మోదీ నియోజకవర్గం వారణాసిలో బస్సుల దహనం, బీహార్ డిప్యూటీ సీఎం ఇంటిపై, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిపై దాడి, రైల్వే పోలీసులపై రాళ్లు రువ్వుతున్న యువకులు, తగులబడుతున్న రైళ్లు, కొనసాగుతున్న ఉద్రిక్తత, నిస్సహాయంగా పోలీసులు, మొహం చూపని బీజేపీ నాయకులు, మాటపడిపోయిన ప్రధాని … ఇదీ ప్రస్తుతం దేశంలోని పరిస్థితి.
అగ్నిపథ్ రద్దు కోరుతూ నిరుద్యోగ యువత చేస్తున్న ఆందోళనలతో భారత్ భగ్గుమంటున్నది. ‘మోదీ ప్రభు త్వ అనాలోచిత నిర్ణయం వల్ల అగ్రహోదగ్రులైన యువత’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నయి. తమను ఎవరూ అడిగేవారు, ప్రశ్నించేవారు లేరన్న అహంకారం. తల బొప్పికట్టినంక రైతు చట్టాలను ఉపసంహరించిన్రు కానీ, ఆ చట్టాల కూర్పు సమయంలో, వాటి ప్రకటన సమయంలో, ఏడాదిపాటు జరిగిన నిరసనలను అణచివేస్తున్న సమయంలో కూడా బీజేపీ ప్రభుత్వ తీరు తమను ప్రశ్నించేవారు లేరనే. 20-25 ఏండ్ల వయసున్న, భావోద్వేగులైన యువతను ‘దేశం కోసం- ధర్మం కోసం’ అంటూ మాయలో పడవేస్తూ, దొడ్డిదారిన దేశాన్ని అమ్మిపారేసే పనిలో బిజీగా ఉన్న నలుగురు గుజరాత్ ముఠా సభ్యులకు నేడు అదే యువకులు ‘ఇక చాలు మీ వంచనాత్మక చేష్టలు..’ అన్న హెచ్చరికే ‘అగ్ని’ నిరసనలు.
నాలుగేండ్ల పాటు సైన్యంలో కాంట్రాక్టు పద్ధతిన పని చేయించుకొని విసిరికొట్టే దుర్మార్గ విధానం ‘అగ్నిపథ్’. ఇది అటు సైన్యానికీ, ఇటు యువతకూ అవమానం. యువత ఆగ్రహానికి బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా అట్టుడుకుతూ ఉంటే కేంద్ర పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదు. అందుకే యువత తిరుగుబాటును ప్రతిపక్షాల రాజకీయంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నరు.
సికింద్రాబాద్ స్టేషన్‌లో ఆందోళన చేస్తున్న ఒక యువకుడి మాటలు… ‘మా వెనకాల ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ స్టూడెంట్ యూనియన్ లేదు, మా కడుపు మండి రోడ్ల మీదికి వచ్చినం’ అన్నడు. మరో యువకుడు ‘ఇది టీఆర్‌ఎస్ పార్టీ చేపిస్తున్నదని బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అంటున్నరు.
భారతీయులు గర్వించే ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్-జై కిసాన్’ అంటే, భారతీయులు గర్హించే మోదీ ‘నై జవాన్- నై కిసాన్’ అంటున్నరు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయబూనుకున్నట్టే, సైన్యాన్ని కూడా ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా తన అనుంగు అదానీకి సైన్యాన్ని అప్పజెప్పడు అన్న గ్యారెంటీ ఏమీ లేదు. తన మిత్రుడికి కాంట్రాక్ట్ ఇప్పించమని శ్రీలంక ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన మోదీ మన దేశానికే కళంకం!
టీఆర్‌ఎస్ పైన తిరుగుబాటు అయితే మేం బయట చేస్తుంటిమి, రైల్వేస్టేషన్‌లో కాదు. ఇది కేంద్రం మీద మా యుద్ధం’ అన్నడు. మరొక యువకుడు ‘బండి సంజయ్ ** పగులగొట్టాలె’ అంటూ ఇక్కడ రాయలేని భాషలో ఆగ్రహం వ్యక్తపరిచిండు! ‘నలుగురు బీజేపీ ఎంపీలున్నరు, అందులో ఒకరు కేంద్రమంత్రి. ఆ నలుగురికీ ఫోన్ చేసినం, ఎవరూ ఎత్తలేదు. ట్విట్టర్‌లో కూడా పెట్టినం.మా పరీక్ష గురించి పార్లమెంటులో మాట్లాడండి అంటే ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని మరో బిడ్డ ఆవేదన! రైల్వే పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మరణం దురదృష్టకరం. ఇది మోదీ చేసిన హత్య. అందుకు ఎక్స్‌గ్రేషియా సహా, బీజేపీ పదవీచ్యుతియే సరైన న్యాయం!
యువతకు దన్నుగా నిలబడటం రాజకీయం అయితే, కచ్చితంగా అలాంటి రాజకీయం చేయాల్సిందే. దుర్మార్గ రాజకీయమే సమస్యకు కారణమైనప్పుడు, పరిష్కారం కూడా ధర్మాగ్రహమే! అది సన్మార్గమే!
