-ఖరీఫ్‌లోనే సాగునీటికి చర్యలు.. మూసీ నీటిని వృథాకానివ్వం -డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రత్యేక సర్కిల్ -జిల్లా ప్రాజెక్టులపై సమీక్షలో మంత్రి హరీశ్‌రావు -పెండింగ్ పనులు, అధికారుల పని తీరుపై ఆగ్రహం -హాజరైన మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి

నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా నీటిపారుదలశాఖ అధికారులు పెండింగ్ పనులన్నింటినీ సకాలంలో పూర్తిచేసి ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలిఅని అధికారులను భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి డిండి, ఇతర ప్రాజెక్టులతోపాటు మార్కెటింగ్, టిపారుదల శాఖలపై నాలుగు గంటలపాటు సమీక్షించారు. ఆయా శాఖల్లో ప్రభుత్వ నిధుల కేటాయింపు, పనుల ప్రగతి, పెండింగ్ పనులపై సమీక్షించారు. డిండి ప్రాజెక్టు నిర్మాణానికి 28 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉన్నదని, ప్రధానంగా ఐదు రిజర్వాయర్ల పరిధిలో 15 వేల ఎకరాలు, 92 కిమీ ప్రధాన కాల్వ పరిధిలో 12 వేల ఎకరాల భూసేకరణ చేస్తే మేజర్ సమస్య పరిష్కారమవుతుందన్నారు. దీనికోసం డిండి ప్రాజెక్టుకు ప్రత్యేక సర్కిల్ ఏర్పాటు చేసి ఇద్దరు ఎస్‌డీసీలను కేటాయించనున్నట్లు తెలిపారు. డిండి ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధిచి వారానికోసారి సమీక్ష నిర్వహించి పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని జేసీ సత్యనారాయణను ఆదేశించారు. జిల్లాలోని వేలాది ఎకరాలకు నీరందించే మూసీ కాల్వల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిలాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి కాల్వల పనులు ఏ మేరకు పూర్తయ్యాయి? ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. చిత్తశుద్ధితో పనిచేసి త్వరితగతిన పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆ దేశించారు. మూసీ ప్రాజెక్టు నుంచి వృథాగా వెళ్తున్న నీటిని ఎలా ఉపయోగించు కోవాలనే అంశంపై పూర్తిస్థాయిలో ఆరా తీసి.. డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించారు.
83 కిలోమీటర్ల పొడవుతో 80వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించనున్న ఏఎమ్మార్పీ వరద కాల్వ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మొత్తంగా 200 ఎకరాల తక్కువ భూసేకరణను సమస్యగా చూపి..పనులు ఆలస్యం చేయరాదని హెచ్చరించారు. ప్రధాన కాల్వ కింద మాడ్గులపల్లితోపాటు డీసీల కింద భూములు కోల్పోయే వారికి భూ సేకరణ చట్టమే కాకుండా ప్రత్యేకంగా డబ్బులు చెల్లించే ఏర్పాటు చేయాలన్నారు. త్వరగా నివేదిక పంపిస్తే ఆమోదిస్తామన్నారు. నెలరోజుల్లోనే వరద కాల్వ పూర్తి చేసి 80 వేల ఎకరాలకు ఈ సీజన్‌లోనే నీళ్లు అందించాలని ఆదేశించారు. పంప్‌హౌస్ నిర్మాణం వద్ద ఉన్న సమస్యను పూర్తి చేయాలని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ నుంచి రూ.115 కోట్లు రావాల్సి ఉందని, వాటిని తెప్పించి దేవాలయాల పునరుద్ధరణ, లిప్టు పనులు చేయడంతోపాటు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలను అభివృద్ధి పరచాలని సూచించారు. వారంలో లోయర్ డిండికి శంకుస్థాపన చేస్తామని, అప్పుడు ఎస్‌ఎల్‌బీసీపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
మార్కెటింగ్, నీటిపారుదలశాఖలపై సమీక్ష: రానున్న రోజుల్లో ప్రతి మండలానికో సబ్‌మార్కెట్ నిర్మించి, అక్కడే ధాన్యాన్ని నిల్వ చేసుకునేలా గోదాములు నిర్మిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. అన్నిమండల కేంద్రాలకు 5 కిమీ దూరంలో ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామన్నారు. నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్ కాకతీయ కింద తొలి విడతగా గుర్తించిన అన్ని చెరువుల కట్టల మీద ఈత చెట్లు నాటి గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని, లేదంటే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీటిపారుదల ఎక్సైజ్, రెవెన్యూ అధికారులు శాఖకు ఒకరు చొప్పున ముగ్గురు ఒక కమిటీగా ఏర్పడి ఈత చెట్లను వెంటనే నా టించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. మిషన్ కాకతీయలో జిల్లాకు రూ.317 కోట్లు కేటాయించినా ఎందుకు పనులు వేగవంతం చేయడలేదని ఆగ్రహించారు. సాగర్ డ్యామ్ నిర్వహణ పేరుతో 40ఏండ్లుగా కరెంట్ బిల్లుల రూపంలో కోట్లు దుర్వినియోగం అవుతున్నాయని, తగ్గించాలని సూచించారు.
పనులు వేగవంతం చేయాలి: మంత్రి జగదీశ్‌రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులన్నీ వేగవంతం చేస్తేనే రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. చందుపట్ల పెద్దచెరువు పనుల్లో జాప్యం చేయడం సరికాదని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నందున 60 సీ ద్వారా మరో కాంట్రాక్టర్‌కు అవకాశమిచ్చి పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ దృష్టి పెట్టిన ఈ చెరువు పనులపై జాప్యం సరికాదన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, పూల రవీందర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జేసీ సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.