Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నడిగడ్డ గోస పోవాలె పాలమూరు పచ్చబడాలె

-20 లక్షల ఎకరాలకు సాగునీరందించి తీరుతాం.. -మరో 119 బీసీ గురుకులాలు ప్రభుత్వ పరిశీలనలో మండలానికో బీసీ గురుకులం -గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన -నల సోమనాద్రి పథకంగా నామకరణం -రాష్ట్రంలో యజ్ఞంలా ప్రాజెక్టుల పనులు -కోటి ఎకరాల మాగాణమే మా లక్ష్యం ప్రాజెక్టులపై రాజకీయమే ఇతర పార్టీల పని -అడ్డుకునేందుకు స్టేలు తెస్తున్న ఇతర పార్టీలు -అటువంటివారి వల్లే పాలమూరుకు ఈ గతి -రాష్ట్రాన్ని పంట కాలనీలుగా మార్చేందుకు కృషి -ఎక్కడా లేనివిధంగా 42 వేల కోట్లతో సంక్షేమం -టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే భవిష్యత్తులో ఇంకా మంచి జరుగుతుంది -లక్ష మందితో కిక్కిరిసిన గద్వాల సభా ప్రాంగణం

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను యజ్ఞంలా చేపడుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రాజెక్టులన్నా తెలంగాణ ప్రజల సమస్యలన్నా రాజకీయం చేయడమే లక్ష్యంగా ఇతర పార్టీలు పెట్టుకున్నాయని, అందుకే వేగంగా జరుగుతున్న ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లి సమస్యలు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతకాలం కరువుతో అల్లాడిన పాలమూరు జిల్లాలో ఇటువంటి పార్టీల నాయకులు ఉండటం ఇక్కడి ప్రజల దురదృష్టమని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి పాలమూరు రెండేండ్లలోనే పచ్చబడాలని, నడిగడ్డ గోస తీరాలని అన్నారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరందించి, తూర్పు గోదావరిని మించిన ప్రాంతంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు గుర్తింపు తెస్తామని స్పష్టంచేశారు.

మన దగ్గర నుంచి కర్నూలు, కర్ణాటక ప్రాంతాలకు వలస పోవడం కాకుండా అక్కడి నుంచి పాలమూరుకు సేద్యం పనులకు అక్కడివారు వలస వచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే గట్టు ఎత్తిపోతల పథకానికి పెంచికలపాడులో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపనచేశారు. అనంతరం గద్వాల పట్టణంలో నిర్వహించిన సభకు హాజరైన లక్షమందికిపైగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రాజెక్టుకు నల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకంగా నామకరణం చేస్తున్నట్టు సభాముఖంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులన్నా, ప్రజల సమస్యలన్నా కొన్ని పార్టీలకు రాజకీయమని, కానీ, టీఆర్‌ఎస్‌కు మాత్రం అదొక యజ్ఞమని చెప్పారు. రాష్ట్రం సాధించుకోవడం ఒక టాస్క్‌గా ఎలా పెట్టుకున్నామో, సాధించుకున్న రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించటం కూడా యజ్ఞంలా తీసుకుని పనిచేస్తున్నామని ఉద్ఘాటించారు.

పోరాటంతోనే రాష్ర్టాన్ని సాధించామని, చివరికి చావునోట్లో తలకాయ పెట్టేవరకు వెళ్లిన తాను రాష్ట్రం అభివృద్ధి సాధించే వరకు నిద్రపోనని చెప్పారు. దసరా పండుగ నాటికి తుమ్మిళ్ల ప్రాజెక్టును పూర్తిచేయాలని, గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఆరునెలల్లో ఓ రూపానికి తేవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నడిగడ్డ ప్రాంతం నదుల నీటితో సస్యశ్యామలం అవుతుందన్నారు. తాను కూడా కాపునేనని, 60 ఎకరాల్లో మక్కజొన్న వేశానని చెప్పిన సీఎం.. రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా రైతు పక్షాన నిలబడ్డాననితెలిపారు. ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ సాకారమైంది. కచ్చితంగా తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందేవరకు యజ్ఞం కొనసాగుతుంది అని చెప్పారు. యువమంత్రి హరీశ్‌రావు, మం త్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి రాత్రుళ్లు ప్రాజెక్టుల వద్ద పండుకుని మరీ దగ్గరుండి కట్టిస్తున్నారని ప్రశంసించారు. గతంలో జరిగిన పనులు, ఇప్పుడు జరుగుతున్న పనులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