యువత ఆగ్రహంతో ఏం అర్థం అవుతున్నది?
హిందువులు, ముస్లింలు, రోహింగ్యాలు, పాకిస్థానీలు అంటూ పబ్బం గడుపుకొనే వారి ఆటలు ఇంక చెల్లవని అర్థమయితున్నది.
రైతులకు వ్యవసాయం తెలువదు, యువతకు ఉద్యోగాల గురించి తెలువదు, పేదలకు పైస విలువ తెలువ దు, సదాచారపరాయణులకు పౌరాణికేతిహాసాలు తెలియవు, అన్నీ తమ వాట్సాప్ యూనివర్సిటీలకే తెలుస్తయనే తెంపరితనం ఇక నడువదని అర్థమైతున్నది.
తమ దుర్మార్గాలను ప్రశ్నించిన వారిపై దేశద్రోహ ముద్ర వేయడం ముందు ముందు సాధ్యం కాకపోవచ్చని అర్థమైతున్నది.
రైతు చట్టాలపై క్షమాపణలతో సమసిపోయింది. ‘అగ్నిపథ్’ విషయంలో క్షమాపణ చాలదు, బీజేపీని గద్దె దింపుడే పరిష్కారమని అర్థమైతున్నది.
‘ఈవెంట్స్ అయిపోయి, మెడికల్ టెస్టులు అయిపోయి, రాతపరీక్ష కోసం మేం ఎదురుచూస్తుంటే, రెండేండ్లలో పదకొండు సార్లు వాయిదా వేసిన్రు. రెండు సార్లు హాల్‌టికెట్ ఇచ్చి కూడా పరీక్ష పెట్టలేదు. ఇప్పుడేమో అవన్నీ రద్దు చేసి, కేవలం నాలుగేండ్లు మాత్రమే మీకు ఉద్యోగం ఇస్తాం’ అంటున్న రు. దీన్ని మేం ఒప్పుకోం, ‘అగ్నిపథ్’ను రద్దు చేసే దాకా ఊరుకోం అన్నడు మరొక బిడ్డ. ‘భారత్‌మాతా కీ జై’ అంటూనే మోదీ సర్కారుపై నిరసనలు చేస్తున్నరు. ఇది కదా దేశభక్తి!
‘దేశం కోసం ప్రాణాలు అర్పించేవారు సైనికులు. మనం కంటినిండా నిద్రపోతున్నమంటే కారణం సైనికులు’ అంటూ ఊదరగొట్టే మోదీ పరివార్.. నేడు సైన్యం లో పనిచేయబోయే యువత పట్ల క్రూర పరిహాసం చేయ డం సిగ్గుచేటు. గతంలో నిరసనలు జరిగినపుడు ‘మీరు ముసుగులు వేసుకున్నా నేను గుర్తుపడుతా. మీరు వేసుకున్న బట్టలను చూసి మీరెవరో చెప్పగలను’ అని మాట్లాడిన మోదీ నేడు కండ్లు తెరిచి చూస్తే బైర్లు కమ్మే నిజం కనిపిస్తది. ప్రపంచంలో భారత్‌ను తలెత్తుకు నిలబడేలా చేయగలిగే ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగి ఉన్న’ వివేకానందుని వారసులైన యువతను రోడ్డున పడేయటం శోభస్కరమా?
ఉద్యోగార్థుల మీద కాల్పులు జరపడం, కేసులు పెట్ట డం, మరణశిక్ష కూడా ఉండొచ్చని భయపెట్టడం బీజేపీ నీతి. మీరు కటింగ్ చేయొచ్చు, బట్టలుతకొచ్చు, పకోడీలు అమ్మొచ్చు, బీజేపీ ఆఫీసుల దగ్గర సెక్యూరిటీ గార్డులుగా ఉండొచ్చు అంటూ దేశ యువతను క్రూరంగా పరిహసించడం బీజేపీ అరాచకం.
ఉద్యోగార్థులకు శిక్షణ ఇవ్వడం, భోజన వసతి కల్పించడం, వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకోవటం, ఈ దేశ మానవ సంపదకు దన్నుగా ఉండటం టీఆర్‌ఎస్ బాధ్యత. జవాన్లకూ, కిసాన్లకూ, యువతకూ తమ భవిష్యత్తుపై దేశ భవిష్యత్తుపై నమ్మకం కలిగించే టాస్క్‌ఫోర్స్ ఇపుడు అవసరం. ఆ టాస్క్‌ఫోర్స్ పేరే కేసీఆర్. దేశాన్ని అమ్మే స్తూ, ప్రజలను ముంచేసే మోదీకీ, కేసీఆర్ కు ఉన్న గుణాత్మక తేడా ఇదే.
మోదీకి ఇచ్చే పిలుపు ఒకటే… ‘Enough is enough. Now, get Lost’. హిందీలోనే అర్థమైతది కాబట్టి అనువాదం కూడా: బహుత్ హోగయా. అబ్ దఫా హోజావో!
జై తెలంగాణ! జై భారత్!!
వ్యాసకర్త: శ్రీశైల్‌రెడ్డి పంజుగుల