Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నమ్మిన బాటలో నడిచిన..జాతి రత్నం

-దేశ సంస్కర్తగా నరసింహావతారం
-పీవీ నరసింహారావు 360 డిగ్రీల పర్సనాలిటీ
-ఆయన నిరంతర సంస్కరణశీలిగా ఉండేవారు
-ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని ఎదిగిన ధీశాలి
-కుల, ధనబలం లేకుండా రాజకీయాల్లో మెరిశారు
-నేటి దేశ ఆర్థిక ప్రగతికి ఆయనే కారణభూతుడు
-పీవీ కాలంలోనే బీసీలకు రాజకీయ ప్రోత్సాహం
-అందుకే పీవీ మన తెలంగాణ ఠీవి: సీఎం కేసీఆర్
‌ -పీవీకి భారతరత్న ఇవ్వాలి
-పార్లమెంట్‌లో ఆయన చిత్రపటం పెట్టాలి
-ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయాలి
-రాష్ట్రంలో 5 కాంస్య విగ్రహాలు
-జ్ఞానభూమిలో స్మృతిచిహ్నం
-హెచ్‌సీయూ పేరు మార్పుపై కేంద్రానికి లేఖ
-పీవీ శతజయంతి ఉత్సవాల్లో సీఎం కే చంద్రశేఖర్‌రావు
-జ్ఞానభూమిలో ఘనంగా కార్యక్రమం
-రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు

అతనొక గొప్ప, నిరంతర సంస్కరణశీలి. ఒక నాయకుడిగా సంస్కరణలు చేయడానికి కూడా ధైర్యం ఉండాలి. వాటి వల్ల వచ్చే విమర్శలను తట్టుకోగలిగే ధైర్యం ఉండాలి. కేంద్రంలో విద్యాశాఖ ఉండేది. ఈ పేరు సరైందికాదని దాన్ని మానవవనరుల అభివృద్ధి శాఖగా మార్పించారు. జైళ్ల శాఖ అప్పగిస్తే అక్కడా సంస్కరణలు చేపట్టి ఓపెన్‌ జైల్‌ కాన్సెప్ట్‌ తెచ్చారు. ఏ స్థాయిలో ఉన్నా సంస్కరణలు చేయడమే పనిగా పెట్టుకునే వారు. మీకు మళ్లీ హెచ్చార్డీ దక్కే అవకాశం లేదని ఒకరంటే పీవీ చెప్పిన జవాబేమిటో తెలుసా! ‘పర్వాలేదు.. నాకు మత్స్యశాఖ ఇచ్చినా అక్కడా సంస్కరణలు తీసుకొస్తానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వేల్‌లో రెసిడెన్షియల్‌ స్కూల్‌ను స్థాపించి గురుకుల విద్యకు నాంది పలికారు. కేంద్రంలో ఉన్నప్పుడు నవోదయ పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఆయన తీసుకొచ్చిన గురుకుల విద్య.. నేడు విద్యావ్యవస్థకే తలమానికం. అందుకే తెలంగాణ ప్రభుత్వం పీవీ ఆశయం కోసమే కొత్తగా 900 గురుకులాలను ఏర్పాటు చేసింది.

– ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది 360 డిగ్రీల వ్యక్తిత్వమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పీవీ మన తెలంగాణ ఠీవి అని, ఆయనో నిరంతర సంస్కరణశీలి అని కొనియాడారు. నమ్మిన వాదానికి కట్టుబడి.. తన వ్యక్తిత్వాన్ని, విజ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని ఎదిగిన ధీశాలి అని ప్రశంసించారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఆదివారం పీవీ శతజయంతి ఉత్సవాలను సీఎం ప్రారంభించారు. ఏడాది పొడుగునా పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముందుగా సీఎం కేసీఆర్‌ పీవీ సమాధి వద్దకు వెళ్లి పుష్పాంజలి ఘటించారు.