పంటపెట్టుబడితో పేద రైతుకే మేలు రైతుబంధు పథకంతో పేద రైతులకే మేలు కలుగుతుందని కేసీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణలో బడా భూస్వాములు లేరు. రైతుబం ధు పథకంవల్ల పేద రైతులకే మేలు జరిగింది. భూములున్న రైతులు కూడా పట్టణాలకు వలసవెళ్లే పరిస్థితి మనది. పాలమూరు జిల్లాలో బీడు భూములను చూసి కండ్లల్లో నీళ్లు తిరిగేవి. ఆ దుఃఖం తీరాలి అని ఆయన చెప్పారు. ఇదే జిల్లాలో పుట్టినటువంటి సన్నాసులు చిల్లర రాజకీయాలకోసం ప్రాజెక్టుల మీద కేసులు పెట్టి స్టేలు తెస్తున్నారు. ఇలాంటి దరిద్రులు పుట్టారు కాబట్టే పాలమూరుకు ఆ గతి పట్టిందని నేను అందుకే అసెంబ్లీలో చెప్పిన. ఈ రోజు వారి భరతం పడితేనే పాలమూరు బాగుపడుతుంది అని సీఎం అన్నారు.

పట్టాబుక్కుల్లో రైతు పేరే ఉంటుంది రైతులకు ఏ కష్టం రాకూడదనే భూరికార్డులు ప్రక్షాళన చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే పట్టాదార్ పాస్‌పుస్తకాల్లో కేవలం రైతు పేరు మాత్రమే చేర్చామని తెలిపారు. పట్టాదార్ పుస్తకాల్లో రైతు పేరే ఉండాలా? అని సభకు హాజరైన ప్రజలను సీఎం ప్రశ్నించగా.. అవును.. అంటూ ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో బదులిచ్చారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌వంటి ప్రాంతాల్లో ఖరీదైన బంగ్లాలు కిరాయికిస్తుంటారు. వాటి పత్రాల్లో అనుభవదారు పేరు రాద్దామా? మరి రైతుల పట్టాల్లో అనుభవదారుల పేర్లెందుకు? రైతులంటే అంత అగ్గువా? అని కేసీఆర్ నిలదీశారు. పట్టాదార్ పాస్‌పుస్తకంలో రైతు పేరు ఉంటుందని, ఆ రక్షణ రైతుకు ఉండాలని ఆయన స్పష్టంచేశారు. పంట పెట్టుబడిని పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉన్న రైతులకే ఇస్తామని స్పష్టంచేసిన సీఎం.. కౌలుదారులకు ఇచ్చేది లేదని పునరుద్ఘాటించారు. పంట పెట్టుబడి పథకం కోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించామని, దీనితో రైతుల్లో భరోసా ఏర్పడిందని చెప్పారు. ప్రతి రైతుకు మూడు నాలుగు లక్షలు అప్పులు ఉంటాయన్న సీఎం.. వారి అప్పులు తీరి, వారి జేబుల్లో మూడు నాలుగు లక్షలు మిగిలినప్పుడే అది బంగారు తెలంగాణ అవుతుందని ప్రజల హర్షధ్వానాల మధ్య చెప్పారు. అందుకే ఉచిత కరంటు, ఎరువులు, విత్తనాల సమస్యల నివారణ, పంట పెట్టుబడి పథకం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు.

ప్రతి పెద్ద గ్రామంలో గోదాం గతంలో మండలానికి ఒక గోదాం కూడా ఉండేది కాదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 23 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించామని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి పెద్ద గ్రామంలో ఒకటి చొప్పున గోదాములు నిర్మిస్తామని ప్రకటించారు.

