ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధులు నాలుగు చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో నిన్న వరంగల్ ఎన్నిక ఏకగ్రీవమైపోగా, తాజాగా ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలు కూడా అదే బాటపట్టాయి. వరంగల్ జిల్లా నుంచి ఇతర అభ్యర్ధులు నామినేషన్లు ఉపసంహరించుకావడంతో టిఆర్ఎస్ అభ్యర్ధి కొండా మురలి ఏకగ్రీవంగా ఎమ్మెల్సిగా ఎన్నికయ్యారు.

అదే విధంగా మెదక్,ఆదిలాబాద్,నిజామాబాద్ జిల్లాలో కూడా ఇతర పార్టీ మరియు ఇండిపెండెంట్లు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టిఆర్ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎమ్మెల్సిగా ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ స్థానానికి పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థి నారాయణరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి రియాజుద్దీన్ శుక్రవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో అక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న పురాణం సతీశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది.

మరోవైపు మెదక్ స్థానానికి పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థి బాల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్‌పాటిల్ కూడా నామినేషన్లు ఉపసంహరించుకుంటూ పోటీ నుంచి వైదొలిగారు. దీంతో ఇక్కడ కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి వెన్నవరం భూపాల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నిజామాబాద్ స్థానానికి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోగా, స్వతంత్ర అభ్యర్థి బత్తిని జగదీశ్ అదే బాటపట్టారు. దీంతో ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆర్ భూపతిరెడ్డి ఎన్నిక కూడా ఏకగ్రీవం కానుంది.