అనంతరం కొవిడ్‌ నిబంధనల ప్రకారం జరిగిన సభలో మాట్లాడుతూ.. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం అసెంబ్లీలో, రాష్ట్ర క్యాబినెట్‌లో తీర్మానం చేసి తానే స్వయంగా ప్రధాని వద్దకు వెళ్లి కోరుతానని తెలిపారు. పార్లమెంట్‌లో పీవీ చిత్రపటం పెట్టాలని చెప్పారు. రాష్ట్రంలో పీవీతో అనుబంధం ఉన్న ఐదు ప్రదేశాల్లో ఆయన కాంస్య విగ్రహాలు ఆవిష్కరిస్తామని తెలిపారు. శాసనసభలో కూడా పీవీ భారీ చిత్రపటాన్ని ఏర్పాటుచేయాలని స్పీకర్‌ను కోరారు. పీవీ ఏ పదవిలో, ఏ స్థాయిలో ఉన్నా సంస్కరణలే లక్ష్యంగా పనిచేసే వారని అన్నారు. రాష్ట్రంలో సీఎం హోదాలో భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి.. ముందు తన భూమినే పేదలకు పంచిన నిజాయితీపరుడని తెలిపారు. అందుకే పీవీ మన తెలంగాణ ఠీవీ అని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డకు ఒక ప్రధానిగా దక్కాల్సిన గౌరవం దక్కలేదని, అందుకే ఆ గౌరవం కల్పించేలా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇంకా సీఎం మాట్లాడుతూ… ‘పీవీ నరసింహారావు గురించి ఇదీ అదీ అని చెప్పడానికి సాహసం కావాలి. పీవీ గురించి ఒక్క మాటలో చెప్పాలటే 360 డిగ్రీల పర్సనాలిటీ ఆయనది. అద్భుతమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. ఆయన వ్యక్తిత్వ పటిమ.. ఆయనకు ఆయనే సృష్టించుకున్న గరిమ. ఆయన గురించి వర్ణించడానికి మాటలు చాలవు. ప్రస్తుతం పీవీ శతజయంతి ఉత్సవాలు చేయడం, ఇంత ప్రాధాన్యం అవసరమా? అనే సందేహాలు వచ్చాయి. ఉత్సవాలు అవసరమే. నిన్నటి గతమే నేటి చరిత్ర. ఒక గొప్ప తెలంగాణ బిడ్డ.. ప్రపంచానికే సేవ చేసిన వ్యక్తిని గుర్తు చేసుకోవాలి. ఆయన గురించి ప్రపంచానికి తెలియజేయాలి. అందుకే ఈ ఉత్సవాలు. ఈ రోజు నాకు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉన్నది.

లుక్‌ ఈస్ట్‌ అని పిలుపునిచ్చారు
పీవీ ఇంగ్లిషులో కొత్త సామెత తీసుకొచ్చారు. తూర్పుదిక్కున ఉన్న దేశాలను పట్టించుకోని ప్రపంచానికి ‘లుక్‌ టూ ఈస్ట్‌’ అని పిలుపునిచ్చారు. మాకు సంస్కారం, చరిత్ర, సంస్కృతి, గొప్ప వైవిధ్యం ఉన్నాయి.. అని చాటిచెప్పారు. పాశ్చాత్య ప్రపంచమంతా తూర్పు వైపు చూసేలా చేశారు. ఇంకొకరికైతే సాధ్యమయ్యేది కాదు. నిశ్చల, గంభీరమైన వ్యక్తి పీవీ. నమ్మినదాన్ని చేసుకుంటూ ముందుకు పోయేవారు. పీవీ ప్రధాని అయ్యేనాటికి దేశ గమ్యం అంధకారమై ఉంది. మన బంగారాన్ని ఇతర దేశాల బ్యాంకుల్లో పెట్టి పరువు నిలబెట్టుకుంటున్న క్లిష్ట సమయంలో ప్రధాని పదవి చేపట్టారు. ఆయనేమీ ముఠాలు గట్టి ప్రధాని పదవి సాధించుకోలేదు. ఆయనను వరించి వచ్చిన అవకాశం అది. అప్పటివరకు రాజకీయాల్లో లేని ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌ను ఆర్థికమంత్రిని చేసి, ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. మనం అనుభవిస్తున్న ఆర్థిక స్వేచ్ఛ, పొందిన ఆర్థిక పరిణతికి ప్రధాన కారణభూతుడు పీవీ. దేశం ఆర్థిక కష్టాలు గట్టెక్కి ప్రపంచంతో పోటీపడేస్థాయికి ఎదిగిందంటే ఆయన చలవే. ప్రైవేటురంగం ప్రభుత్వరంగంతో, ప్రభుత్వరంగం ప్రైవేటుతో పోటీపడే ఆర్థిక సృజనకు ఆద్యుడు. ఆయన ఏదైనా ప్రతిపాదిస్తే సీఎంలు కూడా భయపడాల్సిన పరిస్థితి.