పంటకాలనీలుగా రాష్ట్రం రాష్ర్టాన్ని పంట కాలనీలుగా మార్చేందుకు కృషిచేస్తున్నామని సీఎం తెలిపారు. ఇప్పటిదాకా తెలంగాణలో ఎక్కడ ఏ పంటలు పండుతాయో? ఎక్కడి ప్రజలు ఏం తింటారో లెక్కల్లేవని అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఆయా ప్రాంతాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్‌లో డిమాండ్ ఉండే పంటలు పండించాలని చెప్పారు. అందరూ ఒకే పంటవేసి దెబ్బతినకుండా వచ్చే ఏడాదినుంచి అధికారులు మార్గదర్శనం చేస్తారని తెలిపారు. దేశంలోని మిగిలిన 28 రాష్ర్టాలు తెలంగాణను చూసి నేర్చుకునేలా రాష్ట్రం ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను ఇతర రాష్ర్టాలకు చెందిన వారు వచ్చి చూసిపోతున్న సంగతిని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రంలో కాకతీయుల వైభవం రావాలని పిలుపునిచ్చారు. నాటి కాకతీయ రెడ్డిరాజులు రాష్ట్రంలో 60 వేల చెరువులను నిర్మించారని, వారిని ఆదర్శంగా తీసుకుని మిషన్‌కాకతీయ చేపట్టి, చెరువులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

42 వేల కోట్లతో సంక్షేమం చరిత్రలో ఎక్కడా లేనివిధంగా 42 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి/షాదీముబారక్, దవాఖానల్లో చనిపోతే భౌతికకాయాలను గౌరవంగా ఇండ్లకు చేర్చడం తదితర కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. 42 వేల కోట్లతో సంక్షేమం జరుగుతున్నది. 25 వేల కోట్లతో రైతాంగాన్ని ఆదుకుంటున్నాం. 96 వేల కోట్లతో విద్యుత్‌రంగాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. కోటీ పది లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు 1.80 లక్షల కోట్లతో మిషన్ కాకతీయ, ఇతర ప్రాజెక్టులు చేపడుతున్నాం అని సీఎం వివరించారు. తక్కువ జీతాలు పొందుతున్నవారికి జీతాలు పెంచిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఎంతో క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పనిచేస్తున్నందుకు మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. త్వరలోనే మిషన్‌భగీరథ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మన పథకాలను చూసి కేంద్ర మంత్రులే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే భవిష్యత్తులో ఇంకా మంచి జరుగుతుందని చెప్పారు.

పచ్చదనంతోనే భవిష్యత్తు తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. పచ్చదనం పెరిగితేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఇప్పటికీ ఉపయోగపడుతున్న చెరువులు తవ్వించినందుకు శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయుల గురించి చెప్పుకొంటున్నామన్న సీఎం.. టీఆర్‌ఎస్ పార్టీ గురించి భవిష్యత్తు తరం చెప్పుకొనేలా ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని చెప్పారు.

విమర్శించినవారే చీకట్లో మగ్గుతున్నారు వివిధ సంక్షేమపథకాలను అమలుచేస్తూ రాష్ట్రంలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ వస్తే కరంటు ఉండదని ఎద్దేవా చేసిన సంగతిని గుర్తుచేస్తూ.. నేడు తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతుంటే.. విమర్శించిన వాళ్లకే చీకట్లు అలుముకున్నాయన్నాయని ఎద్దేవాచేశారు. ప్రపంచంలోనే రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. ఆ పథకాన్ని అదేవిధంగా కొనసాగిస్తామని తెలిపారు.

వారంలో పాలమూరు ప్రజాప్రతినిధులతో భేటీ ఇప్పటికే వివిధ ప్రాజెక్టులకు దాదాపు 70 టీఎంసీల వరకు నీటిని జూరాల నుంచి వాడుకుంటున్నామన్న సీఎం.. జూరాలపైనే మళ్లీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా ఏర్పాటుచేయాలని అవగాహన లేకుండా వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేయడం విడ్డూరమన్నారు. భవిష్యత్‌లో పాలమూరుకు ఎలాంటి సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, మరో వారంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించబోతున్నానని సీఎం వెల్లడించారు.

