Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నల్లగొండ ఖిల్లాపై గులాబీ జెండా అఖండ విజయమే

-పోరుగడ్డ తన చైతన్యాన్ని ప్రదర్శించాలి
-మూడు లక్షలకుపైగా మెజారిటీ ఖాయం
-కాంగ్రెస్‌లో జోష్ లేదు.. బీజేపీకి హోష్‌లేదు
-హుషారుగా ఉన్నది టీఆర్‌ఎస్ సైనికులే
-కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశంలో ఇంకా సమస్యలు
-ఇద్దరే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్
-16 మంది ఎంపీలతో ఢిల్లీలో ఏం చేయగలడో చూపెడతం
-నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి టీఆర్‌ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఖిల్లాలో గులాబీ జెండా అఖండ విజయం సాధిస్తుందని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావు తేల్చిచెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ ఖిల్లా మీద గులాబీ జెండా ఎగురవేశామని, అదే స్ఫూర్తితో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకుల అకుంఠిత దీక్షతో నల్లగొండ పార్లమెంట్ స్థానాన్ని సైతం మూడు లక్షలకుపైగా మెజారిటీతో గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తంచేశారు. సాయుధ పోరాటానికి పురిటిగడ్డ, చైతన్యానికి చిరునామా అయిన పూర్వ నల్లగొండ జిల్లాకు కొత్తగా ఏ రాజకీయమూ చెప్పాల్సిన అవసరం లేదన్న కేటీఆర్.. పోరుగడ్డ తన చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన సందర్భం వచ్చిందని అన్నారు. శనివారం నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి టీఆర్‌ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేండ్ల కేసీఆర్ పాలనను, అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసిన రాష్ట్ర ప్రజలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని 50% ఓట్లతో దీవించారని చెప్పారు. ఫలితాల అనంతరం కాంగ్రెస్ నైరాశ్యంలో కూరుకుపోయిందన్నారు. 119 స్థానాల్లో పోటీచేసిన బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్ గల్లంతయిందని చెప్పారు. ఇక టీడీపీ తట్టాబుట్టా సర్దుకొని అమరావతికి పోయిందని ఎద్దేవాచేశారు. నల్లగొండ జిల్లాకే చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ప్రస్తుత పీసీసీ చీఫ్ నాయకత్వంలో మళ్లీ ఎన్నికలకు పోతే మరో ఓటమి తప్పదని చెప్పటాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ లేదని ఆయనే చెప్పారని పేర్కొంటూ.. ఆయన చెప్పింది వాస్తవం. కాంగ్రెస్‌లో జోష్ లేదు. బీజేపీకి హోష్ లేదు. రాష్ట్రంలో చైతన్యవంతంగా, హుషారుగా ఉన్నది టీఆర్‌ఎస్ సైనికులు మాత్రమే అని అన్నారు.


టీఆర్‌ఎస్ గెలిచే స్థానాలు కీలకం
ఏవో అద్భుతాలు జరుగుతాయని 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపిస్తే.. ఆయన మాటలు, నినాదాలకే పరిమితమయ్యారు తప్ప.. ఎక్కడా అభివృద్ధి కనిపించలేదని కేటీఆర్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏ సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటుచేసే పరిస్థితి లేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిచే 16 స్థానాలు అత్యంత కీలకంగా మారుతాయని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 71 ఏండ్లయినా ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయంటే ఇన్నేండ్లూ దేశాన్ని నడిపిన కాంగ్రెస్, బీజేపీయే అందుకు కారణమని కేటీఆర్ స్పష్టంచేశారు. మళ్లీ వాళ్లే ముందుకొచ్చి అయితే మోదీ, లేకుంటే రాహుల్ అని చెప్తూ.. మూడో కూటమి రాకుండా ఆడుతున్న నాటకాన్ని దేశప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.


