స్కూళ్ళతో అనుసంధానం చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నర్సరీ నుంచి విద్యార్థులను తీర్చిదద్దేందుకు 3 వ ఏటనే అడ్మిషన్ విధానాన్ని అమలుచేసే విషయం ఆలోచిస్తున్నామన్నారు. దేశంలోనే రోల్ మోడల్‌గా ఉండేవిధంగా ఉచిత విద్యను అందించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.