మన దగ్గరకే వ్యవసాయ పనులకు రావాలి ఉమ్మడి పాలమూరు రెండేండ్లలోనే పచ్చబడాలని సీఎం అన్నారు. 20 లక్షల ఎకరాలకు సాగు నీరందించి, తూర్పు గోదావరిని మించిన ప్రాంతంగా జిల్లాకు గుర్తింపు తెస్తామని స్పష్టంచేశారు. మన దగ్గర నుంచి కర్నూలు, కర్ణాటక ప్రాంతాలకు వలస పోవడం కాకుండా అక్కడి నుంచి పాలమూరుకు సేద్యం పనులకు అక్కడివారు వలస వచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు.

మరో 119 బీసీ గురుకులాలు రాష్ట్రంలో మరో 119 బీసీ గురుకులాలను ఏర్పాటుచేస్తామని సీఎం ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇవి అమలులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలోని 584 మండలాల్లో మండలానికో బీసీ గురుకులం ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్న సీఎం.. ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉందని వెల్లడించారు. రాష్ర్టాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్తూ.. దళితులు, గిరిజనుల కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ, గురుకులాలను ఏర్పాటుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 1.05 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నదని తెలిపారు.

నడిగడ్డ కేరింత దాదాపు లక్షమంది హాజరైన నడిగడ్డ ప్రగతిసభ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. కేసీఆర్ ప్రసంగం కొనసాగినంత వరకు ప్రజలు హర్షాధ్వానాలు చేస్తూనే ఉన్నారు. అనుకున్నదానికంటే ఎక్కువమంది రావడంతో ఇతర పార్టీలు భయపడ్డాయి. గద్వాల జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఊహించని రీతిలో ప్రజలు సభకు తరలివచ్చారు. ఇప్పటికే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతుండటం, వెనుకబడ్డ గట్టు ప్రాంతానికి మరో భారీ సాగునీటి ప్రాజెక్టును అందివ్వడంతో నడిగడ్డవాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వీటితోపాటు గద్వాల అభివృద్ధికి జోరుగా వరాలు కురిపించడంతో సభకు హాజరైన జనం కేరింతలతో జై కొట్టారు. గద్వాలకు 300 పడకల దవాఖాన, సీఎం నిధుల నుంచి గద్వాల అభివృద్ధి పనులకు రూ.100 కోట్లు, జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్, కేటీదొడ్డి మండలానికి గిరిజన గురుకులం, గట్టు మండలానికి బీసీ గురుకులం, గుర్రంగడ్డకు రూ.పది కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ మంజూరు చేయడంతో ప్రజలు పట్టలేని ఆనందంలో మునిగిపోయారు. గట్టు ఎత్తిపోతల పథకానికి గద్వాల సంస్థానాధీశుడు నల సోమనాద్రి పేరు పెట్టడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.ఈ సభలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, ఎమ్మెల్సీలు కూచికుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, చిట్టెం రామ్మోహన్, గువ్వల బాలరాజు, రాజేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి పీ రాములు, మాజీ ఎమ్మెల్యేలు అబ్రహాం, ఎడ్మ కిష్టారెడ్డి, జైపాల్‌యాదవ్, గట్టు భీముడు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి రైతుకు మూడు నాలుగు లక్షలు అప్పులుంటాయి. వారి అప్పులు తీరి, వారి జేబుల్లో మూడు నాలుగు లక్షలు మిగిలినప్పుడే అది బంగారు తెలంగాణ అవుతుంది. పాలమూరు జిల్లాకు కర్నూలు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూలీలు రావాలి తప్ప.. మనం కూలి చేయడానికి బయటకు పోవద్దు. అలాంటి పాలమూరు కావాలి.రైతుకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే పట్టాదార్ పాస్‌పుస్తకాల్లో కేవలం రైతు పేరు మాత్రమే చేర్చాం. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌వంటి ప్రాంతాల్లో ఖరీదైన బంగ్లాలు కిరాయికిస్తుంటారు. వాటి పత్రాల్లో అనుభవదారు పేరు రాద్దామా? మరి రైతుల పట్టాల్లో అనుభవదారుల పేర్లెందుకు? రైతులంటే అంత అగ్గువా? – ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.