టీఆర్‌ఎస్‌కే ఎక్కువ జాతీయభావాలు
జాతీయపార్టీల కంటే ఎక్కువ జాతీయభావాలు టీఆర్‌ఎస్‌కే ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సైనికులు చనిపోతే.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించినంత గొప్పగా మరే ముఖ్యమంత్రీ స్పందించలేదు. దాడి జరిగిన తర్వాత దేశం, దేశ ప్రజలు బాధలో ఉంటే మనం రాజకీయాలు మాట్లాడటం మంచిదికాదని.. కార్యక్రమాలన్నీ రద్దుచేసుకున్నం. నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ ఒక్కరోజు కూడా ఆగకుండా రాజకీయాలుచేశారు అని విమర్శించారు.


క్రమశిక్షణతో పనిచేయాలి
ఎంపీ స్థానంలో మూడు లక్షల ఓట్ల ఆధిక్యం సాధిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు బూత్‌స్థాయిలో పట్టుదలతో, నిబద్ధతతో, కసితో పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అందరూ ఐక్యంగా పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని చెప్పారు. ఎక్కడివాళ్లు అక్కడే కథానాయకులై 70% పైగా ఓట్లు వేయిస్తే మూడు లక్షల మెజారిటీతో నల్లగొండ పార్లమెంట్ ఖిల్లా మీద గులాబీ జెండా ఎగురుతుందన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీల్లో వ్యత్యాసం ఉన్నదన్న కేటీఆర్.. దేవరకొండలో 38 వేలు, కోదాడలో వెయ్యి మాత్రమే వచ్చిందని, రేపటి ఎన్నికల్లో దాన్ని సవరించుకోవాలని సూచించారు. మిర్యాలగూడలో 30 వేలు, నల్లగొండలో 25 వేల వరకు వచ్చిందని, మిగతాచోట్ల అనుకున్నంతగా రాలేదని గుర్తుచేశారు. హుజూర్‌నగర్, సూర్యాపేట, కోదాడ, సాగర్‌లలో కూడా బూత్‌స్థాయిలో గట్టిగా పనిచేస్తే మూడు లక్షల మెజారిటీ సాధ్యం అవుతుందన్నారు. రాష్ట్రంలో అందరూ మనవాళ్లేనన్న కేటీఆర్.. గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అడగాలని సూచించారు.

అభ్యర్థిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎవరిని నిలబెట్టినా.. కేసీఆర్‌కే ఓట్లేస్తున్నాం అనే సంగతి గుర్తుకు పెట్టుకోవాలని విజ్ఞప్తిచేశారు. మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, రమావత్ రవీందర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్‌కుమార్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ పార్లమెంటరీ టీఆర్‌ఎస్ ఇంచార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జి శానంపూడి సైదిరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు చాడ కిషన్‌రెడ్డి, నిరంజన్ వలీ, తేరా చిన్నపరెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, కంచర్ల కృష్ణారెడ్డి, సోమా భరత్‌కుమార్, లింగంపల్లి కిషన్‌రావు తదితరులతోపాటు వివిధ నియోజకవర్గాల నుంచి సుమారు 25 వేల మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంచనాలకు మించి సమావేశం విజయవంతం కావడంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