ఏ పోరాటమైనా నాయకత్వం ఆంధ్రులది.. చచ్చేటొళ్లు మనోళ్లు. గొప్పపని చేసినోళ్లు మనోళ్లే. కానీ అన్ని రకాల తెలంగాణ ప్రభలు, ప్రతిభలు మసకబారినై.. అవన్నీ బయటకు తీయాలె. తెలంగాణ భవిష్యత్‌తరాలకు అందించాలె. పీవీది మహోజ్వల చరిత్ర. ఆసక్తిగలవారు పీవీ మీద ‘360 డిగ్రీస్‌ పర్సనాలిటీ’ పేరుతో పుస్తకమే రాయొచ్చు. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వ పటిమను పెంపొందించుకొనేందుకు పీవీ చరిత్ర ఒక గైడ్‌లా నిలుస్తది.

దక్కాల్సిన గౌరవం దక్కలేదు
తన గ్రామం నుంచి రాష్ట్రం, దేశం, మొత్తం ప్రపంచానికే విజ్ఞానాన్ని అందించిన మహోన్నత వ్యక్తి పీవీ. అలాంటి గొప్ప వ్యక్తికి లభించాల్సినంత గౌరవం దక్కలేదు. అనేక కారణలున్నాయి. ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఎవరికో భయపడి కాదు. అందరికీ తెలుసు. అవసరమైన సందర్భంలో చెప్తాం. చేయాల్సినవారు చేయకపోవడం వల్ల మనం రాష్ట్ర ప్రభుత్వం తరపున మన బిడ్డ పీవీ పేరు ప్రఖ్యాతులను ప్రపంచవ్యాప్తం చేస్తున్నాం. గొప్ప వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రతీక పీవీ. ఆయనకు కుల బలం, గొప్పగా ధనబలం లేదు. మరి సీఎం ఎట్లా అయ్యారు? కేంద్రమంత్రి.. ప్రధాని ఎట్లా అయ్యారు? ఆయన జీవితంలో ఎప్పుడూ ఎక్కడా భయడే పని చేయలేదు. ఆత్మవిశ్వాసం, విజ్ఞానం, అనుభవమే ఆయనను అంచెలంచెలుగా ఎదిగేలా చేసింది. అన్నింటినీ మించి ఇందిర వంటి నాయకురాలు క్లిష్ట సమయంలో పిలిచి మాట్లాడే స్థాయికి ఎదగడంతోపాటు ఆమె అంతరంగికుల్లో ఒకరిగా మారే స్థాయి వచ్చిందంటే ఆయనకు గల వాక్‌శుద్ధి, చిత్తశుద్ధే కారణం. పీవీ తాను చేసిన ప్రతిపనిలో జీవించేవారు.

సీఎం ప్రజల కోసమేనని నిరూపించారు. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని కృషిచేశారు. అందరికీ అధికారం దక్కాలనేవారు. పీవీ కాలంలోనే బీసీలకు రాజకీయ ప్రోత్సాహం దక్కిందనడం కాదనలేని నిజం. ఓసారి పీసీసీ అధ్యక్షునిగా చేసిన మజ్జి తులసీదాస్‌ నేను ఒకే ఫ్లైట్‌లో వచ్చాం.. తాను పీవీ శిష్యుడినని, తమలాంటి వాళ్లకు ఆయనొక్కరే దిక్కు.. అందుకే ఆయనను ప్రేమిస్తాం అన్నారు. అంత గొప్ప వ్యక్తి. ఆశ్రయం లేనివాళ్లకు ఆశ్రయం కల్పించి.. వారిని తీర్చిదిద్ది ఉన్నత పదవులిచ్చి ఆదరించారు.

పీవీని అర్ఫన్‌ మౌలా అని పాకిస్థాన్‌కు చెందినవారే అన్నారు. విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు పీవీ పాక్‌ను సందర్శించారు. అక్కడి అధికారి మా తాజ్‌మహల్‌ తీసుకున్నారు.. అందుకు పరిహారం ఇవ్వాలన్నారట. పీవీ తడుముకోకుండా మీరు మా తక్షశిల, హరప్పా, మొహంజదారో తీసుకున్నారు కదా దానికి ఏం ఇచ్చారని ప్రశ్నించడంతో వాళ్లు మళ్లీ తాజ్‌మహల్‌ గురించి మాట్లాడలేదట. ఇలా జ్ఞానం ఉంది కాబట్టి టక్కున సమాధానం చెప్పారు.