పదహారుమంది గులాబీ సైనికులు ఢిల్లీలో ఉంటే..
పక్కనే నాగార్జునసాగర్ ఉన్నా రెండోపంటకు నీళ్లు ఇచ్చుకోలేని దుస్థితి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నెలకొందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. పూర్వ నల్లగొండ జిల్లాలో నక్కలగండి, డిండి, ఎస్సారెస్పీ ఫేజ్-2, లిఫ్టుల ద్వారా జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలంచేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేలకోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నారని చెప్పారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి గజ్వేల్‌కు వచ్చిన ప్రధానికి విషయాలన్నీ సీఎం కేసీఆర్ వివరించి, కాళేశ్వరం, పాలమూరు పథకాల్లో ఒకదానికి జాతీయహోదా అడిగితే.. మోదీ ముసిముసిగా నవ్వుతూ వెళ్లిపోయారని విమర్శించారు. అదే పదహారుమంది గులాబీ సైనికులు కేంద్రంలో ఉంటే.. వాళ్ల మీద ఆధారపడే ప్రభుత్వమే ఢిల్లీలో ఉంటే.. మన ప్రాజెక్టులకు జాతీయహోదా తన్నుకుంటూ రాదా? అని ప్రశ్నించారు. 16 మంది ఎంపీలతో కేసీఆర్ ఏం చేయగలడని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారన్న కేటీఆర్.. మా నాయకుడు కేసీఆర్ మొనగాడు. ఇద్దరే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్.. 16 మంది ఎంపీలతో ఢిల్లీలో ఏం చేయగలుగుతడో చూపెడతం. ఎంతమంది ఉన్నమన్నది కాదు. ఉన్నవాళ్లు ఏం చేస్తున్నారన్నది ముఖ్యం అని రిటార్టిచ్చారు. కాళేశ్వరం ద్వారా నల్లగొండ జిల్లాలో కరువు ఛాయలు తొలిగించి, ఫ్లోరోసిస్ మహమ్మారిని చరిత్రపుటలకు పరిమితం చేయబోతున్నామని చెప్పారు. డిండి ద్వారా మునుగోడు, దేవరకొండ సస్యశ్యామలం కానున్నాయన్నారు. లిఫ్టుల ద్వారా మిర్యాలగూడ, సాగర్ సహా జిల్లా మొత్తం మూడు పంటలకు కృష్ణా, గోదావరి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉన్నదని చెప్పారు.

టీఆర్‌ఎస్‌కే ఎక్కువ జాతీయభావాలు
జాతీయపార్టీల కంటే ఎక్కువ జాతీయభావాలు టీఆర్‌ఎస్‌కే ఉన్నాయి. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సైనికులు చనిపోతే.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా స్పందించారు. దాడి జరిగిన తర్వాత దేశ ప్రజలు బాధలో ఉంటే రాజకీయాలు మాట్లాడటం మంచిదికాదని.. కార్యక్రమాలన్నీ రద్దుచేసుకున్నం. మోదీ, రాహుల్ ఒక్కరోజు కూడా ఆగకుండా రాజకీయాలు చేశారు.
– కేటీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

నల్లగొండ, భువనగిరిలో మూడేసి లక్షల మెజారిటీలు
నాలుగున్నరేండ్ల కేసీఆర్ పరిపాలన నల్లగొండ జిల్లాకు కొత్త రూపాన్ని చూపించింది. అయిదారుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు చేయని అభివృద్ధి నాలుగున్నరేండ్లలోనే జరిగింది. పార్టీలకు అతీతంగా సాగిన పరిపాలన ప్రజలు చూశారు కాబట్టే మేమే సీఎంలం అని పోజులు కొట్టినవాళ్లందరినీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటికి సాగనంపారు. ప్రతిభను చాటుకున్నందునే యువనేత కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. నల్లగొండ, భువనగిరి స్థానాలను రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం.
– జీ జగదీశ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి

మరోమారు ఉద్యమపార్టీ అభ్యర్థులకే పట్టం
అప్పట్లో ప్రధాని నెహ్రూకన్నా ఎక్కువ మెజారిటీ గొప్ప చరిత్ర కలిగిన నల్లగొండలో రావి నారాయణరెడ్డికే దక్కింది. అలాంటి నల్లగొండ నుంచి మరోసారి ఉద్యమపార్టీ అభ్యర్థికే విజయం చేకూర్చాలి. వార్డు సభ్యుడి నుంచి పార్లమెంట్ వరకు ఎదిగేలా చేసిన ఉమ్మడి జిల్లా ప్రజలకు రుణపడి ఉంటా. నల్లగొండ పార్లమెంట్ నుంచి టీఆర్‌ఎస్ తరపున పోటీచేసే అభ్యర్థి ఎవరైనా రెండు లక్షల పైచిలుకు మెజారిటీ సాధించేలా కార్యకర్తలు కృషిచేయాలి.
– గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ, నల్లగొండ

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.