ఢంకా భజాయించి చెప్పాలె
పీవీ మన జాతిబిడ్డ, తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయన గురించి ప్రపంచానికి వందకు వంద శాతం ఢంకా బజాయించి చెప్పాలే. పీవీ శతజయంతి ఉత్సవాలు జ్ఞానభూమిలోనేకాదు.. 51 దేశాల్లో జరుగుతున్నాయి. ఈ బాధ్యతలను మంత్రి కేటీఆర్‌ చక్కగా నిర్వహిస్తున్నారు. 33 జిల్లాల్లో హోర్డింగ్స్‌ పెట్టాలని చెప్పిన. కరీంనగర్‌, వరంగల్‌, వంగరలో కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. గల్లీలో మీటింగ్‌ పెట్టుకొని చెప్పే వ్యక్తి కాదు పీవీ. తెలంగాణ బిడ్డలు దేశమంతా గర్జించాలి. ఇతర రాష్ర్టాల్లోనూ కలకత్తా, ముంబై, ఢిల్లీలో కూడా సన్‌ ఆఫ్‌ ది సాయిల్‌ ఆఫ్‌ ఇండియా అని హోర్డింగ్‌ పెట్టారు. బహుముఖ వ్యక్తిత్వం, ధీశాలి, ప్రజ్ఞాదురంధరుడు, భాషా కోవిదుడు, స్వాతంత్ర సమరయోధుడు, సంస్కరణశీలి ఆయనలోని అన్ని కోణాలు వెలుగులోకి రావాలి. ఇందుకు కేశవరావు సరైన వ్యక్తిగా భావించి ఈ బాధ్యతలను ఆయనకే అప్పగించినం. ఈ ఉత్సవాల నిర్వహణకు రూ. 10 కోట్లు విడుదల చేశాం.

రాజీవ్‌ అన్నారని కంప్యూటర్‌ నేర్చుకున్నారు
పీవీ ఓ గొప్ప విద్యార్థి. అనుకుంటే సాధించే వరకు వదలరు కాబట్టే 17 భాషలు నేర్చుకున్నారు. రాజీవ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన పీవీతో మాట్లాడుతూ.. ‘రాబోయేదంతా కంప్యూటర్‌ యుగమండీ.. కచ్చితంగా గ్లోబ్‌ను కంప్యూటరే డామినేట్‌ చేస్తది. కానీ ఈ ముసలివాళ్లతోనే చిక్కు. వీళ్లు మార్పును స్వాగతించరు.. మారరు’ అని అన్నారు. దీంతో పీవీకి కోపం వచ్చి వెంటనే తన కూతురు వాణికి ఫోన్‌చేసి ‘నీ కంప్యూటర్‌ పట్టుకొని సాయంత్రం ఫ్లయిట్‌కే రా..’ అన్నారట. అలా కంప్యూటర్‌ నేర్చుకొని జీవితం చివరిదశ వరకు కంప్యూటర్‌ మీదే పనిచేశారు. నిరంతర విద్యార్థి, అధ్యయనశీలి. సామాజిక దృక్పథాన్ని అలవరుచుకున్న వ్యక్తి. అందుకే ఆయనను 360 డిగ్రీల పర్సనాలిటీ అని అన్నాను.

అందుకోసమే ఉత్సవాలు..
తన గ్రామం నుంచి రాష్ట్రం, దేశం, మొత్తం ప్రపంచానికే విజ్ఞానాన్ని అందించిన మహోన్నత వ్యక్తి పీవీ. అలాంటి గొప్ప వ్యక్తికి లభించాల్సినంత గౌరవం లభించలేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఎవరికో భయపడి కాదు. అందరికీ తెలుసు. అవసరమైన సందర్భంలో చెప్తాం. చేయాల్సినవారు చేయకపోవడం వల్ల మనం రాష్ట్ర ప్రభుత్వం తరపున మన బిడ్డ పీవీ పేరు ప్రఖ్యాతులను ప్రపంచవ్యాప్తం చేస్తున్నాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.